మధిర, వెలుగు: అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం మధిరలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పనులను క్వాలిటీతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు. ట్యాంక్ బండ్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, 100పడకల ఆసుపత్రి, ఆడిటోరియం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ, మిషన్ భగీరథ, మున్సిపల్, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలోని సైదల్లీపురం గ్రామంలో ఖాళీగా ఉన్న డబుల్బెడ్రూం ఇండ్లు అర్హులకు అందించాలని సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు కలెక్టర్‌ను కోరారు. అడిషనల్ కలెక్టర్ స్నేహలత, ఆర్డీవో రవీంద్రనాధ్, మున్సిపల్ చైర్పర్సన్ ఎం లత, ఎంపీపీ మెండెం లలిత, కమిషనర్ రమాదేవి, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో విజయ్‌భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉత్సవమూర్తులకు అభిషేకం
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం స్వామి ఉత్సవమూర్తులకు బేడా మండపంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గర్భగుడి నుంచి పల్లకిలో ఉత్సవమూర్తులను మండపానికి తీసుకొచ్చిన అర్చకులు పాలు, తేనె, పెరుగు, పంచదార, నెయ్యితో అభిషేకం, విశేష తిరుమంజనం జరిపారు. తర్వాత కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిగింది. అంతకుముందు స్వామికి విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం నివేదించారు. సాయంత్రం స్వామికి దర్బారు సేవ జరిగింది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
పోలీసుల ర్యాలీలు
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఖమ్మం నగరంలో చేపట్టిన సైకిల్ ర్యాలీని అడిషనల్ డీసీపీ డాక్టర్ శబరీశ్ జెండా ఊపి ప్రారంభించారు. చాతకొండ ఆరో బెటాలియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో బైక్ ర్యాలీని చేపట్టారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి శ్రీనివాసరావు, కమాండెంట్ ఎస్ శ్రీనివాసరావు, డీఎస్పీ వెంకటేశ్వరబాబు పాల్గొన్నారు. మణుగూరు పట్టణంలో సబ్ డివిజన్ పోలీసులు బైక్ ర్యాలీ చేపట్టారు. డీఎస్పీ ఎస్వీ రాఘవేంద్రరావుతో పాటు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
- ఖమ్మం కార్పొరేషన్/భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు
మోడల్ అంగన్వాడీ సెంటర్లుగా మార్పు
భద్రాచలం,వెలుగు: ప్రస్తుతం నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలను అన్ని సదుపాయాలతో మోడల్ సెంటర్లుగా మార్చేందుకు ప్రపోజల్స్ తయారు చేయాలని ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబరులో ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తొలి దశలో 20 అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేశామని, ఆయా గ్రామాల్లో తీర్మానాలు తీసుకుని పనులు ప్రారంభించాలన్నారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో ఆట వస్తువులు, వాల్‌పెయింటింగ్, అవసరాన్ని బట్టి ప్రహరీ గోడలు నిర్మించాలని సూచించారు. సొంత భవనాలు ఉన్న కేంద్రాలను మాత్రమే ఎంపిక చేయాలని కోరారు. ఏపీవో జనరల్ డేవిడ్‌రాజు, ఈఈ తానాజీ, ఎస్ఓ సురేశ్‌బాబు, డీఈవో సోమశేఖర్‌శర్మ పాల్గొన్నారు.
పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలి
సత్తుపల్లి/పెనుబల్లి/కల్లూరు/వేంసూర్, వెలుగు: ప్రజల్లో పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం కలిగేలా పోలీసుల పనితీరు మెరుగు పర్చుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. బుధవారం సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, వేంసూరు పోలీస్ స్టేషన్లతో పాటు ఏసీపీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి ఫైల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రిమినల్ గ్యాంగ్ లపై దృష్టి సారించాలన్నారు. నమోదైన ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, ఇటీవల అందుబాటులోకి వచ్చిన సీసీటీఎన్ఎస్ 2.0ను వినియోగిస్తూ దర్యాప్తు చేయాలని సూచించారు. తరచూ తీవ్రమైన నేరాలకు పాల్పడే క్రిమినల్స్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. సరిహద్దులో నిఘా వ్యవస్థను పటిష్ట పర్చి గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. పోక్సో యాక్ట్, మహిళలపై జరిగే దాడులు, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో శిక్ష పడేలా పకడ్బందీగా చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ఏసీపీ వెంకటేశ్, పెనుబల్లి సీఐ హనూక్, కల్లూరు, వేంసూర్, సత్తుపల్లి, పెనుబల్లి ఎస్ఐలు బలుగూరి కొండలరావు, సురేశ్, రాములు, సూరజ్ పాల్గొన్నారు.
స్టూడెంట్స్ కు ఎంపీ ఆర్థికసాయం
ఖమ్మం టౌన్, వెలుగు: రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామానికి చెందిన ఇంజనీరింగ్, ఇంటర్ స్టూడెంట్స్మొగిలిశెట్టి శశిఅభినయ, పవన్ విలాస్ లకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రూ.30 వేల చొప్పున రూ.60 వేల ఆర్థికసాయం అందజేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేదలైన వీరికి అండగా నిలుస్తానని ఆయన భరోసా కల్పించారు. పేద మళ్ల సత్యం, తొగరం రామారావు, యాసా తిరుపతి రావు, ఆకుతోట పుల్లారావు పాల్గొన్నారు.
