- స్టార్టయినా పనులు ఎప్పుడు పూర్తయ్యేనో.. !
- ఏడేండ్ల కింద పూర్తికావాల్సిన పనులకు శంకుస్థాపన
- పెద్దపల్లిలో గుర్తొచ్చిన పట్టణాభివృద్ధి, సుందరీకరణ
- ఎన్నికల కోసం ఆగమాగం ప్రారంభోత్సవాలు
- హడావుడి పనులతో నాణ్యతపై అనుమానాలు
పెద్దపల్లి, వెలుగు: ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులను హడావుడిగా మొదలుపెడుతున్నారు. ఇప్పుడు శంకుస్థాపనలు చేసిన పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని జనం మాట్లాడుకుంటున్నారు. ఏడేండ్ల కింద పెద్దపల్లి జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, సుందరీకరణ చేపడతామని మంత్రి కేటీఆర్ప్రకటించారు. నిధులు సైతం కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క పనీ పూర్తికాలేదు. కేటాయించిన నిధులు వెనకకు పోగా.. ఇప్పుడు నిధుల కొరత వేధిస్తోంది. అయినప్పటికీ ఎలాగైనా పూర్తి చేయాలని నాణ్యత లేని పనులు చేపడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అన్నీ అరకొర పనులే..
2016 లో మంత్రి కేటీఆర్ పెద్దపల్లి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ క్రమంలోనే పెద్దపల్లితో పాటు మంథనిలోనూ మినీ ట్యాంక్‌బండ్ పనులు ప్రారంభించారు. ఏడేళ్లయినా మినీ ట్యాంక్ బండ్‌లు పూర్తికాలేదు. కానీ చెరువు చుట్టూ బారికేడ్లు, కట్టమీద రోడ్డు వరకే పరిమితమైంది. క్లీనింగ్, బోటింగ్ లాంటివి ఇప్పటివరకు లేవు. ఎన్నికలొస్తుండటంతో ఆగమాగంగా బోటింగ్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. టౌన్‌లో ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ సిస్టం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన నాయకులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేకపోయారు. మంత్రి చెప్పగానే ఆగమేఘాల మీద పెద్దపల్లి మున్సిపల్ బిల్డింగ్ కూల్చేశారు.
ఈ బిల్డింగ్ ఇంకా నిర్మాణంలోనే ఉంది. పెద్దపల్లిలో రూ.6 కోట్లతో నిర్మించతలపెట్టిన డ్రైనేజీ సిస్టం పనులను ఇప్పుడు మొదలుపెట్టారు. రూ.5 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా ఇంకా కడుతూనే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రోజుకోచోట అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల స్టంటే అని ప్రజలు చెప్తున్నప్పటికీ, మొదలుపెట్టిన పనులు పూర్తయితే సంతోషమే అంటున్నారు.
పనికి రానివి ముందు కట్టుకున్నరు...
ప్రజలకు ఉపయోగపడే పనులను పట్టించుకోని నేతలు.. సొంత పనులైతే. స్పీడుగా పూర్తి
చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్ నిర్మాణానికి జాగ చూడటంతోపాటు ఏడాదిలోపే నిర్మించి ప్రారంభించుకున్నారు. పాత గెస్ట్‌హౌజ్‌ను కూల్చేసి కొత్తది కట్టారు. ప్రజలకు అవసరమైన తాగునీరు అందించడం, డ్రైనేజీ సిస్టంను బాగుచేయడం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, డబుల్ బెడ్రూం ఇండ్లు, పార్కుల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఇదే శ్రద్ధ ప్రజోపయోగ పనులపై పెడితే ఇప్పటికే అవన్నీ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేవని ప్రతిపక్షాల లీడర్లు అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చెరువులపై మినీ ట్యాంక్ బండ్‌లు నిర్మిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవడం కోసం హడావుడిగా పనులు చేపడుతున్నారు.
ఇప్పుడు స్టార్ట్ చేస్తే పూర్తయ్యేదెప్పుడు..
ఎన్నికలొస్తున్నాయని హడావుడిగా శంకుస్థాపనలు చేస్తున్నరు, ఏడేండ్లుగా పూర్తి కానివి ఇప్పుడు పూర్తి చేస్తరా, ఇదంతా ఎన్నికల స్టంట్. జనాలను మరోసారి మోసం చేయడానికి చూస్తున్నరు. జనాలకు అక్కరకు రాని పార్టీ ఆఫీస్, గెస్ట్ హౌజ్‌లు ముందు కట్టుకున్నరు. అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నయి. పెద్దపల్లిలో మినీ ట్యాంక్ బండ్, మున్సిపాలిటీ బిల్డింగ్, ఇంటర్నల్ రోడ్లు ఇవన్నీ ఎప్పుడో పూర్తి కావాలే ఇప్పుడు ఆగమాగంగా చేస్తున్నరు.
- గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు