భీకర తుఫాన్లు, కార్చిచ్చులతో వణుకుతున్న యూఎస్

భీకర తుఫాన్లు, కార్చిచ్చులతో వణుకుతున్న యూఎస్
  • 35కు చేరిన మృతుల సంఖ్య
  • 2 లక్షల ఇండ్లకు కరెంటు కట్.. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

పీడ్ మాంట్: అమెరికాను వణికిస్తున్న భీకర టోర్నడోల ధాటికి ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.  గత రెండు రోజులుగా యూఎస్ లో భయంకరమైన గాలులు, కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. వీటి ధాటికి పలు నగరాల్లో ఇండ్లు, స్కూళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వాహనాలు సైతం బోల్తా పడ్డాయి. ముఖ్యంగా సెంట్రల్, సదరన్  యూఎస్​లో టోర్నడోల ప్రభావం ఎక్కువగా ఉంది. 

శనివారం సెంట్రల్ అమెరికాలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో 2 లక్షల ఇండ్లు, ఆఫీసులు చీకట్లో మగ్గిపోయాయి. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిస్సౌరీ స్టేట్​లోని వేనే కౌంటీలో మరో ఐదు మృతదేహాలను కనుగొన్నామని అధికారులు తెలిపారు. ఈ రాష్ట్రంలో డజన్ల మంది చనిపోయారని, ఇండ్లు, బిల్డింగులు కూలిపోయాయని వెల్లడించారు. కూలిపోయిన ఇండ్ల గోడలపై నుంచి తాము నడుచుకుంటూ వెళ్లామని చెప్పారు. 

అలాగే, మిసిసిపి రాష్ట్రంలోని మూడు కౌంటీల్లో ఆరుగురు చనిపోయారని ఆ రాష్ట్ర గవర్నర్  టేట్ రీవ్స్  తెలిపారు. టోర్నడోలు అలబామా రాష్ట్రంలోని ప్రవేశించాయి. అక్కడ ఇండ్లను డ్యామేజ్ చేశాయి. రోడ్లపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అర్కాన్సన్  స్టేట్ లోనూ ముగ్గురు చనిపోయారని గవర్నర్ సారా హకబీ తెలిపారు.