హైదరాబాద్​ను ఆగంజేసిర్రు

హైదరాబాద్ పేరుకే మహానగరం. ప్రస్తుతం సిటీలో ఎక్కడ చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. వరల్డ్​ సిటీగా మారుస్తామని చెప్పిన టీఆర్ఎస్ సర్కారు హైదరాబాద్​ను ఆగం పట్టిచ్చింది. పాడైపోయిన డ్రైనేజ్ వ్యవస్థ, శిథిలావస్థలో విద్యుత్ స్తంభాలు, పెరిగిపోతున్న పొల్యూషన్, స్ట్రీట్ వెండార్ల సమస్యలు, చిన్నపాటి వర్షం వస్తే చాలు రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్ జాం కావడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలను సిటీ జనాలు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మిగులు బడ్జెట్ తో రూ.100 కోట్ల వడ్డీ పొందిన బల్దియా ఇప్పుడు అప్పులకుప్పగా మారి కనీసం జీతాలు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. జీహెచ్ఎంసీ ఆస్తులు తనఖా పెట్టి రూ.4,500 కోట్లు అప్పులు చేశారు. నెలకు రూ.30 కోట్లు వడ్డీలే కడుతున్నారు. సీఎం కేసీఆర్ అసమర్థత, అవగాహనా రాహిత్యం, అసంబద్ధ వాగ్దానాలు బల్దియాకు శాపంగా మారాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయి. 


కొత్త సెక్రటేరియట్​ పేరుతో ప్రజాధనం వృథా
రైతులకు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడానికి నిధులు లేవు. చివరికి పేదోళ్ల ఆరోగ్యంతో ముడిపడిన ఆరోగ్యశ్రీకి కూడా పైసలు లేవు.. కానీ కొత్త సెక్రటేరియట్ కట్టేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయి. ఆరున్నరేండ్లుగా ఏనాడూ సెక్రటేరియట్​కు వెళ్లని కేసీఆర్ రాత్రికిరాత్రే దానిని కూలగొట్టించారు. ఆయన మతిలేని నిర్ణయాల వల్ల దాదాపు 1,000 కోట్ల ప్రజా ధనం వృథా అవుతోంది. కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన జనానికి ఊరట కలిగించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల రూపంలో వారి నెత్తిన పిడుగు వేసింది. కేసీఆర్ ప్రభుత్వం వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తూ.. స్లాబ్ ల పేరుతో ప్రజల నడ్డి విరుస్తోంది. ఇక గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డుల కోసం ఆరు లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. దాదాపు లక్షా 74 వేలకు పైగా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం వచ్చిన లక్షా 12 వేలకు పైగా దరఖాస్తులను సైతం పెండింగ్ లో పెట్టారు. గ్రేటర్‌‌లోని చెరువులను మినీ ట్యాంక్​బండ్లు, రిక్రియేషన్ జోన్లు, పార్కులుగా తీర్చిదిద్దుతామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. 


చిన్న పాటి వర్షం వచ్చినా హైదరాబాద్​ సిటీ ఆగమాగం అవుతోంది. కాలనీలన్నీ జలమయమవుతున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పొంగిపొర్లే డ్రైనేజీలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. గత ఏడాది కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని 2,600 కాలనీలు నీట మునిగాయి. సుమారు 120 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితికి చేరాయి. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. హైదరాబాద్ లోని నాలాలు, చెరువులపై 28 వేల ఆక్రమణలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు ఈ ఏడేండ్ల కాలంలో వాటిని ఎందుకు తొలగించలేకపోయారు. అలాగే వరద సాయం అందలేదంటూ బాధితులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత వరద సాయం ఇస్తామన్న టీఆర్ఎస్​ నేతలు ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఇటువంటి ఘటనలతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గ్రేటర్ ప్రజలపై ఎంతటి ప్రేమ ఉందో అర్థమవుతోంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో భారీ వర్షం వస్తే ఏది రోడ్డో, ఏది డ్రైనేజీనో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. టీఆర్ఎస్ అసమర్థ పాలన కారణంగా ఎంతో మంది నాలాల్లో పడి బలయ్యారు. వందల కోట్లతో నాలాల క్యాపింగ్ చేస్తామన్న హామీ ఉత్త మాటగానే మిగిలిపోయింది. పెరిగిన నగర జనాభాకు అనుగుణంగా నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. పక్కా ప్రణాళిక ప్రకారం సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను రూపొందించాలి. 
