గ్రీన్​ ఫీల్డ్​గా హైదరాబాద్, బెంగుళూర్​ హైవే

గ్రీన్​ ఫీల్డ్​గా హైదరాబాద్, బెంగుళూర్​ హైవే
  •     మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  •     జడ్చర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జడ్చర్ల, వెలుగు : కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్–బెంగుళూర్​ హైవేను 12 లేన్ల గ్రీన్​ ఫీల్డ్​ హైవేగా విస్తరించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. సోమవారం జడ్చర్ల నియోజకవ ర్గంలో రూ.138 కోట్లతో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్​రెడ్డి, జీఎంఆర్, వాకాటి శ్రీహరి, యెన్నం శ్రీనివాస్​రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం జడ్చర్లలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలే అయ్యిందని, మొదటి మూడు నెలలు ఎన్నికల కోడ్​తోనే సరిపోయిందని, ఐదు నెలల్లో ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించిందని చెప్పారు. మొదటి నెలలోనే రూ.20 వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రధాన రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను గుర్తించకుండా బీఆర్ఎస్​ నాయ కులు ప్రభుత్వ మనుగడపై అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు తరువాత రూ.2.5 లక్షల కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్​ పనులు పూర్తి చేయడంతో పాటు కూలిపోవడం కూడ పూర్తయిందని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ పాలమూరు ప్రాజెక్ట్​ పనులు అసంపూర్తిగానే ఉన్నా యని విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉండి నిరుద్యోగుల సమస్యను పట్టించుకోకుండా నేడు నిరుద్యోగులు, ఉద్యో గ ఖాళీల గురించి మాట్లాడడం అవివేకమన్నారు. 8 నెలల్లో 30 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేసిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానిదేనని తెలిపారు.

కొబ్బరికాయల ప్రభుత్వం కాదు

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం మాదిరిగా తమది కొబ్బరి కాయల ప్రభుత్వం కాదని జడ్చర్ల ఎమ్మేల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం  జారీ చేసిన అనేక  జీవోలకు ఫైనాన్స్​ అప్రూవల్​ లేకుండానే అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొబ్బరి కాయలు కొట్టారని విమర్శించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే జడ్చర్ల నియోజకవర్గానికి రూ.138 కోట్లు మంజూరు చేయించి, టెండర్లు పూర్తి చేయించానని తెలిపారు. 

మిడ్జిల్/నవాబుపేట/బాలానగర్ :  రూ.12 కోట్లతో మిడ్జిల్​ మండలం రెడ్డిగూడెం నుంచి మిడ్జిల్  వరకు డబుల్  లేన్  బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బాలానగర్, రాజాపూర్  మండలంలోని అభివృద్ది పనులకు భూమిపూజ చేశారు. ఎంపీడీవో ఆఫీస్​ ఆవరణలో వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. నవాబుపేట మండలంలో రూ.22 కోట్లతో నవాబుపేట–కుతినేపల్లి బీటీ రోడ్డు, మండల కేంద్రంలో రూ.50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్​ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి ఉన్నారు.

గడ్కరీ మంచోడు..

కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ చాలా మంచోడు.. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాడని, ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో అన్ని పార్టీలను కలుపుకుపోతాడని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. పార్టీలు వేరైనా అభివృద్ధిలో కలిసి ముందుకు సాగుదామని మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణను ఉద్దేశించి అన్నారు. అనంతరం ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సహకారం అందిస్తామని తెలిపారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్య, వైద్యం, రోడ్లు, రవాణ సదుపాయాలు కల్పించేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్​ కార్పొరేషన్​ చైర్మన్​ ఒబేదుల్లా కొత్వాల్, జనార్ధన్​రెడ్డి, శ్యాంసుందర్​ రెడ్డి, నిత్యానందం, బుక్క వెంకటేశం ఉన్నారు.