అభివృద్ధి ఎజెండా..ప్రజల కోసమా?ఎన్నికల కోసమా?

ప్రస్తుతం మనదేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అభివృద్ధి ఎజెండాను ఎన్నికల కోసమే రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. సామాన్యులు రోజూ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపలేని ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చేసరికి ఆయా ప్రాంతాలు, నియోజకవర్గాలపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. వారి స్వార్థ ప్రయోజనాల గురించి, వారి పార్టీ మనుగడ గురించి ఆలోచిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. దీని వల్ల ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి, ఒక నియోజకవర్గానికి మరో నియోజకవర్గానికి సామాజిక, ఆర్థిక, అభివృద్ధి విషయాల్లో చాలా తేడా కనపడుతోంది. దీనికి దుబ్బాక ఉప ఎన్నికే ఒక ఉదాహరణ. సీఎం, ఆయన కొడుకు, అల్లుడు నియోజకవర్గాలు పక్కనే ఉన్న దుబ్బాక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇది గ్రహించిన దుబ్బాక ప్రజలు ఉప ఎన్నికలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా తీర్పు ఇచ్చారు.

మేనిఫెస్టోల్లో అన్నీ ఉచిత స్కీములే 

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలను గమనిస్తే.. పార్టీల మేనిఫెస్టోలన్నీ ఉచిత హామీలతో నిండిపోయాయి. ముఖ్యంగా తమిళనాడులో ఉచిత పథకాల ప్రకటనలు చాలానే ఉన్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రెండూ కూడా ఒకదానిని మించి మరొకటి ఫ్రీ స్కీములను ప్రకటించాయి. అయితే మద్రాస్​ హైకోర్ట్ ఉచిత పథకాల గూర్చి కొన్ని కీలక కామెంట్లు చేసింది. ఇలాంటి స్కీముల అమలు గురించి ఆలోచించడం కన్నా.. ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన విషయం ఆలోచించాలని అభిప్రాయపడింది. ఫ్రీ స్కీముల వల్ల పనిచేయకుండా ప్రభుత్వ పథకాల మీద బతికేయవచ్చనే ధోరణి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి డీఎంకే, అన్నాడీఎంకే మేనిఫెస్టోలు ప్రజలను మరింత సోమరిపోతులను చేసేవిగా ఉన్నాయి. వీటి విషయంలో ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఉచిత పథకాలు ఇచ్చే పార్టీలకే వంత పాడితే సమాజంలో, ముఖ్యంగా బడుగు, బలహీన, గిరిజన, మైనారిటీ వర్గాల్లో మార్పు అసాధ్యం. 

బతుకులు ఎట్ల మారుతయ్​

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మేనిఫెస్టోలు, ఉచిత పథకాలు ప్రకటిస్తే ప్రజల బతుకులు ఎలా మారతాయి? ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వడం లేదు. విద్య, ఆరోగ్య రంగాల్లో ఖాళీలను సగం కూడా భర్తీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం వేసిన ముగ్గురు సభ్యుల కమిటీ తేల్చి చెప్పింది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ముందు 50 వేల ఉద్యోగాలకు ప్రకటనలు ఇస్తామని చెప్పి ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నిరుద్యోగ భృతి గురించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ల ముందే గుర్తు రావడం నిరుద్యోగ యువతను పక్కదారి పట్టించడమే అవుతుంది. గత ప్రభుత్వాలు ఏం చేశాయో.. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోందో.. పార్టీలు ఎలా ఉన్నాయో, ఎవరి మనుగడ కోసం పనిచేస్తున్నాయో తెలంగాణ ప్రజలకు తెలిసి వచ్చింది. అందుకే ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యమాల పురిటిగడ్డ అయిన తెలంగాణలోని యువత వారసత్వ మూలాలను మరువలేదు. పాలకుల స్వభావాన్ని గ్రహించి తగిన గుణపాఠం చెప్పడానికి ఎదురుచూస్తున్నారు. ఉద్యమ పార్టీ అయి కూడా మనకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా, మన అభివృద్ధిని కాంక్షించకుండా, తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా మరిచిపోయి పాలన చేస్తోంది. అందువల్ల నాగార్జునసాగర్ ప్రజలు ఇప్పటి పాలకులకు గత చరిత్ర పాఠాలు గుర్తువచ్చేలా ఉప ఎన్నికలో చారిత్రక తీర్పును ఇవ్వాలి.
                                                    - రేకులపల్లి  భాస్కర్ రెడ్డి,తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ మెంబర్
 

ఉప ఎన్నిక రాగానే సమస్యలు గుర్తొచ్చాయా?

మన రాష్ట్రం విషయానికి వస్తే.. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వచ్చింది. ఏడేండ్లుగా నాగార్జునసాగర్ సమస్యలను పట్టించుకున్న నాథుడే లేడు. కానీ ఉప ఎన్నిక రాగానే వరాల జల్లు కురిపించడానికి కారణం ప్రజావ్యతిరేకతను తట్టుకోవడం, వారి పార్టీల మనుగడ కాపాడుకోవడమే అని ప్రజలకూ అర్థమవుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించి వివిధ ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఏడేండ్లుగా కనపడని సమస్యలు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వ దృష్టికి వెళ్లడం, శంకుస్థాపనల పేరిట హడావుడి చేయడం దేనికి సంకేతం?  హాలియా సభలో నాగార్జునసాగర్ లో డిగ్రీ కాలేజ్ లేదని సీఎంకు గుర్తురావడం విడ్డూరం. ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై తక్షణం స్పందించకపోగా, వారి మనుగడ కోసం, వారి పార్టీని కాపాడుకోవడం కోసం ప్రజలను వాడుకోవడం దివాలాకోరుతనానికి నిదర్శనం.