నూతన ఆర్థిక విధానాల పర్యవసానంగా మన సమాజంలో ఆర్థిక అసమానతలు అనేక రెట్లు పెరిగిపోయినాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్య వ్యవస్థలను ప్రభుత్వ రంగం నుంచి అతి శీఘ్రంగా ఉపసంహరిస్తున్న తీరు పేద ప్రజలపై పెను భారంగా మారింది. ఇద్దరు పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించాలంటే ప్రస్తుత తరుణంలో ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు అవసరమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ విద్య నిర్వీర్యం కావడంతో 50% తెలంగాణ కుటుంబాలు ఉన్నత విద్యకు దూరమయ్యారు. వైద్యం ఖర్చులు కూడా అదేవిధంగా పెరిగిపోయినాయి.
గత పది సంవత్సరాల నుంచి వ్యవసాయ, అసంఘటిత రంగాల్లో శ్రమిస్తున్న కోట్లాది కార్మికులు, శ్రామికుల నికర ఆదాయం ఎంతో కొంత పెరిగినప్పటికీ జీవనవ్యయం అనేక రెట్లు పెరిగి పేద ప్రజల నడ్డి విరుస్తున్నది. వీధి వీధికి గల్లీ గల్లీ కి సర్కారు మద్యం వ్యాపారం ఏరులై పారుతుంటే పేద ప్రజలను మరింత కుంగ దీస్తున్నది. విద్య, వైద్యం ఖర్చులు, నిత్యావసర సరుకుల ధరలు సామాన్య మానవుని ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసినాయి. దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో ధరలు పెరిగినట్లు అధికారిక గణాంకాలు తెలియ జేస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో పాటు అప్పుల భారం పెరగడం వల్ల గత పది సంవత్సరాల నుంచి తెలంగాణలో అనేక కుటుంబాలు మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరో పక్క బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా కార్పొరేట్ సంస్థల రాజకీయ అధికారం ఉన్న కుటుంబాల ఆస్తులు వేలకోట్లకు చేరుకున్నాయి. బంగారు తెలంగాణ కేవలం కార్పొరేట్లకు, కొద్ది కుటుంబాలకు, అధికారం పొందిన నాయకులకు మాత్రమే దక్కిందని ప్రజలు తీవ్ర ఆందోళనలో పడ్డారు.
పథకాలు మూరెడు, అమలు జానెడు
పేద ప్రజల అభివృద్ధి ఈ ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల ద్వారా జరుగుతుందనే కలలు,ఆశలు కల్లలయినాయి. కనీసం పార్టీలు, ప్రభుత్వాలు ప్రకటించిన సంక్షేమ పథకాలు అయినా సక్రమంగా అమలు చేస్తే ఈ కుటుంబాలు కనీసం గౌరవప్రదంగా బ్రతుకుతాయి. మన రాష్ట్రంలో అనేక పథకాలు ప్రకటించి ప్రచారాలకే పరిమితం చేయడం జరిగింది. పేదల కోసం ప్రకటించిన ఆసరా పింఛన్లు తప్ప ఇతర సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రకటనలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితమైనాయి. మోసానికి గురి అవుతున్నామని బాధిత ప్రజలు ఆవేదన పడుతున్నారు. దళిత బంధు బీసీ బందు, గృహలక్ష్మి, విదేశీ విద్యార్థులకు ఆర్థిక సహాయం మూడు ఎకరాల భూమి, ఫీజు రీయింబరియింబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ పథకం నత్తనడక, నిరుద్యోగుల భృతి, రైతుల బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీలు, పంట బీమా పథకం, రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీ అడుగు ముందుకు పడలేదు. ఇక ఆడపిల్లల చదువు చట్టబండలు చేసి కళ్యాణ లక్ష్మితో ఒరిగేదేమీ లేదని పాలకులకు తెలియనిది కాదు.
కాంగ్రెస్ గ్యారంటీలు
ఇటీవల జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముందు పేద ప్రజలను ఉద్దేశించి అనేక సంక్షేమ పథకాలను ప్రజల ముందు ఉంచారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు ప్రతినెల 200 యూనిట్ల ఉచిత కరెంటు, పేద మహిళలకు ప్రతినెల 2,500 నగదు బదిలీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఐదు లక్షల రూపాయల గ్రాంట్, వృద్ధులకు 4000 రూపాయల నెలవారీ చేయూత మొదలగు పథకాలను ప్రకటించారు. రైతులకు కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా కొన్ని పథకాలను ప్రకటించడం జరిగింది. పేద మహిళలకు ప్రతినెల 2500 రూపాయలు ఇవ్వడం స్వాగతించవలసిందే. వంటగ్యాసు 500 రూపాయలకే సిలిండర్ కూడా కొంత ఊరట కలిగిస్తుంది. 200 యూనిట్ల ఎలక్ట్రిసిటీ చార్జెస్ మాఫీ చేయడం కూడా పేద ప్రజలకు మరింత వెసులుబాటు కలుగుతుంది.
