హైదరాబాద్: ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ), స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్తో కలిసి సిటీ దక్షిణాన విస్తారమైన గోల్ఫ్ సిటీని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అమెరికా టెక్సస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో ప్రధాన కేంద్రంగా ఉన్న పిజిఏ ప్రతినిధి బృందం శనివారం ఆయనతో సెక్రటేరియట్లో భేటీ అయింది. తెలంగాణా ప్రభుత్వం తమకు సహకరిస్తే గోల్ఫ్ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పిజిఏ, స్టోన్ క్రాఫ్ట్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని శ్రీధర్ బాబు వెల్లడించారు.
పిజిఏ ప్రస్తుతం ముంబయిలో షాపూర్జీ పల్లోంజి సంస్థతో కలిసి గోల్ఫ్ సిటీ నిర్మాణం చేపడుతోందని ఆయన తెలిపారు. ఇక్కడ స్టోన్ క్రాఫ్ట్ భాగస్వామ్యంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిందని వివరించారు. గోల్ఫ్ సిటీ నిర్మాణం పూర్తయితే వచ్చే పదేళ్లలో పదివేల మందికి ఉపాధి దొరుకుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక ఫోర్త్ సిటీలో ఎటువంటి కాలుష్యం వెలువడని నెట్-జీరో సిటీని నిర్మిస్తుందని పేర్కొన్నారు. నిర్మాణాలకు మూడింతలు ప్రకృతి వనాలను పెంచడం ద్వారా ఆహ్లాదకర నివాస ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సంస్థలు తమ ప్రెజెంటేషన్‌లో వెల్లడించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు.
పిజిఏ కన్సార్టియం దాదాపు 200 ఎకరాల్లో ‘18 హోల్’ ప్రామాణిక గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేస్తుంది. ఇది వినియోగంలోకి వస్తే దక్షిణ భారత దేశంలోనే మొట్ట మొదటిది అవుతుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. మియావాకి పద్ధతిలో అడవిని పెంచడం ద్వారా సహజ సిద్ధమైన డెక్కన్ శిలలకు, స్థానిక నీటి వనరులకు ఒక అలంకార ప్రాయమవుతుందని వివరించారు.
ALSO READ | గుడ్ న్యూస్: అక్టోబర్ నెలాఖరులో ఇందిరమ్మ ఇళ్లు
పిజిఏ ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా సంస్థలలో ఒకటి. 30,000 మందికి పైగా గోల్ఫ్ నిపుణులతో కూడిన ఈ సంస్థ గోల్ఫ్ అభివృద్ధికి వందేళ్లుగా కృషి చేస్తోంది. పిజిఏ పలు చాంపియన్‌షిప్‌లు, రైడర్ కప్ వంటి టోర్నీలను నిర్వహిస్తోంది. భేటీలో స్టోన్ క్రాఫ్ట్ సిఇఓ కీర్తి చిలుకూరి, అలోక్ తివారి, పిజిఏ ప్రతినిధులు టిమ్ లాబ్, అలెక్స్ హే, డేవిడ్ బ్లమ్, కెన్ సాగర్, రాధా కిషోర్ తదితరులు పాల్గొన్నారు.