ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కొడిమ్యాల, వెలుగు: తెలంగాణలో అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ లో 32 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చొప్పదండి: మండలానికి చెందిన 63 మందికి మంజూరైన 67,07, 308 విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే రవిశంకర్​ తన క్యాంపు ఆఫీసులో అందజేశారు. అనంతరం పట్టణంలో పెరిగిన ఇంటి పన్నులు తగ్గించాలని కోరుతూ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ రవీందర్​, తహసీల్దార్​ రజిత, మున్సిపల్​ వైస్​ చైర్మన్​ విజయలక్ష్మి పాల్గొన్నారు. 

గంగాధర : మండలంలోని బూరుగుపల్లికి చెందిన లంక నారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా అతని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రవిశంకర్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ చిత్రపటానికి నివాళులర్పించారు. 

నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యమివ్వండి

రాజన్న సిరిసిల్ల, వెలుగు : ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో నార్మల్ డెలవరీలపై ఫోకస్​చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆశా, అంగన్‌‌వాడీ, ఆరోగ్య కార్యకర్తల సమన్వయంతో గర్భిణుల వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లాలో వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయని డెంగీ, టైపాయిడ్, చికున్ గున్యా తదితర కేసులు, కలుషిత నీటి వల్ల  సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. సమావేశంలో డీఎంహెచ్​ఓ సుమన్ మోహన్ రావు, జిల్లా డిప్యూటీ వైద్యాధికారులు శ్రీరాములు, రజిత తదితరులు పాల్గొన్నారు. 

శిశువును విక్రయించేందుకు యత్నం?

అమ్మమ్మ, తాతకు పోలీసుల కౌన్సెలింగ్​

గోదావరిఖని, వెలుగు : గవర్నమెంట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో జన్మించిన ఓ మగ శిశువును విక్రయించేందుకు  ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డు అడ్డుకున్న ఘటన గోదావరిఖని గవర్నమెంట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో జరిగింది. ఎన్టీపీసీ సమీపంలోని జంగాలపల్లికి చెందిన ఓ మహిళకు విడాకులు అయ్యాయి. స్థానిక కేసీఆర్‌‌‌‌ కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్‌‌‌‌ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. అనంతరం అతను కనిపించకుండా పోయాడు. అక్టోబర్​13న సదరు మహిళ జనరల్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో మగ శిశువుకు జన్మనిచ్చింది. బుధవారం తెల్లవారుజామున తల్లి పక్కనున్న శిశువును అమ్మమ్మ బట్టలో చుట్టుకుని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. గేట్‌‌‌‌ వద్దకు రాగా అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డు శిశువును చూసి ఈ సమయంలో ఎటు తీసుకెళుతున్నావని అడగగా సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి శిశువును తల్లి వద్దకు చేర్చారు. మళ్లీ పెళ్లి కాకుండానే శిశువుకు జన్మనివ్వడం, ప్లాస్టిక్‌‌‌‌ కవర్లు సేకరించి పొట్టపోసుకునే కుటుంబం కావడంతో శిశువును విక్రయించేందుకు అమ్మమ్మ ప్రయత్నించినట్టుగా అనుమానిస్తున్నారు. గోదావరిఖని పోలీసులు శిశువు అమ్మమ్మ, తాతను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్‌‌‌‌ చేశారు.

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

కరీంనగర్ సిటీ, వెలుగు:  మంచిర్యాల, కరీంనగర్ పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలు చేసిన మంచిర్యాలకు చెందిన సయ్యద్ అఖర్ అలీ(19)ని పోలీసులు బుధవారం అరెస్ట్​చేశారు. కరీంనగర్ వన్ టౌన్ సీఐ నటేశ్​కథనం ప్రకారం.. అఖర్ అలీ గతంలో చోరీలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు. అక్టోబర్​8-న రాత్రి కరీంనగర్ లో శ్రీనివాస్ థియేటర్ ఎదురుగా ఉన్న ఇంట్లో తాళం పగలగొట్టి విలువైన వస్తువులు అపహరించాడని, అదే రాత్రి బొమ్మకల్ బైపాస్ ఏరియాలో మరో ఇంటి తాళం పగలగొట్టి బంగారం, వెండి వస్తువులు, నగదు దొంగలించినట్లు తెలిపారు. బుధవారం అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని విచారణ చేయగా నేరాలు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. 

దోపిడీ దొంగ..