జీవన వ్యయం పెరిగినందువలన ఈ పథకాల వలన పేద కుటుంబాలకు కొంత ఊరట కలిగిస్తుంది.అనేక గ్రామాల్లో పట్టణాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి జీవితకాలం నష్టపోయిన వేలాదిమంది యువతీ యువకులు తెరాస ప్రభుత్వం గుర్తించలేదని తీవ్ర నిరాశలో ఉన్న సందర్భంలో సోనియాగాంధీ ప్రతి ఉద్యమకారునికి 250 గజముల ఇంటి స్థలం ప్రకటించడం కూడా స్వాగతించవలసిందే. ఇప్పటికైనా జాతీయ పార్టీలు ప్రాంతీయ సమస్యలను ప్రత్యక్షంగా పట్టించుకునే రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అవసరమని గుర్తించడం మంచి నిర్ణయం. దోచుకొని దాచుకొని ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమైనాయి. జాతీయ పార్టీల నాయకత్వం సాధ్యాసాధ్యాలను గమనించే ఈ పథకాలను అంగీకరించి ప్రకటించడం జరిగిందని ప్రజలు భావిస్తారు. ప్రకటించిన పథకాలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత జాతీయ పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర నాయకుల పై మరింత ఆధారపడి ఉందని గుర్తించాలి.
అవినీతి లేకుంటే.. అన్ని పథకాలూ అమలు చేయొచ్చు
ఇక భారతీయ జనతా పార్టీ కూడా పేద ప్రజల పట్ల ఎలాంటి సంక్షేమ పథకాలను వినూత్నమైన కార్యక్రమాలను ప్రకటిస్తుందో వేచి చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. విసిగి వేసారిన తెలంగాణ ప్రజలకు మళ్లీ ఐదు సంవత్సరాలు చేదు అనుభవాలు రాకూడదని తెలంగాణ ఉద్యమకారులు, విద్యావంతులు, మేధావులు కార్మిక కర్షక మహిళా సంఘాలు కోరుకుంటున్నాయి. అధికార పార్టీలు దోచుకొని దాచుకొన్న విధానాన్ని మానుకుంటే సంక్షేమ పథకాలు ఎన్నైనా అమలు చేయవచ్చు. అవినీతిపరంగా నాయకులు కొంతమంది అధికారులు కార్పొరేట్ సంస్థలు కలిసి క్విడ్ ప్రో కో పద్ధతిలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు చేయకుండా.. తెలంగాణలో రాబోయే ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే అన్ని పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు పరచవచ్చు, చేసిన అప్పులను కూడా కష్టపడి తీర్చుకోవచ్చు.
ఓట్లు దండుకోవడం తప్ప ప్రజలు పట్టరు
ఓటు బ్యాంకు రాజకీయాలకు రాజకీయాన్ని వ్యాపారంగా చేసి కుటుంబ ఆధిపత్యంలో ఉంటున్న ప్రాంతీయ పార్టీలకు సంక్షేమ పథకాలు అంది వచ్చిన అవకాశం. ప్రజలను మభ్యపెట్టి ఓట్లను దండుకోవడానికి ఉపయోగపడే సాధనంగా మారింది. ప్రప్రథమంగా సంక్షేమ పథకాలు తమిళనాడులో ఆరంభమైనాయి, ఇక అన్ని రాష్ట్రాలకు కూడా అవి విస్తరిస్తున్నాయి. జాతీయ పార్టీలు కూడా అమలు చేయక తప్పడం లేదు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు సంక్షేమ పథకాల నమూనాను తమిళనాడు రాష్ట్రం నుంచి కాపీ చేస్తున్నాయి. దేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రమే సంక్షేమ పథకాలకు అడ్రస్ కాదని భజన మండలి గుర్తిస్తే మంచిది. టీఆర్ఎస్ 2014,18 ఎన్నికల ముందు రకరకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రకటించింది. వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కొరకు తెలంగాణ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా చేసింది. ఈ ప్రాజెక్టుల వ్యయం రెండు మూడు రెట్లు పెంచి డబ్బంతా వృథా అయ్యిందని విశ్రాంత ఇంజనీర్లు ఆర్థిక నిపుణులు అనుభవజ్ఞులైన పరిపాలనాధ్యక్షులు, కాంట్రాక్టర్లు అనేక సందర్భాల్లో చర్చించడం జరిగింది.
– కూరపాటి
వెంకట్ నారాయణ
రిటైర్డ్ ప్రొఫెసర్