- ఆత్మీయ సమావేశంలో మంత్రి ఐకే రెడ్డి
లక్ష్మణచాంద, వెలుగు: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని, ప్రశ్నిస్తున్న వారిపై మోడీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన బుల్లెట్ పై వచ్చి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. రైతుల కరెంటు కష్టాలు తీరాయని, సాగునీటి ప్రాజెక్ట్ లతో అన్ని గ్రామాలకూ నీరు అందడంతో, పంటలు పుష్కలంగా పండుతున్నాయన్నారు.
రైతుబంధు, రైతు బీమా, పంటకు గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఆసరా అవుతున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదవాళ్లకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతులకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయిస్తున్న కేంద్రం, తెలంగాణపై ఆది నుంచి కక్ష సాధింపునకు పాల్పడుతోందన్నారు. ప్రశ్నించినవారిపై ఈడీ ,సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తుందన్నారు. పేపర్ లీకేజీ తో సీఎం కేసీఆర్ పై బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలు సరికావని, ఆధారాలు ఉంటే బయటపెట్టి సిట్‌కు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మున్సిపల్ చైర్మన్ గుడ్రత్ ఈశ్వర్, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, మండల ఇన్చార్జి అల్లోల సురేందర్ రెడ్డి, ఎంపీపీ అడ్వాల పద్మా రమేశ్, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి వస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని అడ్డుకుంటారనే నెపంతో మండల బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీజేపీ నాయకులు అన్నారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ మండల అధ్యక్షులు మెంగు అనిల్, ఉపాధ్యక్షులు గుడ్ల రంజిత్, బీసీ మోర్చా అధ్యక్షులు రాపని గంగాధర్ ,మాజీ మండల అధ్యక్షులు నారాయణ, సోషల్ మీడియా కన్వీనర్ పుట్టి రవి, కంకల రవి, తదితరులు ఉన్నారు.