- సర్కారు ఫండ్స్ ఇయ్యక స్మార్ట్ సిటీ బడ్జెట్లు తలకిందులు!
- సీఎం, మంత్రుల హామీలతో వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో జంబో బడ్జెట్లు
- ఏడాదికేడాది పెంచుకుంటూ పోతున్న పాలకమండళ్లు
- తీరా ఫండ్స్ రాక తప్పుతున్న అంచనాలు
- వచ్చినయన్నీ జీతాలు, ఖర్చులకే సరిపోతున్నయ్
- వరంగల్, కరీంనగర్ సిటీల్లో ఆగుతున్న డెవలప్మెంట్ వర్క్స్
వరంగల్, వెలుగు: సర్కారు నుంచి ఆశించిన ఫండ్స్ రాకపోవడంతో రాష్ట్రంలోని రెండు స్మార్ట్‌సిటీలైన గ్రేటర్ వరంగల్, కరీంనగర్బల్దియా బడ్జెట్లు తల్లకిందులవుతున్నాయి. సీఎం కేసీఆర్ నుంచి మంత్రుల వరకు రకరకాల గ్రాంట్స్ ఇస్తామని హామీలు ఇస్తుండడంతో వాళ్లను నమ్మి రెండుచోట్లా పాలకవర్గాలు ఏటా జంబో బడ్జెట్‍లు ప్రవేశపెడుతున్నాయి. చివరికి ఇస్తామన్న ఫండ్స్ ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి. తాజాగా రెండు కార్పొరేషన్లలోనూ 2022–23 బడ్జెట్ ప్రవేశపెట్టడంతో గతేడాది అంచనాల్లోని లోపాలు బట్టబయలయ్యాయి. ఇక పబ్లిక్ నుంచి అంతోఇంతో వచ్చే ట్యాక్స్‌లు, రెంట్లు, స్టాఫ్ జీతాలు, కరెంటు బిల్లులు, శానిటేషన్మెయింటనెన్స్కే సరిపోతున్నాయి. దీంతో ఫండ్స్ సాధించలేని పాలకవర్గాలు కాగితాల్లో అంకెలు చూసుకొని ఎన్నాళ్లు మురుస్తాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం చెప్పిన రూ.300 కోట్లు రాలే..
2016 జనవరిలో సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు బడ్జెట్‍లో గ్రేటర్ వరంగల్ డెవలప్‍మెంట్‍కు ఏటా రూ.300 కోట్లు కేటాయిస్తామని మాటిచ్చారు. 2016 నుంచి 2019 వరకు రూ.900 కోట్లు కేటాయించినా, కేవలం రూ.150 కోట్లు మాత్రమే రిలీజ్చేశారు. గతేడాది గ్రేటర్వరంగల్ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‍లో రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఈ డబ్బులు వస్తాయనే ఆశతో జీడబ్ల్యూఎంసీ 2020–21లో తన బడ్జెట్‍ను 570.79 కోట్లకు పెంచుకుంది. ఇందులో కేసీఆర్ హామీ ఇచ్చినరూ.300 కోట్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల గ్రాంట్ల ద్వారా రూ.423 కోట్ల 85 లక్షలు వస్తాయని అంచనా వేశారు. తీరాచూస్తే కేవలం రూ.119 కోట్ల 94 లక్షలు మాత్రమే వచ్చాయి. మిగిలిన రూ.303 కోట్ల 91 లక్షలు పేపర్ల మీదే ఉన్నాయి. దీని ఎఫెక్ట్ పనులపై పడి కొన్ని మధ్యలోనే ఆగిపోగా, మరికొన్ని పనులను చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. అయినా 2022–23 బడ్జెట్‍ను అంతకంటే ఎక్కువగా రూ.609.47 కోట్లతో ప్రవేశపెట్టారు. ఇందులో బల్దియా అసలు ఆదాయం రూ.197 కోట్ల 52 లక్షల 50 వేలు మాత్రమే కాగా.. మిగతా రూ.411 కోట్ల 95 లక్షలు సీఎం కేసీఆర్హామీపై ఆశపడి చూపించారు.
ఫండ్స్ లేకపాయే..పనులు ఆగిపాయే...
మున్సిపల్‍శాఖ మంత్రి కేటీఆర్ గత ఏడాది ఏప్రిల్12న వరంగల్ ట్రై సిటీలో పర్యటించారు. మడికొండ రాంపూర్ వద్ద మిషన్‌భగీరథ మంచినీటి సరఫరా పనులను ప్రారంభించడంతో పాటు..దేశాయిపేట, ఎల్‍బీ నగర్, మండీబజార్, లక్ష్మీపురం, లేబర్‍కాలనీ, శివనగర్, కరీమాబాద్, రంగాశాయిపేట, హంటర్ రోడ్, సమ్మయ్యనగర్, నయీంనగర్ వంటి 30–40 ప్రాంతాల్లో డెవలప్మెంట్పనులకు శిలాఫలకాలు వేశారు. ఇందులో చాలా పనులు ఫండ్స్లేక ముందుకుసాగట్లేదు.
కరీంనగర్ కార్పొరేషన్‍లోనూ అంతే..
కరీంనగర్ కార్పొరేషన్2021–2022 కోసం రూ.334 కోట్లతో వాస్తవిక అంచనా బడ్జెట్ప్రవేశపెట్టారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.232 కోట్లు మాత్రమే వచ్చాయి. సీఎం హామీ కింద రూ.100 కోట్లు , స్మార్ట్ సిటీ ఫండ్స్రూ.80 కోట్లు, కార్పొరేషన్సొంత ఇన్‌కం, 14వ ఫైనాన్స్, పట్టణ ప్రగతి నిధులు కలిపి రూ.52.23 కోట్ల వరకు మాత్రమే వచ్చాయి.
సాగని పనులు ఇవే..
గత వరదలకు వరంగల్ మునిగిన నేపథ్యంలో మరోసారి అలా జరగకుండా పర్మినెంట్ సొల్యూషన్చూపించడానికి నాలాకు రెండువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. రూ.25 కోట్లు మం జూరు చేస్తున్నట్లు చెప్పారు. కేటీఆర్ శంకుస్థాపన చేసినా ఫండ్స్ లేక ఈ పనులు ఆగిపోయాయి.
గత ఏడాది జూన్ 29న నిర్వహించిన కౌన్సిల్ మీటింగ్‍లో గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లకు బల్దియా జనరల్ ఫండ్స్ ద్వారా ఒక్కో డివిజన్‍కు రూ.50 లక్షలు కేటాయిస్తూ తీర్మానం చేశారు. 70 శాతం డివిజన్లలో ఇంతవరకు వీటికి సంబంధించిన ప్రతిపాదనలే సిద్ధం కాలేదు.
వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు జంక్షన్ల బ్యూటిఫికేషన్ వర్క్స్ నిలిచిపోయాయి.
చాలాచోట్ల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టలేదు.
ఇంటిగ్రేటేడ్ వెజ్, నాన్‍వెజ్ మార్కెట్ల నిర్మాణాలైతే ముగ్గు పోసిన దగ్గరే ఆగాయి.
వరంగల్‌లో నంబర్ గేమ్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ విషయంలో పాలకమండలి, ఆఫీసర్లు నంబర్‌గేమ్ ఆడుతున్నారు. 2010–11 బడ్జెట్‍ను రూ.150–200 కోట్లతో ప్రతిపాదించగా, తొమ్మిదేళ్లకే పదింతలు పెంచారు. 2017 –18లో రూ.1043 కోట్లు, 2018 –19 సంవత్సరానికి రూ.1123.97 కోట్లు చూపారు. 2019 – 20లో ఏకంగా రూ.1431 కోట్లకు పెంచేశారు. చివరికి వాస్తవంలోకి వచ్చిన అప్పటి కమిషనర్ పమేలా సత్పతి ఆ బడ్జెట్‍ను 2020– 21లో రూ.305 కోట్లతో రూపొందించారు. 2021–22లో గ్రేటర్ వరంగల్ ఎన్నికలు ఉండడంతో ఓటర్ల దృష్టిని ఆకర్శించేందుకు 559.77 కోట్లకు పెంచారు. ఈసారి ఇంకాస్త పెంచి రూ.609.47 కోట్లు చేశారు.