సరిహద్దు గ్రామాల వికాసం

సరిహద్దు గ్రామాల వికాసం

ఈ శాన్య రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాంతం కొండలు, కోనల మధ్యలో 200కు పైగా గిరిజన తెగలు జీవనం కొనసాగిస్తుంటాయి. నేటికీ అక్కడి ప్రజలు వారికి అవసరమైన వస్తువులను సొంతంగా ఉత్పత్తి చేసుకొని వినియోగిస్తుంటారు.  స్వదేశీ వస్తువులను వాడాలి, స్వదేశీ వస్తువుల ఉత్పత్తి చేయాలనే నినాదానికి ఈశాన్య ప్రాంతం సరైన ఉదాహరణ అని, దాన్ని దేశంలోని మిగిలిన వారు కూడా ఆదర్శంగా తీసుకోవాలని గాంధీజీ స్వయంగా చెప్పారు. ఈశాన్యంలో మహిళలు పూర్తిస్థాయి స్వేచ్ఛ, స్వతంత్రాన్ని కలిగిన సమాజంగా కూడా మనం గుర్తించాలి. లింగ సమానత్వం, మహిళలపై నేరాలు చాలా తక్కువ. మహిళలు ఆత్మవిశ్వాసం, సమానత్వం కలిగి ఉంటారు. సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మహిళలపై వరకట్నం సంబంధిత హింస లేదు. బ్రిటీష్ వారు ఎప్పుడు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిస్థాయి అధికారం చలాయించలేదు. మిషనరీలు ఈ ప్రాంత ప్రజలకు ఆంగ్ల భాష నేర్పిస్తూ, మతాన్ని పరిచయం చేశాయి. జనాభా పరంగా తక్కువ  మంది ఉండటంతో  అక్కడ ప్రజా ప్రాతినిధ్యం వహించే నాయకుల సంఖ్య తక్కువే. వివిధ రాజకీయ పక్షాలు ఆ ప్రాంతాలపై, వాటి అభివృద్ధిపై ఎప్పుడూ శ్రద్ధ వహించలేదు. ఈ ప్రాంతం అడవులు, సహజ వనరులతో చాలా సమృద్ధిగా ఉన్నా, పెద్ద పరిశ్రమలు లేవు. ప్రభుత్వమే ఉపాధికి ఏకైక వనరు. నిరాశతో యువత తమ గుర్తింపును నొక్కి చెప్పడానికి, వారి ఆక్రోశాన్ని వెల్లగక్కడానికి  కొన్ని సందర్భాల్లో హింసను ఆశ్రయిస్తున్నది. ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపనలో,  మౌలిక వసతుల కల్పన లో ఉపాధి కార్యక్రమాలు చేయటంలో చాలా నిర్లక్ష్యం వహించాయి. 

వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్

సరిహద్దు, కొండ ప్రాంతాల్లో ప్రకృతి పరంగా సహజ సంపద ఉన్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల అక్కడి ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు చైనాతో నిత్యం సరిహద్దు సమస్యలు ప్రజల జీవనంపై ప్రభావం చూపుతాయి. వాళ్లు ఒక్కో సందర్భంలో ఆకలి తీర్చుకోవడం కోసం సరిహద్దు రేఖను దాటాల్సిన దుర్భర పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ తీర్చడానికి ఆ ప్రాంత ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాటికి కొనసాగింపుగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ముఖ్యంగా ఉత్తర సరిహద్దులోని గ్రామాల అభివృద్ధికి తాజా కేంద్ర బడ్జెట్ 2025-–26 వరకు ‘వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్’ ప్రకటించింది. ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, లడఖ్ సరిహద్దు గ్రామాల అభివృద్ధికి  చేయూతను అందిస్తుంది. దాదాపు 2,963 గ్రామాలు ఈ కార్యక్రమంతో లబ్ధి పొందే అవకాశం ఉంది. 663  గ్రామాల్లో మొదటి దశలో వివిధ కార్యక్రమాలు చేపడుతారు. గ్రామ పంచాయతీల సాయంతో జిల్లా పరిపాలన ద్వారా విలేజ్ యాక్షన్ ప్లాన్‌లు రూపొందుతాయి. ఈ  పథకం ద్వారా అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి,  జీవనోపాధి కోసం నిధులు అందుతాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం సమ్మిళిత వృద్ధిని సాధించడంలో, సరిహద్దు ప్రాంతాల్లో జనాభా వలసలకు అడ్డుకట్ట వేయడానికి దోహదపడుతుంది. గుర్తించిన గ్రామాల్లో ఉండే మానవ వనరుల నాణ్యత, సహజ సంపదను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న ప్రజలకు ‘హబ్  స్పోక్ మోడల్’ ద్వారా వ్యవస్థాపకత లక్షణాలను పెంపొందించే ప్రయత్నం జరుగుతున్నది. యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, మహిళల సాధికారత కోసం అవసరమైన సాయం అందిస్తూ అక్కడ పర్యాటక కేంద్రాల అభివృద్ధికి దోహదం చేస్తూ, స్థానిక సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ  ఆర్థికంగా మరింత పరిపుష్టి చెందే విధంగా భారత ప్రభుత్వం కృత నిశ్చయంతో  అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నది. 

సరిహద్దు ప్రజలు బాగుంటేనే..

దశాబ్దాలుగా దేశంలో జటిలంగా ఉన్న అనేక సమస్యలకు సానుకూల పరిష్కారం సాధించినట్లుగానే, దేశ సరిహద్దు సమస్యలను కూడా ఒక కొలిక్కి తీసుకువస్తే దేశ ఆర్థిక పురోగతి మరింత వేగవంతం అవుతుంది. సరిహద్దు సమస్యలు సద్దుమణిగినట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడానికి పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. ఈ వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్​ను వీలైనంత వేగంగా అమలుపరిచి ప్రజల సంక్షేమంతో పాటు భారత రక్షణకు సంబంధించిన కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలి.

ఈశాన్యంలో మౌలిక వసతులు

ఈశాన్య భారతదేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ అత్యంత దయనీయంగా ఉండేది. ఉపాధి కల్పించే వ్యవస్థలు తగినంతగా లేకపోవడంతో సరిహద్దు ప్రాంత ప్రజలు సంవత్సరంలో ఎక్కువ కాలం సరైన పనులు దొరక్క సరిహద్దు ప్రాంతాన్ని దాటి జీవనోపాధి కోసం వలసలు వెళ్లేవారు. చైనా ఆగడాలను అరికట్టడంలో, సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఒక పటిష్టమైన విధానాన్ని తీసుకోవడంలో,  చైనాను ఎదుర్కోవడంలో కూడా ఇవి విఫలమైనట్టుగానే భావించవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా కనీస సౌకర్యాల లేమి, శత్రు దేశం దాడుల భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న బార్డర్ లో ఉన్న ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదే. అభివృద్ధికి, సామ్రాజ్యవాద కాంక్షతో ఉన్న చైనాకు ధీటుగా బదులు ఇచ్చేందుకు, సరిహద్దు గ్రామాల్లో అవసరమైన వ్యవస్థాపక సౌకర్యాలైన అంతర్గత, జాతీయ రహదారుల అనుసంధానం చేయటం, తాగునీరు, 24 గంటల విద్యుత్ సౌకర్యం, సౌర, పవన శక్తి, మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, టూరిజం, హెల్త్ అండ్ వెల్​నెస్ సెంటర్ల సౌకర్యాల ద్వారా ప్రజల్లో భారత ప్రభుత్వం పట్ల విశ్వాసం, దేశం కోసం పనిచేసే ఆసక్తి మరింతగా ఏర్పడే అవకాశం ఉంటుంది. సరిహద్దు గ్రామాల అభివృద్ధి ఆ గ్రామాల ప్రజల సంక్షేమమే కాకుండా దేశ క్షేమానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.  

- ప్రొ. చిట్టెడ్డి కృష్ణా రెడ్డి,
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