ఆదిలాబాద్​ నుంచే అభివృద్ధికి అడుగు : మంత్రి సీతక్క

  •  ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోనే అధికారంలోకి కాంగ్రెస్​: మంత్రి సీతక్క

మంచిర్యాల, వెలుగు: తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణను దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టి.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దానిని అవినీతి కూపంగా మార్చారని విమర్శించారు. ఇంద్రవెల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తూ.. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో కలిసి ఆయన నివాసంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.  

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పథంలో మొదటి అడుగు ఆదిలాబాద్ నుంచి పడుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత మొదటి బహిరంగ సభ ఇంద్రవెల్లిలోనే జరిగిందన్నారు. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితో దళిత గిరిజన దండోరా మోగించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షలపై నీళ్లు చల్లడం వల్లే కాంగ్రెస్​కు అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. స్టాఫ్ నర్స్​ల రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ వేసి వదిలేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నియామకాలు చేపట్టిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందలాది గ్రామాల్లో తాగునీరు కరువైందన్నారు. చాలా గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లు కూడా లేకపోవడం వల్ల ఇక్కడ మహిళలు, పిల్లలు రక్తహీనతతో రోగాలబారిన పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

కేస్లాపూర్​లో పూజల తర్వాత అభివృద్ధి పనులకు శ్రీకారం

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మళ్లీ ఇంద్రవెల్లి నుంచే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ముందుగా కేస్లాపూర్ లో పూజలు చేసి.. ఆ తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి భూమిపూజ చేస్తారని ఆమె తెలిపారు. అనంతరం మంచినీటి పథకంతో పాటు పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారని సీతక్క తెలిపారు. ఆదివాసీ బిడ్డగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ జిల్లా ఇన్​చార్జ్​ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇంద్రవెల్లి సభకు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు. డీసీసీ చైర్​ పర్సన్ కొక్కిరాల సురేఖ, ఐఎన్ టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్​ ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య, డాక్టర్ గణేశ్​రాథోడ్ పాల్గొన్నారు.