మా నాన్న హయాంలోనే అభివృద్ధి జరిగింది : పాల్వాయి స్రవంతి

‘వెలుగు’ ఇంటర్వ్యూలో మునుగోడు కాంగ్రెస్​ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్​ఎస్, బీజేపీని ప్రజలు నమ్మరని.. ఆ రెండు పార్టీలు చుక్క, ముక్కను నమ్ముకున్నాయని, ఎక్కడా ప్రజాసమస్యల గురించి మాట్లాడడం లేదని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విమర్శించారు. ఒక ఆడపిల్ల పోటీ చేస్తున్న చోట రెండు పార్టీలు కౌరవ సైన్యాలను దింపుతున్నాయని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు.. ముఖ్యంగా మహి ళలు తనకు అండగా ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.  తాను గెలిస్తే ప్రజాసమస్యలపై పోరాడతానని, పెండింగ్​ ప్రాజెక్టులను పూర్తి చేయిస్తానని బుధవారం ‘వెలుగు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్వాయి స్రవంతి చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

కాంగ్రెస్ ​హయాంలోనే అభివృద్ధి

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, మునుగోడు మేలు కోరే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న. మునుగోడులో అభివృద్ధి అంతా  కాంగ్రెస్ పార్టీ  హయాంలోనే జరిగింది. మా తండ్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి కాలంలోనే ఇక్కడి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంపూర్ణమైన న్యాయం దక్కింది. ఇండ్లు, రోడ్లు, కరెంట్, స్కూళ్లు, ఆసుపత్రులు ఆయన హయాంలో వచ్చినయ్​.  ఉప ఎన్నికలో మా ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీనే.  బీజేపీ ఇక్కడ క్షేత్రస్థాయిలో లేనేలేదు. ఆ పార్టీని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 

కాంగ్రెస్​లో విభేదాలు సహజమే

కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. విభేదాలు మొదటి నుంచి ఉన్నయే. ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు. దీనివల్ల కాంగ్రెస్ కు ఎన్నికల్లో ఎలాంటి నష్టం జరగదు. 

మహిళలు మావైపే

ఉప ఎన్నిక ప్రచారం బ్రహ్మాండంగా సాగుతున్నది. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నది. వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కే   ఓటెయ్యాలనే దృఢ నిశ్చయంతో ఉన్నరు. ఎక్కడికిపోయినా మహిళలు గొప్పగా స్వాగతం పలుకుతున్నరు.  ‘మొదటిసారి ఒక మహిళకు అవకాశం వచ్చింది.. ఈసారి ఎట్లయినా స్రవంతికి అండగా ఉంటాం’ అని వారు చెప్తున్నరు. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు అన్ని వర్గాల వాళ్లు కాంగ్రెస్ తోనే ఉన్నరు. మైనార్టీలు కూడా కాంగ్రెస్​ తోనే  దేశసమగ్రత నిలబడుతుందన్న నమ్మకంతో ఉన్నరు.   

పాల్వాయి వారసత్వం నిలబడుతుంది

ఉప ఎన్నికలో అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచిపెడుతున్నది. మద్యం పంపిణీ హద్దుమీరడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. టీఆర్​ఎస్​ తీరుపై ప్రజలకు వెగటు పుట్టింది. ప్రజలు ఎవరికి ఓటెయ్యాల్నో వాళ్లకే వేస్తరని నమ్ముతున్న.  నూటికి నూరుపాళ్లు పాల్వాయి వారసత్వం నిలబడుతుందని నమ్ముతున్న. పాల్వాయి వారసత్వం అంటే ప్రజల వారసత్వంగా ఇక్కడివాళ్లు భావిస్తరు. 

ప్రజా సమస్యల మీద కొట్లాడ్త

నన్ను గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గంలో ఆగిపోయిన చర్లగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్లను పూర్తి చేయాలని.. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని  కొట్లాడత. పోడు సమస్యలపైన పోరాడి.. వారికి భూముల మీద హక్కులు కల్పించేందుకు కృషి చేస్త. రోడ్లు, స్కూళ్ల అభివృద్ధికి పాటుపడ్త. చండూరులో ఇప్పటికీ  ఇంగ్లీషు మీడియం మోడల్ స్కూ ల్ లేదు. డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తే దానికి ఇంతవరకు బిల్డింగ్ కట్టలేదు. చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లేదు.  పింఛన్లు, రేషన్, తెల్లకార్డుల పంపిణీలో చాలా అవకతవకలున్నయ్​.  వీటిపైన ప్రజల గొంతుకనై పోరాటం చేస్త. 

చుక్క, ముక్కనే  నమ్ముకున్నరు 

టీఆర్ఎస్, బీజేపీ.. రెండుపార్టీలు కొనుగోలు కేంద్రాలు తెరిచినయ్​. ఎవరికివారే లీడర్లను కొంటున్నరు. ఎక్కడ చూసినా చుక్క, ముక్క ను  నమ్ముకుని సాగుతున్న ఎన్నికల ప్రచారమే కనిపిస్తున్నది.. తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆ పార్టీలు మాట్లాడడంలేదు. మూడున్నరేండ్ల నుంచి ఇక్కడ ఆ పార్టీల ఎమ్మెల్యే లేకపోతే ఏంటీ..?  మునుగోడులో కూడా ప్రజలు టీఆర్ఎస్​కు ఓట్లు వేసిన్రు. అయినప్పటికీ మునుగోడుపై  టీఆర్ఎస్ సవతి తల్లి ప్రేమ చూపించింది. 

కౌరవసైన్యాలను దింపిన్రు

ఒక్క ఆడపిల్ల పోటీ చేస్తున్నచోట ఇటో వంద మంది..  అటో వంద మంది  కౌరవ సైన్యాలను దింపిన్రు. దీన్ని బట్టే వాళ్ల పార్టీల అభ్యర్థుల మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అర్థమైతున్నది. ఈ మూడున్నరేండ్లలో నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడిండ్రా?  అసెంబ్లీ రికార్డుల్లోకి పోయి చూస్తే..  ఒకాయన ఎప్పుడూ కాంట్రాక్టుల కోసమే తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక అధికార పార్టీ నేతలైతే మునుగోడును పట్టించుకోనేలేదు. ఇప్పుడు ఎన్నికలొచ్చినయని మళ్లీ హామీలు ఇస్తున్నరు. పెండింగ్ పనులు చేస్తమంటూ మాయమాటలు చెప్తున్నరు.