- ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల యాక్షన్ ప్లాన్ సిద్ధం
- గ్రామాల్లో సీఎం కప్ పేరుతో ఆటల పోటీలు
- ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు భూమిపూజ
- యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో ఒక యూనిట్ జాతికి అంకింతం
- కొత్తగా 213 అంబులెన్సులు
హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు శాఖలవారీగా డిసెంబర్ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు వరుసగా నిర్వహించే కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమిపూజ నిర్వహిస్తారు. ఇప్పటికే 28 నియోజకవర్గాల్లో ఈ భవనాల పనులు మొదలయ్యాయి. మరో 26 నియోజకవర్గాలకు ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది. వాటికి శంకుస్థాపన చేస్తారు.
ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో సీఎం కప్ పేరుతో ఆటల పోటీలు నిర్వహిస్తారు. స్పోర్ట్స్అథారిటీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలను నిర్వహిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు 28 పారా మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తారు. వీటితో పాటు కొత్తగా 213 అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొస్తారు. అలాగే, ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు అందించేందుకు జిల్లాకో క్లినిక్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సేవలను నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించుకుంటామని, ఆసక్తి ఉన్న వారికి శిక్షణను ఇచ్చి ట్రాఫిక్ వలంటీర్లుగా నియమిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ విజయోత్సవాల్లో ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ వలంటీర్లుగా నియమిస్తారు.
హైదరాబాద్ సిటీలో..
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపడుతారు. గోషామహల్లో నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి భూమిపూజ చేస్తారు. ఆరాంఘర్ జూపార్క్ ఫ్లై ఓవర్ఓపెన్చేస్తారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన ఆరు ఎస్టీపీలను ప్రారంభిస్తారు. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే వివిధ పనులకు భూమిపూజ చేస్తారు. వీటితో పాటు కేబీఆర్ పార్క్ సమీపంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసే రూ.826 కోట్ల భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతారు. హైదరాబాద్‌లో శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు 106 స్టాళ్లతో ఇందిరా శక్తి మహిళా బజార్‌ను ప్రారంభిస్తారు. తెలంగాణ ఫారెస్ట్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ భవనానికి పునాది రాయి వేస్తారు.
అలాగే, అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో సఫారీ థీమ్ పార్క్, బొటానికల్ గార్డెన్లను ప్రారంభిస్తారు. ఘట్కేసర్లో బాలికలకు ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పనులు జరుగుతున్న మల్లేపల్లి, మేడ్చల్, నల్గొండ ఏటీసీలను ప్రారంభిస్తారు. దామరచర్లలో యాదాద్రిలో థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ఒక యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు. దీంతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 237 సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.
ఇప్పటికే ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో తరగతులను ప్రారంభిస్తారు. కొత్తగా ప్రభుత్వం తలపెట్టిన స్పోర్ట్స్ యూనివర్సిటీకి భూమిపూజ చేస్తారు. ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ అధ్వర్యంలో ఏఐ సిటీ ఏర్పాట్లతో పాటు పలు ఒప్పందాలు చేసుకుంటారు. విజయోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు.