మేడారం అభివృద్ధికి రూ. 300 కోట్లతో మాస్టర్‌‌ ప్లాన్‌‌

మేడారం అభివృద్ధికి రూ. 300 కోట్లతో మాస్టర్‌‌ ప్లాన్‌‌
  • భూసేకరణకు అందరూ సహకరించాలి
  • మేడారంను జాతీయ పండుగ గుర్తించేలా కృషి చేస్తాం
  • జాతర పనులను నెలాఖరులోగా కంప్లీట్‌‌‌‌ చేయాలి
  • రాష్ట్ర మంత్రులు సీతక్క, సురేఖ

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు : ‘మేడారంలో అభివృద్ధి పనుల కోసం రూ.300 కోట్లతో మాస్టర్‌‌ ప్లాన్‌‌ సిద్దం చేస్తున్నాం, భూ సేకరణకు ప్రజలు సహకరించాలి’ అని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క కోరారు. మినీ మేడారం జాతర పనులపై శుక్రవారం ములుగు జిల్లా మేడారం ఐటీడీఏ గెస్ట్‌‌హౌజ్‌‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఫిబ్రవరి 12 నుంచి జరిగే మినీ మేడారం జాతర పనులను ఈ నెలాఖరులోగా కంప్లీట్‌‌‌‌ చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆఫీసర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు కృషి చేస్తామని చెప్పారు.  మేడారం జాతర విశిష్టత ప్రజలందరికీ తెలిసేలా బుక్‌‌ రాయాలని పూజారులను కోరారు. 

పూజారులంతా ఐకమత్యంతో ఉండి ఇక్కడి ఆచార వ్యవహారాలు, పూజా విధానం ప్రపంచానికి తెలిసేలా బుక్‌‌ రిలీజ్‌‌‌‌ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అనంతరం మల్లంపల్లి తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌తో పాటు, తాడ్వాయి అడవుల్లో బ్లాక్‌‌ బెర్రీ ఐలాండ్‌‌‌‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్‌‌ దివాకర్ టీఎస్, ఎస్పీ శబరీశ్‌‌‌‌, దేవాదాయ శాఖ కమిషనర్‌‌ శ్రీధర్‌‌‌‌, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, డీఎఫ్‌‌వో రాహూల్‌‌ కిషన్‌‌ జాదవ్‌‌, డీసీసీబీ చైర్మన్‌‌ మార్నేని రవీందర్, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ మహేందర్‌‌, ఆర్డీవో వెంకటేశ్‌‌ పాల్గొన్నారు.

మీరు ఇంట్లో పడుకోవడానికి నిధులు తెస్తున్నామా ? : ఆఫీసర్లపై మంత్రి సీతక్క ఫైర్‌‌‌‌

‘మినీ మేడారం జాతర స్టార్ట్‌‌ కావడానికి ఇంకా కొన్ని రోజులే ఉంది, అయినా ఇప్పటివరకు కొన్ని డిపార్ట్‌‌‌‌మెంట్లకు చెందిన ఆఫీసర్లు ఇంకా పనులు మొదలుపెట్టలేదు.. మీరు ఇంట్లో పడుకోవడానికి మేం ప్రభుత్వం తరఫున నిధులు తెస్తున్నామా ? ఇట్లా అయితే చర్యలు తప్పవు’ అని మంత్రి సీతక్క ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 మేడారం జాతర కోసం రూ.35 కోట్లు, మినీ మేడారం జాతరకు మరో రూ.4.5 కోట్ల నిధులు విడుదల చేస్తే ఆ పనులు చేయకుండా ఆఫీసర్లు నిద్రమత్తులో ఉన్నారని మండిపడ్డారు. ఈ నెలాఖరులోగా పనులన్నీ కంప్లీట్‌‌‌‌ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేడారంలో దేవాదాయ శాఖ ఆఫీస్‌‌‌‌ ఏర్పాటుకు కృషి చేస్తానని సురేఖ పేర్కొన్నారు. మేడారానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చేందుకు మంత్రి సీతక్కతో కలిసి కృషి చేస్తానని చెప్పారు.