గుజరాత్ అభివృద్ధి కొన్నిచోట్లే!

‘మోడీ జమానా ….అభివృద్ధికి చిరునామా ’ అని బీజేపీ తరచూ చెబుతోంది. డెవలప్ మెంట్ కుగుజరాత్ ను ఒక మోడల్ లా చూపిస్తుంటుంది. రాష్ట్రం అంతా అభివృద్ధిలో దూసుకుపోయిందనిప్రచారం చేసుకుంటుంది . అయితే గుజరాత్ లో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి .దీనికోసం మొత్తం 33 జిల్లాలను పరిశీలించాల్సిన అవసరం లేదు. దేశంలోనే అతి పెద్దదైన కచ్జిల్లా ను చూస్తే చాలు. అక్కడి శివారు గ్రామాల్లో పరిస్థితులు చూస్తే గుజరాత్ మోడల్ అసలురంగు బయటపడుతుంది.

 

గుజరాత్ సీఎంగా దాదాపు 12 ఏళ్లకు పైగాపనిచేసిన నరేంద్ర మోడీ ఆ రాష్ట్రాన్ని ప్రగతిదిశగా పరుగులు పెట్టించారని, అభివృద్ధిలో దేశానికి నమూనాగా మలిచారని కమలనాథులు గుక్క తిప్పుకోకుండా చెబుతుంటారు. ఆ ప్రచారంతోనే 2014జనరల్ ఎలక్షన్ లో విజయం సాధించి కేంద్రం లో అధికారం చేపట్టారు. మోడీ సీఎంగా ఉన్నప్పుడే గుజరాత్ ఓ రేంజ్ లో డెవలప్ అయిందంటే ఆయన పీఎం అయిన తర్వాత మరెంత ప్రగతి సాధించిందో అనే ఆసక్తి నెలకొంటుంది. రాష్ట్రంలోని కచ్ జిల్లాకు మోడీ మనసులో ప్రత్యేక స్థానం ఉందని పార్టీ నేతలు అంటుంటారు. ఈ జిల్లా బన్ని గ్రాస్ భూములతో పాటు రాణ్ ఉత్సవానికి కూడా ప్రసిద్ధే. ఏటా చలికాలంలో నాలుగు నెలల పాటు జరిగే ఈ ఫెస్టివల్ కి మోడీ తప్పకుండా వస్తారు. కచ్ కి ఐకానిక్ గా నిలిచిన ఎడారిలో నిర్వహించే ఆ తిరునాళ భూతల స్వర్గాన్నితలపిస్తుంది. ఈ పండుగ జరిగే ప్రాంతం పేరు ధోర్దో. ఈ ఏరియాని స్థానికులు మోడల్ విలేజ్ అని గర్వంగా భావిస్తుంటారు. అక్కడి సౌకర్యాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి.

కరెంట్, రోడ్డు, నీళ్లు.. ఏవీ లేవు
రాణ్ ఈవెంట్ కోసం ప్రభుత్వం ధోర్దో పల్లెలో సకలసదుపాయాలనూ కల్పించింది. అక్కడి నుంచి 15కిలో మీటర్ల దూరంలోని శివారు గ్రామాలకు వెళితేగానీ రాష్ట్రం ఎంత బాగా అభివృద్ధి చెందిందనే అసలు విషయం అర్థం కాదు. అసలు ఆ ఊళ్లకు చేరుకోవటానికి సరైన దారే లేదంటే నమ్మబుద్ధి కాదు. అడుగడుగునా బురదతో కూడిన ఆ రోడ్డులో నాలుగు చక్రాల వాహనం ఒక్కటి ప్రయాణించటమే గగనం. ఆ ఇరుకు మార్గానికి రెండు వైపులా ఉండే ముళ్ల చెట్లువచ్చీ పోయే జనానికి గుచ్చుకుంటూ గాయాలు పాలుచేస్తుంటాయి. భితారా వంద్ , నానా భితారా అనే రెండు విలేజ్ ల లో సుమారు వెయ్యి మంది జనాభా ఉంటారు. వాళ్లుమెయిన్ రోడ్డుకి వెళ్లాలంటే 10 కిలోమీటర్లు నడవాలి.ఊళ్ల లో కరెంట్ లేకపోవటంతో సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టు కోవటానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని భితార అనే గ్రామానికి పోక తప్పదు. కుంటలు, ప్రభుత్వం పంపే ట్యాంకులే నీళ్లకు దిక్కు. ట్యాంకులు కూడా రోజూ రావు. ఐదారు రోజులకు ఒకసారి వస్తుంటాయి. కుంటల్లోని నీళ్లు ఉప్పగా, ఆకుపచ్చగా ఉండటంతో తాగటానికి పనికి రావట్లేదు.