చెత్త సేకరణలో ఫెయిల్​
నగరవ్యాప్తంగా 10 వేల ఆధునిక మరుగుదొడ్లు యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తేవాలని మంత్రి కేటీఆర్‌‌ జీహెచ్ఎంసీని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎన్ని నిర్మించారు? ఎన్నింటిని ఉపయోగిస్తున్నారో? ప్రజలకు తెలియజేయాలి. తడి, పొడి చెత్త సేకరణ అని గొప్పగా ప్రకటించినా.. దానిని ఆచరణలో పెట్టడంలో జీహెచ్ఎంసీ విఫలమైంది. దాంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్ లో చాలా చోట్ల కనీసం చెత్త కుండీలు కూడా పెట్టడంలేదు. చెత్తకుండీలు లేకపోవడంతో ఖాళీ స్థలాలు, పార్కుల్లో చెత్తను వేస్తుండడంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. పొడిచెత్త ద్వారా విద్యుత్​ను ఉత్పత్తి చేసే వీలున్నా అటువంటి కార్యక్రమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక వీధికుక్కలు, పందులు విపరీతంగా పెరిగిపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతో బస్తీల్లో చిన్నారులు కుక్క కాటుకు గురవుతున్నారు. మూసీ మురికి కూపంగా మారడంతో దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యంతో అస్పత్రుల పాలవుతున్నారు. జీహెచ్ఎంసీ దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించలేని అసమర్థ స్థితిలో ఉంది. స్వచ్చ భారత్ లో భాగంగా కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన టాయిలెట్స్, మినరల్ వాటర్ ఏటీఎంలు నిర్వహణ సరిగ్గా లేక నిరుపయోగంగా మారాయి. 
హుస్సేన్​ సాగర్​ మారలే
హుస్సేన్‌‌సాగర్​ను మంచినీటి సరస్సుగా మారుస్తామని, కొబ్బరి నీళ్లతో నింపుతామని కేసీఆర్​ అన్నారు. కానీ ఇప్పటికీ నెక్లెస్ ​రోడ్డు దగ్గరకు వెళితే వచ్చే వాసనకు ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. నగరంలో 15 వేలకుపైగా హోర్డింగ్​లు ఉంటే జీహెచ్ఎంసీ రికార్డులో 2 వేలు కూడా లేవు. అధికారుల అవినీతి కారణంగా హోర్డింగుల వల్ల ఏటా రూ.100 కోట్ల వరకు బల్దియా ఆదాయానికి గండిపడుతున్నది. బస్టాండ్​లు, రైల్వే స్టేషన్లు, ఆలయాలు, పార్కులు, వివిధ మార్గాల్లో కొన్ని వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ అందులో ఎన్ని పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయో తెలియదు. దీంతో కాలనీలు, బస్తీల్లో ప్రజలే సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ సిటీలో అతి పెద్ద సమస్యగా మారింది. రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. 35 చోట్ల మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి ఏండ్లు గడుస్తున్నా వాటి అతీగతీ లేదు. బల్దియాలో వందలాది పార్కులు అక్రమార్కుల హస్తగతమవుతున్నాయి. గత కొన్నేండ్లుగా దాదాపు 800లకు పైగా పార్కు స్థలాలు కబ్జాలకు గురయ్యాయి. అంతేకాకుండా పార్కుల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 
రోడ్ల గుంతలకు ఎన్ని పైసలు చెల్లించిన్రు?
