వరంగల్, వెలుగు: కాకతీయుల చరిత్ర ఉట్టిపడేలా మెట్ల బావులను అభివృద్ధి చేయనున్నట్లు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చెప్పారు. సికింద్రాబాద్ బన్సీలాల్‍పేటలోని మెట్ల బావిని రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల్లో రూ.10 కోట్లతో పునరుద్ధరించి టూరిజం స్పాట్‍గా మార్చింది. వరంగల్ మెట్ల బావుల డెవలప్‍మెంట్ విషయాన్ని మాత్రం రాష్ట్ర సర్కారు ఏండ్ల తరబడి పట్టించుకోవడం లేదు. గురువారం ‘వెలుగు’లో ‘కాకతీయుల మెట్ల బావులు కంప చెట్ల మధ్యలో..’ హెడ్డింగ్‍తో వచ్చిన స్టోరీకి ఎమ్మెల్యే స్పందించారు.
గురువారం ఉదయం లోకల్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామితో కలిసి శివనగర్‍లోని మెట్ల బావిని సందర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని చారిత్రక మెట్ల బావులను అభివృద్ధి చేస్తున్నారని.. వరంగల్లోని కాకతీయుల మెట్ల బావులను సైతం డెవలప్ చేసి భావితరాలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. చారిత్రక కట్టడాలను సంరక్షించి వరంగల్ సిటీని టూరిజం హబ్ చేస్తామన్నారు. దీనికి కావాల్సిన నిధులను త్వరలోనే కేటాయించనున్నట్లు తెలిపారు.