ఎటుచూసినా కరువే!
గుజరాత్ లోని ప్రస్తుత పరిస్థితులు ఆ రాష్ట్రంలోగత 30 ఏళ్లలో నెలకొన్న అత్యంత కరువును గుర్తుచేస్తున్నాయి. కచ్ లో అయితే మరీ ఘోరం. మూడుదశాబ్దాల వార్షిక సగటు వర్షపాతంలో 26 శాతమే ఈ జిల్లాలో నమోదైంది. గుజరాత్ లో పోయిన ఏడాది నైరుతి రుతుపవనాల వల్ల కురవాల్సిన వానల్లో సరాసరి 76 శాతమే పడ్డాయి. కరువును ఎదుర్కొంటున్న ప్రాంతాలు రాష్ట్రవ్యాప్తంగా చాలా ఉన్నాయి. కానీ ఈ విషయాలు మీడియాలో రాకుండా మేనేజ్ చేస్తున్నారు. శివారు గ్రామాల్లో కనీస సదుపాయాలు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భితారావంద్, నానా భితారా విలేజ్ ల్ లో కరెంట్ సౌకర్యంలేక పోవటంతో గోధుమలు, జొన్నలు, సజ్జలు వంటి తిండి గింజలు పిండి పట్టించాలంటే ఖవ్డ, దయాపర్గ్రామాల వరకూ వెళ్లాలి. లేదంటే అక్కడి నుంచి ఎవరైనా ఫ్లోర్ మిల్లును ట్రాక్టర్ పై పెట్టుకొని తేవాలి. పది కిలోల పిండి పడితే రూ.20 తీసుకుంటారు. ఖర్ద్, దయాపర్ అనే ఈ ఊళ్లు అటో దిక్కు, ఇటో దిక్కుగా ఉంటాయి. వాటి మధ్య దూరం 50 కిలోమీటర్లు పైనే. ఆసియాలో అత్యు త్తమ గడ్డి భూములకు కచ్ జిల్లాలోని బన్ని ప్రాంతం నిలయం. జిల్లా కేంద్రమైన భుజ్ కి ఉత్తరాన 2500 చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఈగ్రాస్ ల్యాండ్స్ విస్తరించి ఉండేవి. కరువు వల్ల ఇప్పుడు ఆ ప్రాంతంలో పచ్చగడ్డి మాయమైంది. భితారా వంద్, నానా భితారా వంటి 110 శివారు గ్రామాలు ఈమారుమూల ప్రాంతంలో ఉన్నాయి. కచ్ కి తూర్పునఉన్న రాపర్ బ్లాక్ లో 260 చిన్న ఊళ్లు ఉన్నట్లు రీసెంట్సర్వేలో తేలింది. 2011 సెన్సస్ ప్రకారం రెవెన్యూవిలేజ్ ల సంఖ్య 97. కొన్ని బ్లాకుల్లో అయితే అసలు ఇలాంటి డేటాయే అందుబాటులో లేదు.

23 ఏళ్లుగా బీజేపీ ఎంపీయే
కచ్ లోక్ సభ నియోజకవర్గంలో 1996 నుంచి బీజేపీ అభ్యర్థే విజయం సాధిస్తున్నాడు. ఇది ఎస్సీ రిజర్వ్ సీటు కావటంతో ఆ పార్టీ నుంచి మళ్లీ వినోద్ చావ్డా అనే క్యాండిడేటే పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇతను కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజారిటీ (2.5 లక్షలఓట్ల తేడా)తో గెలిచాడు. ప్రజలు అంతగా ఆదరిస్తున్నాఆయన మాత్రం ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా శివారు గ్రామాలకు వెళ్లిన పాపాన పోలేదు. వినోద్ ను కనీసం ఒక్కసారి కూడా చూడలేదని స్థానిక ఓటర్లు అంటున్నారు. ఈ ఎంపీ సంగతి వదిలేస్తే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 12 ఏళ్లకు పైగా ఉన్న నరేంద్ర మోడీ ఐదేళ్ల కిందట ప్రధానమంత్రి కూడా అయ్యారు. కానీ కచ్ ప్రాంతంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించట్లేదు. కనీస వసతులే కల్పించలేకపోయారంటే ఈ జిల్లా పైన, లోక్ సభసెగ్మెంట్ పైన ఆయనకు ఎంత నిజమైన ప్రేమ ఉందో అర్థమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు.
–‘వైర్’ సౌజన్యంతో

 

పెట్టు బడులన్నీ 4 జిల్లాలకే
గత ఐదేళ్లలో గుజరాత్ కి వచ్చిన పారిశ్రామిక పెట్టు బడుల్లో 75 శాతం నాలుగు జిల్లాలకే తరలిపోయాయి. ఐదు జిల్లాలకు రూపాయి కూడా దక్కలేదు. 28 శాతం ఇన్వెస్టిమెంట్ తో అహ్మదాబాద్ టాప్ లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో కచ్ , సూరత్, భరుచ్ ఉన్నా యి. కచ్కు పెట్టు బడులు, ప్రాజెక్టులు వచ్చినా వాటిఫలాలు జిల్లాలోని మారుమూల ప్రాంతాల కుఅందట్లేదు. తూర్పు గిరిజన జిల్లాలకూ ఇన్వెస్ట్మెంట్లు వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి .ప్రాజెక్టుల్లో ని ఉద్యోగాలు రాష్ట్ర యువతకేదక్కేలా వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ఏర్పాటు చేయాలి.

 

ఈ గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లెక్కలప్రకారం కచ్ జిల్లాలోని మొత్తం 918 రెవెన్యూ విలేజ్ లలో 11 గ్రామాలకు కరెంట్ సదుపాయం లేదు. 49 పల్లెల్లో విద్యుత్ సౌకర్యం ఉన్నా రోజులో 12 గంటల లోపుకే పరిమితం. పైపుల ద్వారా నీరు అందని ఊళ్లు51. మరో 68 గ్రామాల్లోని 50 శాతం పల్లెలకు నీటి వసతి అందుబాటు లోకి రాలేదు. పక్కారోడ్లు లేని పల్లెలు దాదాపు 57. ఈ గణాంకాలన్నీ రెవెన్యూ విలేజ్ లకు సంబంధించినవే. ప్రభుత్వ రికార్డుల్లో కి ఎక్కని ఇలాంటి శివారు గ్రామాలు ఇంకెన్నో ఉన్నాయి.