ప్రపంచంలో చాలా దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అవినీతి ఒకటి. లంచం లేనిదే ప్రభుత్వ ఆఫీసుల్లోనే కాదు.. కొన్ని ప్రైవేటు వ్యవస్థల్లో కూడా పని జరగడం లేదు. దీని వల్ల సామాన్యుల కష్టార్జితం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతోంది. అన్ని స్థాయిల్లో అవినీతి దందా పెరిగిపోవడం వల్ల పేదలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫలాలు కూడా చేరడం లేదు. పన్నుల రూపంలో ప్రజలు కట్టే సొమ్ము సైతం దుర్వినియోగం అవుతోంది. ప్రభుత్వాలు తలపెట్టే అభివృద్ధి పనులకు నాణ్యత లేకుండా పదేపదే వృథా ఖర్చులు పెరిగిపోతున్నాయి. దోపిడీ పెరిగి కొద్ది మంది అపర కుబేరులైపోతున్నారు తప్ప దేశం కూడా బాగుపడడం లేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంలానే మిగిలిపోవడం ఖాయం. ఇది ఒక్క ఇండియా సమస్య మాత్రమే కాదు.. ప్రపంచంలో చాలా దేశాలు అవినీతి భూతంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందుకే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2003 అక్టోబర్ 31న అవినీతి నిర్మూలనపై సదస్సు నిర్వహించింది. సమర్థంగా కరప్షన్ కంట్రోల్ చేసేందుకు యాంటీ కరప్షన్ కన్వెన్షన్ సెక్రటేరియట్ ఏర్పాటు చేసి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యూఎన్ఓడీసీ) కు బాధ్యతలు అప్పగించింది. అలాగే అవినీతి నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వాలను, వ్యవస్థలను సన్నద్ధం
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడంలో అతిపెద్ద అవరోధాల్లో ఒకటైన అవినీతిని నిర్మూలించాలని అన్ని దేశాలకు ఐక్యరాజ్య సమితి సూచించింది. ఐక్యరాజ్య సమితి డేటా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్ష కోట్ల డాలర్లు లంచంగా ప్రజలు చెల్లిస్తున్నారు. అలాగే ఇతర మార్గాల్లో ప్రతి సంవత్సరం 2.26 ట్రిలియన్ డాలర్లు సొమ్ము అవినీతిపరుల పాలవుతోంది. ఇది ప్రపంచ జీడీపీలో 5 శాతానికి సమానం. అన్ని దేశాల్లోనూ అవినీతి వల్ల స్వేచ్ఛగా, ప్రజలకు ఉపయోగపడే రీతిలో పని చేయాల్సిన వ్యవస్థలు, సంస్థలు బలహీనపడుతున్నాయి. దీంతో ప్రజల ఆర్థికాభివృద్ధిపై దెబ్బ పడుతోంది. కేవలం అవినీతి, లంచాల మూలంగా ప్రభుత్వాలే కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి.
చట్టాలు కఠినంగా అమలైతేనే
మన దేశంలో అవినీతి నియంత్రణకు కఠిన చట్టాలు చాలానే ఉన్నాయి. కానీ ఎవరైనా అవినీతి చేస్తూ పట్టుబడినా, భారీ స్థాయిలో అక్రమాలు చేసిన రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు దొరికినా వాళ్లకు శిక్షలు పడాలంటే కనీసం పది, ఇరవై ఏళ్లు పడుతోంది. దీని వల్లే అవినీతి పరులకు భయం లేకుండా పోతోంది. బోఫోర్స్ స్కామ్, కోల్ గేట్ కుంభకోణం, 2జీ స్పెక్ట్రమ్ స్కామ్, సత్యం కంప్యూటర్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణాలు జరుగుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము అవినీతిపరుల పాలవుతోంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు, సమాచార హక్కు చట్టం–2005, అవినీతి నిరోధక
చట్టం, న్యాయమూర్తుల (విచారణ) చట్టం, లోక్ పాల్, లోకాయుక్త చట్టం-–2013, విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్–-2011, మనీలాండరింగ్ నిరోధక చట్టం, బినామీ లావాదేవీల నిషేధ చట్టం లాంటివి ఎన్నో అవినీతి నిర్మూలన కోసం ఉన్నప్పటికీ వాటి అమలులో అలసత్వం కనిపిస్తోంది. ఆ చట్టాలన్నీ కఠినంగా అమలైతేనే అవినీతికి చెక్ పెట్టగలుగుతాం. ఇది జరిగితేనే దేశంలో ఆర్థిక సమానతలు తగ్గి ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది.
కరప్షన్ కంట్రోల్లో కొంచెం బెటర్
2019లో ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన కరప్షన్ పర్సెంటేజ్ ఇండెక్స్ లో 180 దేశాల్లో ఇండియా 80వ స్థానంలో ఉంది. డెన్మార్క్, న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉన్నాయి. సోమాలియా, దక్షిణకొరియా, సిరియా చివరి స్థానాల్లో ఉన్నాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా, లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఇండియన్ కరప్షన్ సర్వే-2019 ప్రకారం చూస్తే ఏటికేటికీ కరప్షన్ కంట్రోల్ విషయంలో భారత్ కొంచెం బెటర్ అవుతోంది. లంచం చెల్లింపుల్లో 2018లో నుంచి 2019కి ఏడు శాతం తగ్గిందని తేలింది. రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కరప్షన్ ఎక్కువగా ఉంది. కేరళ, గుజరాత్, గోవా, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు అవినీతిని కంట్రోల్ చేయడంలో ముందంజలో ఉన్నాయని ఈ సర్వే తెలిపింది.-జుర్రు నారాయణయాదవ్, టీచర్స్ యూనియన్ లీడర్.