- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మండలాల్లో జరిగే అభివృద్ధి పనులను మండల స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నివేదికలు అందజేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. కలెక్టరేట్లో మండల ప్రత్యేక అధికారులతో గురువారం నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆమె మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల డాక్టర్లు అలర్ట్గా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధుల టైంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని చెప్పారు. పరిశుభ్రమైన తాగు నీరు అందేలా చూడాలన్నారు.
నాసిరకం విత్తనాలు అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీమ్లు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. నాసిరకం అమ్మేవారి డీలర్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. స్టాక్ బోర్డును ప్రతీ డీలర్ మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించారు. బడి బాట ప్రోగ్రాం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. స్కూల్స్ స్టార్ట్ అయ్యే నాటికి బుక్స్తో పాటు యూనిఫామ్స్ రెడీగా ఉండాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు 12లోపు పూర్తి చేయాలని చెప్పారు. ఈ మీటింగ్లో డీఆర్డీవో విద్యాచందనతో పాటు మండలాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ..
బడిబాట కార్యక్రమంలో...
పాల్వంచ రూరల్ : గురువారం పాల్వంచ మండలంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బడిబాట ర్యాలీని కలెక్టర్ ప్రియాంక అల జెండా ఊపి ప్రారంభించారు. ‘ప్రైవేటు బడి వద్దు.. ప్రభుత్వ బడి ముద్దు’ అనే నినాదంతో శాస్త్రి రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ బడుల్లో కల్పించే సదుపాయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విద్యాచందన, డీఈవో వెంకటేశ్వర చారి, జిల్లా సంక్షేమ అధికారి విజేత, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ స్వామి, పాల్వంచ ఎంఈవో శ్రీరాంమూర్తి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.