కరీంనగర్ క్రైం:బైక్​లపై వెళుతున్నవారిని లిఫ్ట్ అడిగి మార్గమధ్యంలో వారిని చితకబాది దోపిడీ చేసే దొంగను బుధవారం కరీంనగర్ టు టౌన్‍లో పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన లక్కపాక కిరణ్ కుమార్(26) కొంత కాలంగా దోపిడీలకు పాల్పడుతున్నాడు. అక్టోబర్​17న పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‍ మండలం మంగపేటకు చెందిన సాయిప్రసన్నశర్మ(25) పనిమీద కరీంనగర్ వచ్చి  వెళుతున్న సమయంలో లిఫ్ట్ అడిగి మార్గమధ్యంలో ఆపి దాడిచేసి బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు కరీంనగర్​లో అతడిని అరెస్ట్ చేశారు.

చెప్పులకు మట్టి అంటిందని..స్టూడెంట్లను చితకబాదిన టీచర్​

తిమ్మాపూర్, వెలుగు: చెప్పులకు మట్టి అంటితే దులుపుకున్న స్టూడెంట్లను ఓ ఉపాధ్యాయిని చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ బాయ్స్​హైస్కూల్​లో ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం రాంచరణ్ తేజ్, విష్ణువర్ధన్, ఇస్లావత్ ఆదర్శ్, శివకుమార్, విష్ణు, ప్రవీణ్ అనే విద్యార్థులు శనివారం పాఠశాలకు వచ్చారు. వర్షం కారణంగా వారి చెప్పులకు మట్టి ఆంటడంతో వరండాలోని మెట్లపై దూలిపే ప్రయత్నం చేశారు. దీంతో బయోలజీ టీచర్​రాజ్యలక్ష్మి కర్రతో చితకబాదడంతో ఆరుగురు స్టూడెంట్లకు కాళ్లు, చేతులు, వీపు భాగాలలో తీవ్ర గాయలయ్యాయి. అనంతరం విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు మంగళవారం స్కూల్​కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోకపోతే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్కూల్​హెడ్మాస్టర్​మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తల్లిడండ్రులకు సర్దిచెప్పినట్లు తెలిసింది. ఘటన జరిగిన తరువాత టీచర్​రాజ్యలక్ష్మి పాఠశాలకు రాకుండా సెలవులో ఉండటం గమనార్హం.

మోడీ సంక్షేమ పథకాలపై ప్రచారం

సుల్తానాబాద్, వెలుగు: పట్టణంలోని సుభాష్ నగర్ లో బుధవారం బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పథకాల కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. వారిలో బస్తీ సంపర్క్ అభియాన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో కన్వీనర్ జాడి బాల్ రెడ్డి, ఆరేపల్లి రాకేశ్, వెంకటేశ్ గౌడ్, వేణు, శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. 

దీపావళి తర్వాత ఇళ్లు ఖాళీ చేయాలి

వేములవాడ, వెలుగు : బద్ధిపోచమ్మ ఆలయ విస్తరణలో భాగంగా నష్టపరిహారం పొందిన వారు దీపావళి తర్వాత ఇళ్లు ఖాళీ చేయాలని ఆర్డీఓ పవన్ కుమార్ అన్నారు. బుధవారం వేములవాడ ఆలయ పరిసరాల్లోని ఇళ్ల యాజమానులతో ఆయన మాట్లాడారు. బాధితులకు 6 నెలల క్రితమే మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లించినా ఇప్పటికీ ఖాళీ చేయలేదన్నారు. దీపావళి అనంతరం 2వ రోజు జేసీబీలతో బిల్డింగ్​లు కూల్చివేస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రాజిరెడ్డి, సీఐ వెంకటేశ్​ఉన్నారు. 

మార్కెట్ కు ఏడు రోజుల సెలవులు​

జమ్మికుంట, వెలుగు: స్థానిక వ్యవసాయ మార్కెట్ కు అక్టోబర్​26 వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి రెడ్యా నాయక్​ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అధిక వర్షాల వల్ల పత్తి తడిసిపోవడంతో తేమ శాతం అధికంగా ఉంటుందని, వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రావడం లేదన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక వ్యాపారుల కోరిక మేరకు 20, 21న సెలవు ప్రకటించారు. 22,23 తేదీలు సాధారణ సెలవులని, 24, 25 దీపావళి పండుగ సెలవులని, 26 నోములు కావడంతో మార్కెట్ యార్డుకు ఏడు రోజులు సెలవులు వచ్చాయన్నారు. రైతులు గమనించాలని రెడ్యానాయక్​విజ్ఞప్తి చేశారు. 27న గురువారం మార్కెట్​ ప్రారంభమవుతుందన్నారు.