ప్రపంచ దేశాలు పోటీపడి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నాయి. అయితే, సాధించిన ఆర్థిక అభివృద్ధిని వాతావరణ మార్పుల వలన కోల్పోతున్నాం. వాతావరణ మార్పు అపారమైన ఆర్థిక నష్టాన్ని, ప్రాణనష్టాన్ని కలుగచేస్తోంది. దీనికి ఉదాహరణలు గత సంవత్సరం వాతావరణ మార్పుల వలన ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వరదలు, ప్రస్తుతం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాలీవుడ్ సినీ పరిశ్రమకు నిలయం అయిన లాస్ఏంజిల్స్ నగరం ఎదుర్కొంటున్న ‘వైల్డ్ ఫైర్’ (అడవి మంటలు) సంఘటన.
ఒకవైపు మనిషి సాంకేతికంగా, ఆర్థికంగా సాధిస్తున్న అభివృద్ధిని చూసి మానవాళికి సౌకర్యవంతమైన జీవితానికి ఢోకాలేదని భరోసా కలుగుతోంది. కానీ, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరోవైపు గమనించినట్లయితే పర్యావరణ సమస్యలు ముఖ్యంగా వాతావరణ మార్పుల వలన భూమిపై జీవుల మనుగడ భవిష్యత్తులో కష్టతరం అనిపిస్తోంది.
లాస్ఏంజిల్స్ కార్చిచ్చు అమెరికా చరిత్రలో అత్యంత భారీ అగ్నిప్రమాదంగా మారిందని, $200 బిలియన్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో పదుల సంఖ్యలో చనిపోయారు. 12,000 కంటే ఎక్కువ నిర్మాణాలు కాలిపోయాయి. కార్చిచ్చు వల్ల సుమారు 11,80,000 మంది ప్రభావితమయ్యారు. ఇంకో రెండు లక్షల మందిపై దీని ప్రభావం పడుతుందని అంచనా.
వైల్డ్ ఫైర్‌కు కారణం?
వైల్డ్ ఫైర్స్‌కి కారణాలు కొన్ని మానవ ప్రేరేపితాలు, మరికొన్ని ప్రకృతి ప్రేరేపిత సహజ కారణాలు. మానవులు ప్రమాదవశాత్తూ లేదా ఉద్దేశపూర్వకంగా కార్చిచ్చులను ఏర్పడడానికి కారణం అవుతారు. ఉదాహరణకు పొడి నేలలపై సిగరెట్లను నిర్లక్ష్యంగా పారవేయడం, వృక్ష సంబంధిత శిథిలాలను బహిరంగంగా దహనం చేయటం, విరిగిన లేదా సరిగ్గా లేని విద్యుత్ లైన్ల నుంచి షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు ఏర్పడటం మొదలైనవి మానవ ప్రేరేపిత కారణాలు. అదేవిధంగా అడవి ప్రాంతాలలో పిడుగులు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం, ఎండిన ఆకుల కుప్పలు లేదా కంపోస్ట్ వంటి సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవడం వల్ల కాలక్రమేణా వేడి ఉత్పత్తి అయ్యి అడవులలో మంటలు ఏర్పడటం మొదలగునవి ప్రకృతి సహజ కారణాలు.
లాస్ఏంజిల్స్ కార్చిచ్చు వెనకాల..
లాస్ఏంజిల్స్ కార్చిచ్చు సంఘటనకు సరైన కారణాలు తెలియకపోయినప్పటికీ, ‘వాతావరణ మార్పులే’ ఈ సంఘటనకు కారణమని పర్యావరణవేత్తలు చెపుతున్నారు. దీనికి కారణం లాస్ఏంజిల్స్ నగరంలో 2024 సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకు
ఆ నగరంలో 0.08 సెంటీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదు అయింది. అధిక ఉష్ణోగ్రతలతో అడవులు పూర్తిగా ఎండిపోవడం, అతివేగంగా వేడి గాలులు వీచటం వలన అడవిలో మంటలు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. ఈ నగరంలో ఇళ్ల నిర్మాణాలు కట్టెలతో నిర్మించటం వలన మంటల తీవ్రత ఎక్కువై భారీ నష్టం ఏర్పడింది.
వాతావరణ మార్పునకు కారణాలు..
వాతావరణ మార్పు ప్రధానంగా ఉష్ణోగ్రతలలో దీర్ఘకాలిక మార్పులను సూచిస్తుంది. 1800 సంవత్సరం నుంచి మానవ కార్యకలాపాలు వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ప్రధానంగా బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల దహనం కారణంగా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పు వల్ల సముద్ర మట్టం పెరుగుదల, గాలి నాణ్యత లోపించడం, నీటి కొరత ఏర్పడటం, కరువు పరిస్థితులు ఏర్పడటం, ఆరోగ్య సమస్యలు కలగటం, ఉష్ణోగ్రతల పెరుగుదల, వరదలు, వేడిగాలులు(హీట్‌వేవ్స్), (వైల్డ్‌ఫైర్) కార్చిచ్చులు వంటి అనేక ప్రతికూలతలు సంభవిస్తాయి.
