చండ్రుగొండ, వెలుగు : చండ్రుగొండ మండలంలోని కనకగిరి గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.100 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కొత్తగూడెం రాంచంద్ర కాలేజి స్పోర్ట్స్ అథార్టీ స్టూడెంట్స్ తో కలిసి కనకగిరి గుట్టలను సందర్శించారు. ముందుగా బెండాలపాడు గ్రామంలోని రామాలయంలోపూజలు చేసి 10 కిలోమీటర్ల దూరంలోని కనకగిరిగుట్టలను స్టూడెంట్స్ తో కలిసి ఎక్కారు.
వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు. కాకతీయులకాలంలో నిర్మించిన కోనేరు, ఏనుగుల బావి, ప్రాకారాలు, జలపాతాలు, ఫారెస్ట్ బేస్ క్యాంపు శిబిరాలను చూశారు. గుట్ట దిగువన ఆదివాసీలు తయారు చేస్తున్న బ్యాంబూ క్లస్టర్ ను పరిశీలించారు. ఆదివాసీలు తయారు చేసే వస్తువులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు వచ్చే విధంగా ఆఫీసర్ల తో మాట్లాడుతానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషలాఫీర్ సంజీవరావు, ఎంపీడీవో అశోక్, ఫారెస్ట్ రేంజర్ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.