తాడ్వాయి, వెలుగు : మేడారం మహా జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండడంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 75 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో ఊరటం, తాడ్వాయి గ్రామాల్లో తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు.
అలాగే గిరిజన మ్యూజియం పక్కన మీటింగ్ హాల్, రెడ్డిగూడెం నుంచి జంపన్నవాగు పోయే దారిలో సీసీ రోడ్డు పనులు, మేడారం – ఊరటం దారిలో లో లెవెల్ బ్రిడ్జి, ఊరటం – కొండాయి రూట్‌లో రోడ్డు విస్తరణ, జంపన్న వాగు వద్ద గల స్తూపం నుంచి ఊరటం, కాల్వపల్లి రోడ్డు విస్తరించడంతో పాటు, పార్కింగ్ స్థలాలు, మేడారం, తాడ్వాయిలో బస్టాండ్‌లు నిర్మిస్తున్నారు. జంపన్న వాగు వద్ద భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా బ్యాటరీ ట్యాప్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు అత్యవసర వైద్యం అందించేందుకు వీలుగా గద్దెల పక్కనే ఉన్న టీటీడీ కల్యాణమండపంలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు.
పనులను పరిశీలించిన ఆఫీసర్లు
మేడారంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎండోమెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, ఈవో రాజేంద్ర బుధవారం మేడారంలో క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అలాగే ఐటీడీఏ పీవో అంకిత్, గెస్ట్‌హౌజ్‌లో జరుగుతున్న రిపేర్లను పరిశీలించి, పనులను స్పీడప్ చేయాలని ఆదేశించారు.
ఇసుక పూడికతీత, బ్యాటరీ ట్యాప్స్, మహిళలు దుస్తులు మార్చుకునే గదుల పనులను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని చెప్పారు. ఊరటంలో తాత్కాలిక మరుగుదొడ్లను పరిశీలించారు. మేడారంలో జరుగుతున్న పనులను ములుగు జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి పరిశీలించారు.
పెరిగిన రద్దీ
మేడారం సమ్మక్క, సారలమ్మకు ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం వనదేవతలను దర్శించుకొని నిలువెత్తు బంగారం, మొక్కులు సమర్పిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి బుధవారం కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. ఆయనకు అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ, ఈవో రాజేంద్ర, తహసీల్దార్ తోట రవీందర్‌తో పాటు పూజారులు స్వాగతం పలికారు. డోలు వాయిద్యాల నడుమ గద్దెల వరకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పసుపు కుంకుమ, బంగారం, చీరను అమ్మవార్లకు సమర్పించారు.