
చండూరు, వెలుగు : పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులపై అధికారులతో గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2035 వరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ జనాభా రెండు లక్షలకు పైగా పెరుగుతుందని, అందుకనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.
చౌటుప్పల్ పట్టణంలోని రోడ్లన్నీ వెడల్పు చేయాలని, 100, 80, 50 ఫీట్ల వెడల్పుల్లో రోడ్లు ఉండేలా చూడాలని చెప్పారు. చిన్న కొండూరు రోడ్డును 80 ఫీట్ల వెడల్పు, తంగడపల్లి వలిగొండ రోడ్లను 100 ఫీట్ల వెడల్పు చేయాలని, సర్వీస్ రోడ్ల వెడల్పు శాస్త్రీయంగా జరగలన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని ఊరచెరువు అలుగు ద్వారా వచ్చే నీటిని సర్వీస్ రోడ్ కింది నుంచి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. రెండు మున్సిపాలిటీల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ భవనాలు నిర్మించేందుకు స్థలాలను గుర్తించాలని సూచించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని తెలిపారు.