నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాటకు కట్టుబడి నిజామాబాద్ నగర డెవలప్మెంట్ కోసం రూ.10 కోట్ల ఎస్డీపీ ఫండ్స్ మంజూరు చేయించానని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్అలీ తెలిపారు. ఆదివారం ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు. డివిజన్ల వారీగా ప్రయారిటీ గుర్తించి ఈ డబ్బులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్‌కు కంపౌండ్ వాల్స్ నిర్మిస్తామన్నారు.
రూ.300 కోట్లతో అమృత్ స్కీం ద్వారా నీటి సమస్యను తీర్చి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుతో నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు గ్యారెంటీలలో భాగంగా 200 యూనిట్లలోపు కరెంట్ వాడుతున్న వారికి జీరో బిల్, రూ.500 గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నామని వివరించారు.
షాహీన్ అకాడెమీలో చదువుకొని టెన్త్ పరీక్షలో 10 జీపీఏ సాధించిన స్టూడెంట్స్‌ను లిమ్రా గార్డెన్లో సన్మానించారు. రెండు రోజుల కింద ఆరేండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు గంగాధర్ కు ను కఠిన శిక్షపడేలా చూడాలని బాధిత కుటుంబీకులు షబ్బీర్‌అలీని కలిసి కోరారు. సీపీ కల్మేశ్వర్‌తో ఫోన్లో మాట్లాడిన షబ్బీర్అలీ నిందితుడికి ఉరిశిక్షపడేలా చూడాలని సూచించారు. నిందితుడి పక్షాన కోర్టులో ఎవరు న్యాయసహాయం చేయొద్దని బార్ కౌన్సిల్ సభ్యులను కోరారు. తనను కలవడానికి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులు తీసుకున్నారు. మేయర్ నీతూకిరణ్, నరాల రత్నాకర్ తదితరులు ఉన్నారు.