ఎన్నికలొస్తున్నయని.. పనులు చేస్తున్రు

  • గ్రేటర్‌‌ వరంగల్‌‌లో హడావుడిగా అభివృద్ధి పనులు
  • ఇన్నాళ్లూ పట్టించుకోని లీడర్లు.. ఇప్పుడు ఆఫీసర్లపై ప్రెజర్‌‌
  • టార్గెట్లు పెట్టి మరీ పనులు చేయిస్తున్న వైనం

హనుమకొండ, వెలుగు : మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరుగనుండడం, అభివృద్ధి పనులన్నీ పెండింగ్‌‌లో ఉండడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లలో టెన్షన్‌‌ మొదలైంది. దీంతో ఇప్పటికప్పుడు పనులను స్పీడప్‌‌ చేసి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పైసల్లేక మేజర్‌‌ ప్రాజెక్ట్‌‌లన్నీ ఆగిపోవడంతో ప్రజలు తరచూ చర్చించుకునే పనులపై ఫోకస్‌‌ పెట్టి హడావుడిగా పనులు చేయిస్తున్నారు.

వడివడిగా వంద ఫీట్ల రోడ్డు

వరంగల్‌‌ నగరంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట వెళ్లేందుకు వంద ఫీట్ల రోడ్డు ఎంతో ప్రధానమైంది. అండర్‌‌ గ్రౌండ్‌‌ డ్రైనేజీ పనుల కోసం 2022 ఫిబ్రవరిలో ఈ రోడ్డును తవ్వేశారు. మూడు నెలల్లో పనులు కంప్లీట్ చేస్తామని చెప్పినా ఏడాదిన్నరైనా పూర్తి కాలేదు. దీంతో ఈ మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, చిన్నా చితక వ్యాపారాలు చేసుకునే వారు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం ఇక్కడి లీడర్లు వంద ఫీట్ల రోడ్డు పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. ప్రెసిడెన్సీ స్కూల్​నుంచి సమ్మయ్యనగర్‌‌ వరకు అర కిలోమీటర్‌‌ రోడ్డు రూ.4.5 కోట్లు, సమ్మయ్యనగర్​నుంచి అమరావతినగర్​ బ్రిడ్జి వరకు కిలోమీటర్‌‌ పనులకు రూ.10 కోట్లు మంజూరు చేయించి పనులు చేయిస్తున్నారు. 

బొందివాగుకు నిధులు

2020లో భారీ వర్షాల వల్ల నగరం నీటమునిగినా నాలాల విస్తరణ, డెవలప్‌‌మెంట్‌‌ను లీడర్లు పట్టించుకోలేదు. రెండు నెలల కింద మరోసారి వరదలు నగరాన్ని ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లీడర్లు నాలాల విస్తరణను తెర మీదకు తెచ్చారు.  జనాల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు కొంతమేర  వెడల్పును కుదించి నయీంనగర్‌‌ నాలా విస్తరణ పనులు మొదలు పెట్టారు. బొందివాగు వల్ల 2020 తర్వాత కూడా చాలాసార్లు చుట్టుపక్కల కాలనీలు మునిగినా పట్టించుకోని లీడర్లు ప్రస్తుతం ఈ పనుల కోసం రూ. 158 కోట్లు మంజూరు చేయించారు. ఇక వరంగల్‌‌ బస్టాండ్‌‌ అంశం కూడా తరచూ చర్చనీయాంశం అవుతుండడంతో స్థానిక ఎమ్మెల్యే ఆఫీసర్లపై ప్రెజర్‌‌ పెంచినట్లు సమాచారం. దీంతో మంత్రి కేటీఆర్‌‌ను నగరానికి తీసుకొచ్చి బస్‌‌ టెర్మినల్‌‌కు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే సిటీలో జంక్షన్ల విస్తరణ, డివైడర్లకు పెయింటింగ్‌‌లు కూడా చేయిస్తున్నారు.

రూ.వెయ్యి కోట్లలో వచ్చింది పావు వంతే...

నాలాల ఆక్రమణ, రిటైనింగ్‌‌ వాల్స్‌‌ లేకపోవడం వల్ల 2016, 2020లో వరదలు నగరాన్ని ముంచెత్తాయి. ఈ ఏడాది జులైలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 2020 ఆగస్టులో వర్షాలు కురిసినప్పుడు భారీ ఎత్తున నష్టం జరుగగా రూ.250 కోట్లతో ప్రపోజల్స్‌‌ పంపించారు. అప్పుడు తక్షణ సాయం కింద రూ.25 కోట్లు, ఆ తర్వాత మరో రూ.100 కోట్లు రిలీజ్‌‌ చేసిన ప్రభుత్వం మిగిలిన నిధులను మాత్రం విడుదల చేయలేదు. గత జులైలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరం మల్లీ అతలాకుతలమైంది. అసలే ఎలక్షన్‌‌ ఇయర్‌‌ కావడం, పెండింగ్‌‌ పనులే అనుకుంటే మళ్లీ వరదల వల్ల నాలాలు, రోడ్లు, డ్రైన్లు, డివైడర్లు దెబ్బతినడంతో అభివృద్ధి పనులు Wరూ. 1000 కోట్లతో ప్రపోజల్స్‌‌ పంపితే ప్రభుత్వం మాత్రం రూ.250 కోట్లు మాత్రమే రిలీజ్‌‌ చేసింది. ఈ నిధులతో రోడ్లు, డ్రైన్లు, నాలాల రిపేర్లు వంటి పనులను చేస్తున్నారు.

ఆఫీసర్లపై ప్రెజర్‌‌

అభివృద్ధి పనుల విషయాన్ని నాలుగున్నరేండ్లు పట్టించుకోని లీడర్లు త్వరలో ఎలక్షన్లు ఉండడంతో ఆఫీసర్లపై ప్రెజర్‌‌ పెట్టి మరీ పనులు చేయిస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో టార్గెట్‌‌ ఫిక్స్‌‌ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా రోడ్లు, డ్రైన్లతో పాటు సిటీలో ప్రధానంగా చెప్పుకునే పనులపై  ఫోకస్‌‌ పెట్టారు. అయితే హడావుడిగా పనులు చేయడం వల్ల క్వాలిటీ దెబ్బతింటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.