మహబూబ్‌నగర్, వెలుగు: మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు ముందు పడ్తలేవు. నిరుడు జూన్‌లో ఆయన పాలమూరు జిల్లాలో పర్యటించి పేరూరు లిఫ్ట్ స్కీం, వర్నె-ముత్యాలంపల్లి బ్రిడ్జి నిర్మాణం, బీటీ రోడ్డు, గుడిబండ నుంచి హైవే వరకు బీటీ రోడ్డు, పోతులమడుగు వద్ద మినీ స్టేడియం, భూత్పూర్ మున్సిపాటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు ఈ పనుల్లో ఒక్కటీ పూర్తి కాలేదు. 30 శాతం పనులు కూడా కంప్లీట్ కాకపోగా, కొన్నింటికి పునాదులు తీసి వదిలేశారు.
పేపర్ల మీదనే పేరూరు స్కీం..
దేవరకద్ర నియోజకవర్గంలోని 2,500 ఎకరాలకు సాగు నీటిని అందించాలని రామన్‌పాడు బ్యాక్ వాటర్ ఆధారంగా పేరూరు స్కీంకు డిజైన్ చేశారు. ఈ స్కీంకు మంత్రి కేటీఆర్ తుపాకులగుట్ట వద్ద జూన్ 4న కొబ్బరికాయ కొట్టారు. కానీ, ఇంత వరకు 20 శాతం పనులు కూడా జరగలేదు. రూ.51 కోట్లతో స్కీంను పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.31 కోట్లకు సంబంధించిన పనులకు మాత్రమే అగ్రిమెంట్ చేశారు. రామన్‌పాడు నుంచి తుపాకుల గుట్ట వరకు 9.6 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులు చేయాల్సి ఉండగా, ఐదు నెలల కింద కొన్ని చోట్ల మాత్రమే పైపులైన్ కోసం తవ్వి వదిలేశారు. అప్పటి నుంచి ఈ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. రూల్‌ప్రకారం ఏడాదిలోపు ఈ స్కీంను వినియోగంలోకి తీసుకురావాల్సి ఉండగా, ఏడాది పూర్తి కావస్తున్నా పనులు ముందుకు పడ్తలేవు.
అన్ని పనులు ఇన్ కంప్లీట్..
అడ్డాకుల మండలంలోని ఊకచెట్టువాగుపై వర్నె-ముత్యాలంపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు స్లోగా సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2016లో మొదటి సారి ప్రపోజల్స్ పంపగా, 2021లో అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇచ్చారు. 320 మీటర్ల బ్రిడ్జి, నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు వేయాల్సి ఉంది. ఇందుకు గాను రూ.18 కోట్లు కేటాయించగా, ఇందులో రూ.9 కోట్లు బ్రిడ్జికి, రూ.9 కోట్లు రోడ్డుకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ పనులకు జూన్ 4న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా, టెండర్లు ఆలస్యం కావడంతో నాలుగు నెలల తర్వాత పనులు మొదలు పెట్టారు. బ్రిడ్జికి సంబంధించి ర్యాప్ట్ 150 మీటర్లకు గాను వంద మీటర్ల పని పూర్తి చేశారు. 15 స్లాబ్లకు గాను మూడు స్లాబ్‌లు కంప్లీట్ అయ్యాయి. లింక్ రోడ్డు పనులకు టెండర్లు పిలువ లేదు. మరో నెలలో వర్షాలు ప్రారంభం కానుండడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరదలు వస్తే చేసిన పనులు కొట్టుకుపోతాయని చెబుతున్నారు. అలాగే గుడిబండ నుంచి హైవే వరకు బీటీ రోడ్డు పనులు పూర్తి కాలేదు. 3 నెలల కింద పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 20 ఎంఎం కంకర పోసి వదిలేశారు. డస్ట్, కంకరవేసి రోల్ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆ పనులు ప్రారంభించలేదు. దీంతో దుమ్ము లేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
పునాదులు దాటని ఇంటిగ్రేటెడ్ మార్కెట్
భూత్పూర్ మున్సిపాల్టీలో రూ.2 కోట్లతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి కర్వెన రూట్లో ఉన్న స్థలంలో మంత్రి కేటీఆర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ భూమి ఎండోమెండ్కు చెందినది కావడంతో స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ లీడర్లు మరుసటి రోజు శిలాఫలకాన్ని తీసేశారు. ఆ తర్వాత భూత్పూర్ సమీపంలోని సర్వే నంబర్ 392లోని ప్రభుత్వ భూమి గుర్తించి, మార్కెట్‌కు కేటాయించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పునాదులు వరకు వేసి వదిలేశారు. అప్పటి నుంచి పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అలాగే పోతులమడుగు శివారులో మినీ స్టేడియంకు శంకుస్థాపన చేయగా, అక్కడా పనులు పూర్తి కాలేదు.
డిజైన్ మారుస్తున్నాం..
పేరూరు డిజైన్ ప్రకారం రామన్‌పాడు బ్యాక్ వాటర్ ఆధారంగా కొత్తపల్లి వద్ద పంపుహౌస్ నిర్మించాల్సి ఉంది. అక్కడి నుంచి పైపులైన్ ద్వారా స్కీం కింద ఆయకట్టుకు నీళ్లు అందించాల్సి ఉంది. అయితే, పంపుహౌస్ డిజైన్‌ను మార్చాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. కొత్త డిజైన్ రూపొందిస్తున్నాం.
- జగన్మోహన్రెడ్డి, ఇరిగేషన్ ఈఈ