పారిస్ ఒప్పందం
వాతావరణ మార్పు దాని ప్రతికూల ప్రభావాలను పరిష్కరించడానికి పారిస్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సమావేశం (కాప్ 21)లో ప్రపంచ నాయకులు 12 డిసెంబర్ 2015న కొంత పురోగతిని సాధించారు. దీనిని చారిత్రాత్మక ‘పారిస్ ఒప్పందం’ అని పిలుస్తారు. ఈ ఒప్పందం లక్ష్యాలు
ఈవిధంగా ఉన్నాయి. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వస్థాయి1850-–1900కాలం) కంటే 2డిగ్రీల C కంటే తక్కువగా ఉంచడానికి ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్గారాలను తగ్గించే దేశాలు ఇచ్చిన హామీలను, ప్రయత్నాలను సమీక్షించటం. వాతావరణ మార్పులను తగ్గించడానికి, వాతావరణ ప్రభావాలకు అనుగుణంగా సామర్థ్యాలను పెంపొందించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అందించటం.
ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ
195 దేశాలు, యూరోపియన్ యూనియన్, పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. పారిస్ ఒప్పందం 4 నవంబర్ 2016 నుంచి అమల్లోకి వచ్చింది. జూన్ 1, 2017న అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పారిస్ వాతావరణ మార్పు తగ్గింపు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థను అణగదొక్కుతుందని, అమెరికాను శాశ్వత ప్రతికూలతలో పడేస్తుంది అని ఆయన వాదించారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత ఫిబ్రవరి 19, 2021న యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా పారిస్ ఒప్పందంలో తిరిగి చేరింది. ఈనెల 20న అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ ప్యారిస్ ఒప్పంద విషయంపై ఏ నిర్ణయం తీసుకుంటాడో అని ఉత్కంఠ నెలకొంది.
ఉష్ణోగ్రత పెరుగుదల ప్రమాదం
మానవ ప్రేరిత భూతాపం ప్రస్తుతం దశాబ్దానికి 0.2డిగ్రీల C చొప్పున పెరుగుతోంది. అంటే భూమి ఉష్ణోగ్రత అనుకున్న లక్ష్యం కన్నా ఎంత వేగంగా పెరుగుతోందో దీని ద్వారా తెలుసుకొనవచ్చు.ఈ శతాబ్దం చివరినాటికి(2100) భూమి ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5డిగ్రీల Cకి పరిమితం చేయాలనుకున్నప్పటికీ 2024వ సంవత్సరం నాటికే భూమి ఉష్ణోగ్రత పెరుగుదల1.5డిగ్రీల Cకి చేరిందని వివిధ ప్రముఖ వాతావరణ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ భూమి ఉష్ణోగ్రత 2డిగ్రీల C పెరిగినట్లయితే భూమిపై సంభవించే విపరీత మార్పులను ఎట్టి పరిస్థితులలోను తిరిగి సరిదిద్దుకోలేం.
‘కార్చిచ్చు మహమ్మారి’ని ఎలా పరిష్కరించగలం?
దాదాపు అన్ని రకాల కార్చిచ్చులను నివారించవచ్చు. వాతావరణ మార్పులను, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గించడం వలన వర్షపాతం పెరుగుతుంది. దీంతో పొడి వృక్ష సంపద, పొడి వాతావరణం, వేడిగాలుల తీవ్రత, పిడుగుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. తద్వారా అడవి మంటలను నివారించవచ్చు. ప్రపంచ దేశాలు ఆర్థిక అభివృద్ధితో పాటుగా పర్యావరణం, వాతావరణ మార్పులను అరికట్టడంలో కూడా అభివృద్ధిని సాధించాలి.
ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే పరిశ్రమలు స్థాపించాలి. పరిశ్రమలను స్థాపించినప్పుడు అపారమైన జీవవైవిధ్యానికి నష్టం కలుగుతున్నది. కాబట్టి, ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటించాలి. ఎందుకంటే ఎంత ఆర్థిక అభివృద్ధి సాధించినప్పటికి మానవజాతికి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చేది ప్రకృతే. మానవుడు ప్రకృతి వైపరీత్యాలను నివారించలేడుగాని వాటి తీవ్రతను తగ్గించగలడు.
సినీ ప్రపంచంలో అత్యంత పేరు ప్రతిష్టలు సాధించిన, ఆర్థిక అభివృద్ధి సాధించిన చారిత్మాతక హాలీవుడ్ నగరంలో సంభవించిన కార్చిచ్చు మానవుడు పర్యావరణంపై చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి, భవిష్యత్తులో రాబోయే ప్రకృతి విలయాలకు ఒక ఉదాహరణ. వాతావరణం మార్పు అనేది ఒక దేశానికే పరిమితం కాదు ఇది భూగోళం అంతా ప్రభావితం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ప్రకృతి వైపరీత్యాలు, లాస్ఏంజిల్స్ కార్చిచ్చు ప్రమాదాన్నైనా చూసి ఇకనైనా అమెరికా, ఇతర ప్రపంచదేశాలు వాతావరణ మార్పులను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహించాలి. అదేవిధంగా ప్రజలు కూడా వాతావరణ మార్పులను తగ్గించడంలో కీలకపాత్ర పోషించాలి.
- డా. శ్రీధరాల రాము,ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్–