హైదరాబాద్​ను విశ్వనగరంగా మారుస్తామని, రూ.2 వేల కోట్లతో ఫ్లైఓవర్లు, స్కైవేలు నిర్మిస్తామని, రూ.11 వేల కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ ఆ హామీల ఊసేలేదు. నగరంలో 9,050 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో సీసీ రోడ్లు 3,928 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఒక్కసారి వేసిన సీసీ రోడ్లు కనీసం 15 ఏండ్ల పాటు మన్నికగా ఉండాలి. కానీ ఐదేండ్లు కూడా ఉండడం లేదు. గతుకుల రోడ్లు, ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. రోడ్లకు ప్యాచ్ వర్కులు చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. రోడ్లపై గుంతను చూపిస్తే రూ.1,000 ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ ఏ రోడ్డు చూసినా గుంతలమయమే. ఇప్పటి వరకూ ఎన్ని లక్షలు చెల్లించారో ప్రజలకు చెప్పాలి. గుంత లేని రోడ్డు చూపిస్తే.. కేటీఆర్ కే మేము డబ్బులు ఇస్తాం. గ్రేటర్ హైదరాబాద్ లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఎన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు? వాటిలో ఎంత మంది డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు? కొన్ని బస్తీ దవాఖానాల్లో వైద్య సిబ్బంది కొరతతో సరిగ్గా సేవలు అందడం లేదు. హైదరాబాద్ లో కార్పొరేట్ తరహా ట్రీట్​మెంట్ అందించే నాలుగు వెయ్యి పడకల ఆస్పత్రులను నిర్మిస్తానని కేసీఆర్ గొప్పలు చెప్పారు. కానీ ఈనాటి వరకు వాటి గురించి పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ వెల్‌‌నెస్ సెంటర్లను బస్తీ దవాఖానాలుగా మార్చారు. బస్తీ దవాఖానా నిధులు, డాక్టర్, సిబ్బంది జీతాలు, మందుల ఖర్చులు అన్నీ కేంద్రానివి. ప్రచారం మాత్రం కేసీఆర్ ది. 
పారదర్శక పాలన అందించాలె
విశ్వనగరమంటూ గప్పాలు పలికిన టీఆర్ఎస్ హైదరాబాద్​కు ఒరగబెట్టింది శూన్యం. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు దేశాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. అదేవిధంగా జీహెచ్ఎంసీలోనూ కేంద్రం సహకారం తీసుకుంటూ విప్లవాత్మక విధానాలను ప్రవేశపెట్టి నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి. అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తూ అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోవాలి. నగర సమస్యలకు తెరదించి భాగ్యనగర వాసుల కష్టాలను దూరం చేయాలి.


డబుల్​ ఇండ్లు ప్రకటనలకే పరిమితం
ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ నేతల హామీలు, వాగ్దానాలకు అంతే ఉండదు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2016, 2020 జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గంపెడాశలు పెట్టుకున్న జనాలు.. నమ్మి టీఆర్ఎస్​ను గెలిపించారు. కానీ అధికారం చేతులకొచ్చేసరికి కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ హామీని విస్మరించింది. రాష్ట్రంలో 2 లక్షల ఇండ్లు, జీహెచ్ఎంసీలో లక్ష ఇండ్లు, నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు అంటూ ప్రకటనలు గుప్పించి శిలాఫలకాలతో హడావుడి చేశారు. కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట లాంటి కొన్ని చోట్ల తప్పిస్తే ఎక్కడా డబుల్​ ఇండ్లు పూర్తి కాaలేదు. మీడియాలో వాటినే చూపించి ప్రభుత్వం డప్పు కొట్టుకుంటోంది. మరోవైపు నరేంద్రమోడీ ప్రభుత్వం రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా అనేక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్)లో భాగంగా తెలంగాణకు ఏడేండ్లలో రూ.2,237.37 కోట్లు విడుదల చేసింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించింది. ప్రధాని మోడీకి పేరు వస్తుందనే పీఎం ఆవాస్​ యోజనను హైదరాబాద్​లో అమలు చేయకుండా డబుల్ ఇండ్లని జనాలను భ్రమల్లో పెడుతున్నారు.                                                                 - డాక్టర్ కె.లక్ష్మణ్,  బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు