పూర్వ వైభవం దిశగా..రీజినల్ సైన్స్ సెంటర్

పూర్వ వైభవం దిశగా..రీజినల్ సైన్స్ సెంటర్
  • రూ. 4 కోట్లతో అభివృద్ధికి ప్రపోజల్స్
  • పాడైపోయిన సెంటర్ లోని ఎక్విప్ మెంట్ 
  • కబ్జా అయిన రూ.కోట్ల విలువైన భూములు  
  • అభివృద్ధి చేయాలని ఇన్ చార్జ్ మంత్రి ఆదేశాలు 
  • సంక్రాంతిలోపు పనులు పూర్తి చేసేలా అధికారుల ప్లాన్

హనుమకొండ, వెలుగు : విద్యార్థుల్లో సైన్స్​ పట్ల ఆసక్తి  పెంపొందించడంతో పాటు యువతలో వైజ్ఞానిక స్ఫూర్తిని కలిగించేందుకు రాష్ట్రంలోనే వరంగల్ లో ఏర్పాటైన ఏకైక రీజినల్​సైన్స్​సెంటర్(ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం)ను బీఆర్ఎస్ సర్కార్ పదేండ్లు నిర్లక్ష్యం చేసింది. సెంటర్ లోని ఎక్విప్​మెంట్​ రిపేర్లకు వచ్చాయి. సెంటర్ చెందిన రూ.కోట్లు విలువైన భూమి కబ్జా అయింది. అయినా.. ఆనాటి పాలకులు ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో సెంటర్​ ప్రక్షాళనపై ప్రస్తుతం రాష్ట్ర సర్కార్​ ఫోకస్​పెట్టింది. ఉమ్మడి జిల్లా ఇన్​చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చొరవతో సైన్స్​సెంటర్​ను అభివృద్ధి చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు.   

రాష్ట్రంలోనే ఏకైక సెంటర్

దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులకు పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు నేషనల్​కౌన్సిల్​ఆఫ్​సైన్స్​మ్యూజియమ్స్​(ఎన్‌‌‌‌‌‌‌‌సీఎస్‌‌‌‌ఎం) దాదాపు 54 సైన్స్​సెంటర్లను ఏర్పాటు చేసింది.  ఇందులో వరంగల్ రీజినల్​సైన్స్​సెంటర్​ఒకటి. 1999లో ఉమ్మడి ఏపీలోని విజయవాడ, తిరుపతి సైన్స్​సెంటర్లతో పాటే వరంగల్ కు కూడా మంజూరైంది. కానీ, వివిధ కారణాలతో పనులు లేట్ గా జరిగాయి. తెలంగాణ వచ్చాక హనుమకొండ హంటర్​రోడ్డులోని జూపార్కు ఎదురుగా గుట్టపై దాదాపు రూ.6 కోట్లతో బిల్డింగ్, రూ.కోటితో వివిధ రకాల ఎగ్జిబిట్స్​ఏర్పాటు చేశారు.

స్టేట్​కౌన్సిల్​ఆఫ్​ సైన్స్​అండ్​టెక్నాలజీ(టీజీఎస్​ కాస్ట్​) ఆధ్వర్యంలో పనిచేసే రీజినల్​సైన్స్​సెంటర్ ను 2015లో ఆనాటి డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ఇందులో ఏడు  విశాలమైన హాల్స్,​ వాటిలో ఖగోళ, పర్యావరణం, మానవ పరిణామక్రమం, శరీర నిర్మాణం, డీఎన్ఏ రూపం, సైన్స్​కు సంబంధించి ప్రాక్టికల్​గా తెలిపే ఎక్విప్​మెంట్స్​ఎన్నో ఉన్నాయి.

వృథాగా ఎక్విప్​మెంట్.. రూ.70 కోట్ల భూమి కబ్జా

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం  సైన్స్​సెంటర్​ నిర్వహణను నిర్లక్ష్యం చేసింది. 2015లో సెంటర్ ను ప్రారంభించినా.. ఆతర్వాత నుంచి మెయింటెనెన్స్​ను పట్టించుకోలేదు. దీంతో సెంటర్​ బిల్డింగ్​శిథిలావస్థకు చేరింది.  సైన్స్​, మ్యాథ్స్​వంటి తదితర శాస్త్రాల్లో పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 69 ఎగ్జిబిట్స్​లో నిర్వహణ లేక దాదాపు 20 వృథాగా మారాయి.  మరోవైపు డిజిటల్​మార్పులకు అనుగుణంగా ఎక్విప్​మెంట్​కూడా లేదు.

ముఖ్యమైన పరికరాలు రిపేర్లకు వచ్చాయి. దీంతో వాటిని చూసేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. ఎన్‌‌‌‌సీఎస్‌‌‌‌ఎం ఆధ్వర్యంలో సెంటర్​లో సుమారు రూ.1.6 కోట్లతో ఇన్నోవేషన్​హబ్​కూడా ఏర్పాటైంది.  కానీ.. ఇంతవరకు ఓపెనింగ్​కు నోచుకోలేదు. 14.36 ఎకరాల్లో రీజినల్​ సైన్స్​సెంటర్​ను ఏర్పాటు చేయగా.. రక్షణ చర్యల్లో భాగంగా కాంపౌండ్​ వాల్ నిర్మించలేదు. దీంతో  కొంతమంది స్థలాన్ని కబ్జా చేశారు. ఇక్కడ  గజం స్థలం రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతుంది. సుమారు రూ.70 కోట్ల విలువైన ఎకరంన్నర సెంటర్ స్థలాన్ని కబ్జా చేసేశారు.  

ఇన్ చార్జ్ మంత్రి ఆదేశాలతో.. 

రాష్ట్రంలో కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చాక వరంగల్ వెస్ట్​ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి సైన్స్ సెంటర్ సమస్యపై ఉమ్మడి జిల్లా ఇన్​చార్జ్​మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈనెల17న వరంగల్ పర్యటనకు వచ్చిన మంత్రి  సైన్స్​సెంటర్​పై రివ్యూ చేసి.. అభివృద్ధికి ప్రపోజల్స్​పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా బిల్డింగ్ రిపేర్లు, మెడిసినల్ ప్లాంట్ ఏర్పాటు వంటి సౌలతులు కల్పించేందుకు రూ.4 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి నివేదికను పంపారు.

ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పనులు చేపడతారు. సంక్రాంతిలోగా ఓపెన్ చేసేందుకు కలెక్టర్​ప్రావీణ్య టార్గెట్​పెట్టారు. అలాగే.. హంటర్​ రోడ్డులోని జూపార్కు ఎదురుగా గుట్టపైన రీజినల్​సైన్స్​ఉండడం.. దీనికి సమీపంలోనే పద్మాక్షి గుట్ట, భద్రకాళి బండ్​, కాళోజీ కళాక్షేత్రం ఉండగా.. వీటిని కలుపుతూ టూరిజం సర్క్యూట్​గా డెవలప్​ చేయాలనే డిమాండ్లు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. 

డెవలప్​ చేస్తే ఎంతో మేలు

రాష్ట్రంలోనే ఏకైక రీజినల్​సైన్స్​సెంటర్​ఇది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రాక్టికల్​నాలెడ్జ్​పెంచుకునేందుకు  సమీప జిల్లాల నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు.​ దీంతో సెంటర్​అభివృద్ధి పనులను త్వరగా చేపట్టి  వచ్చే సంక్రాంతిలోగా ఓపెన్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.  డెవలప్​అయితే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. 

- డాక్టర్ ఈర్ల రాకేశ్, రీజినల్ సైన్స్​సెంటర్​కో – ఆర్డినేటర్​