- ఎన్ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ఐటీ హబ్
- లచ్చగూడెంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
- రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.వెయ్యి కోట్లు
- 87 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.128 కోట్లు
ఖమ్మం, వెలుగు : తన సొంత నియోజకవర్గం మధిరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిధుల వరద పారిస్తున్నారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మధిర పట్టణ రూపు రేఖలు మార్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను తీర్చడంతో పాటు, విద్య, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉండడంతో ఎప్పటి నుంచో తనకున్న ఆలోచనలను ఇప్పుడు అమల్లోకి తెస్తున్నారు.
పదేళ్ల కింద ఉమ్మడి రాష్ట్రంలో ప్లాన్ చేసిన ఇందిరా డెయిరీని మళ్లీ తెరపైకి తెచ్చారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు, వారికి ఉపాధి కల్పించేందుకు పాడిపరిశ్రమను, డెయిరీని వారి చేతులమీదుగానే నడిపించేలా ప్లాన్ చేశారు.
పాల ఉత్పత్తితో పాటు, ప్యాకింగ్, మార్కెటింగ్ ఇందిరా డెయిరీ ద్వారా నిర్వహించబోతున్నారు. డెయిరీని క్రమంగా జిల్లావ్యాప్తంగా విస్తరించడంతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ పాల సేకరణ కేంద్రాలు, వ్యాపారం నిర్వహించేలా మహిళా సంఘాలను ప్రోత్సహించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఇదే కాకుండా దాదాపు రూ.వెయ్యి కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భట్టి ప్లాన్ చేశారు. ఇప్పటికే నియోజకవర్గం నలుమూలలా రోడ్ల అభివృద్ధి కోసం దాదాపు రూ.400 కోట్లు మంజూరు చేశారు. ఇందులో చాలా రోడ్లకు శంకుస్థాపనలు పూర్తయి, పనులు జరుగుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలోనే యూజీడీ ఇక్కడే..
మధిర పట్టణ అభివృద్ధిలో భాగంగా 87 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణానికి రూ.128 కోట్లు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలోనే యూజీడీ ఏర్పాటుకాబోతున్న మొదటి పట్టణంగా గుర్తింపు తెచ్చారు. మధిరలో పన్నెండేళ్ల కింద భట్టి డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సమయంలో యూజీడీ ఏర్పాటు కోసం రూ.32 కోట్లతో మంజూరు చేయించినా, ఆ తర్వాత రాష్ట్ర విభజన, ఇతర పరిణామాల నేపథ్యంలో కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడు దాన్ని కొత్త ఎస్టిమేట్లతో పట్టణంలోని విలీన గ్రామాలతో కలిపి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. నాలుగు చోట్ల సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్లను (ఎస్టీపీ) కూడా నిర్మించనున్నారు. రాయపట్నం బ్రిడ్జి సమీపంలో 4 ఎంఎల్డీ కెపాసిటీతో ఎస్టీపీ, అంబాజీపేటలో 0.4 ఎంఎల్డీ, ఇల్లందులపాడులో 0.5 ఎంఎల్డీ, మడుపల్లిలో 0.9 ఎంఎల్డీ కెపాసిటీతో ట్రీట్ మెంట్ ప్లాంట్లను నిర్మించనున్నారు. ఈ సీవరేజి ప్లాంట్ల నుంచి వచ్చే శుద్ధిచేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంపై ఈనెల 10 వరకు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. 17న డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి, ఆ తర్వాత టెండర్లను పిలువనున్నారు. రెండేళ్లలో యూజీడీ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత పట్టణంలోని రోడ్లన్నీ సీసీ రోడ్లుగా మార్చనున్నారు.
ఉపాధి అవకాశాలు..
ఇక నిరుద్యోగులు, యువ పారిశ్రామికవేత్తలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ హబ్, ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క ప్లాన్ చేశారు. వీటి కోసం ఇప్పటికే స్థలాలను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ఉండగా, మధిరలోనూ ఐటీ హబ్ ఏర్పాటు చేయబోతున్నారు. మధిర ఎన్ఎస్పీ క్యాంప్ కార్యాలయం ఆవరణలోని 1.38 ఎకరాల స్థలంలో ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
యువ పారిశ్రామిక వేత్తల కోసం మధిర మండలం ఎండ్లపల్లి గుట్ట దగ్గర ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుకు త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నారు. మరోవైపు విద్యార్థుల కోసం రూ.25 కోట్లతో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కూడా త్వరలో మంజూరు కానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాలన్నింటినీ కలిపి ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌తో పాటు మధిరలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ స్కూళ్ల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ స్కూల్ కోసం చింతకాని మండలం లచ్చగూడెంలో ఇప్పటికే 20 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. వేర్వేరుగా గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తుల్లో తరగతి గదులు, గ్రౌండ్ ప్లస్ 8 అంతస్తుల్లో హాస్టళ్లు నిర్మించనున్నారు. బోధన, బోధనేతర సిబ్బందికి ఆ ఆవరణలోనే క్వార్టర్లు నిర్మిస్తారు. క్రీడాస్థలం, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.