కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం వల్లనే అభివృద్ధిని కోల్పోయారు : మంత్రి ఎర్రబెల్లి

నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు నియోజకవర్గంలో ప్రతి ఊరు, గల్లీ, ప్రతి ఇళ్ళు తిరుగుతూ ప్రచారం ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో  మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకరరావు ప్రచారం నిర్వహించారు. చండూర్ పురపాలికలోని రెండవ వార్డులో  ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన...  టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి  వివరించారు. గతంలో మీరు ఈ నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే..  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం వలనే  అభివృద్ధిని కోల్పోయారని అక్కడి ప్రజలతో చెప్పారు. ఆ తప్పిదం మరల జరగకుండా టీఆర్ఎస్ పార్టీ  అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి ఎర్రెబెల్లి దయాకరరావు కోరారు.

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు.. హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. ‘గడప గడప’కి ప్రచారంలో భాగంగా బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ... స్పెషల్ ఫోకస్ పెట్టింది. పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. గెలుపే లక్ష్యంగా పోరాటం సాగిస్తోంది.