భూముల వ్యవహారంలో సహకరిస్తాం
భద్రాచలం, వెలుగు: ఏపీలో విలీనమైన ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో వివాదంలో ఉన్న 913 ఎకరాల భూముల వ్యవహారంలో రామాలయానికి పూర్తిగా సహకరిస్తామని అక్కడి రైతులు స్పష్టం చేశారు. స్థానిక క్రాంతి ఐటీఐ సమీపంలో మీడియాతో రైతు ప్రతినిధులు మాట్లాడుతూ దేవస్థానం భూముల్లో తాము అక్రమంగా ఉన్నామంటూ రామాలయం ఆఫీసర్లు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని తెలిపారు. 1878లో సోమరాజు పురుషోత్తమరాజు అనే భక్తుడు ఈ భూమిని దేవస్థానానికి దానంగా ఇచ్చారన్నారు. అనంతరం నైజాం సర్కారు అప్పటి వరంగల్ కలెక్టర్ పబ్లిక్ ఆక్షన్ పెట్టి ఆ భూములను తహసీల్సాహెబ్కు విక్రయించారని తెలిపారు. ఆయన వాటిని తన భార్య ఫాతిమా బేగం పేరిట రిజిస్టర్ చేశారని చెప్పారు. ఆ తరువాత ఆ భూమి చేతులు మారుతూ వచ్చిందని తెలిపారు. 2002లో ఉమ్మడి ఏపీలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్లు దేవస్థానం, రైతుల మధ్య వివాదం పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, రామాలయం అధికారులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. రామిరెడ్డి, చంద్రరావు, రాధ, లక్ష్మారెడ్డి, అన్నం రామిరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
కార్తీక మాసంలో సామూహిక వ్రతాలు
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో కార్తీకమాసం సందర్భంగా నవంబరు 23 వరకు ప్రతి ఆది, సోమవారాలతో పాటు ఏకాదశి రోజుల్లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శివాజీ తెలిపారు. దేవస్థానం చిత్రకూట మండపంలో ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు వ్రతాలు ఉంటాయని, భక్తులు ఆయా రోజుల్లో రూ.516 చెల్లించి వ్రతంలో పాల్గొనవచ్చని చెప్పారు. వ్రతానికి సంబంధించిన సామగ్రి దేవస్థానం సమకూర్చుతుందని తెలిపారు.
8న ఆలయం తలుపులు మూసివేత
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా నవంబరు 8న ఉదయం 7.30 గంటలకు శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయం తలుపులు మూసి వేయనున్నట్లు ఈవో శివాజీ తెలిపారు. రాత్రి 7 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి చేసి సంప్రోక్షణ అనంతరం స్వామికి ఆరాధనలు, నివేదనలు ఇస్తామన్నారు. మరుసటి రోజున స్వామి దర్శనం కల్పిస్తామని చెప్పారు.
రేషన్ బియ్యం సీజ్
సత్తుపల్లి, వెలుగు: మండలంలోని తుంబురు గ్రామ శివారులోని జీడిమామిడి తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై ఆఫీసర్లు సీజ్ చేశారు. సివిల్ సప్లై డీటీ సత్యనారాయణ 30 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకొని రేషన్ డీలర్ మజీద్ కు అప్పగించారు.
కార్తీక స్నానం చేసెదెట్లా?
రామయ్య కొలువైన భద్రాద్రి వద్ద గోదావరి తీరం బురదమయంగా మారడంతో కార్తీకమాసంలో పుణ్య స్నానం కోసం వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల వచ్చిన వరదలతో స్నానఘట్టాలపై బురద మేట వేసింది. ఆ బురద మేటలను దేవస్థానం, గ్రామ పంచాయతీ ఆఫీసర్లు తొలగించలేదు. కార్తీక స్నానాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుండగా, కనీస ఏర్పాట్లు చేయలేదు. దీంతో బురదలో నడుచుకుంటూ వెళ్లి గోదావరిలో స్నానాలు చేయాల్సి వస్తోంది. కార్తీక సోమవారం రోజు వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా స్నానఘట్టాలపై బురదమేటలను తొలగించాలని భక్తులు కోరుతున్నారు.
- భద్రాచలం, వెలుగు
కోతులను నియంత్రించాలని రైతుల ధర్నా
కామేపల్లి, వెలుగు: పంటలను కోతుల నుంచి కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. బుధవారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలను కోతులు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దుగ్గి కృష్ణ, ఇంజం నాగభూషణం, రాయల సత్యనారాయణ, బాదావత్ శ్రీనివాస్, మద్దులపల్లి ఎంపీటీసీ గబ్రూ నాయక్, భుక్యా రమణ, వి సూర్య నారాయణ, లావుడ్యా రవి పాల్గొన్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణపై ఫోకస్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు అడిషనల్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు తెలిపారు. ‘భద్రాద్రి టు కాకినాడ’ పేరుతో వెలుగు పత్రికలో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందించారు. రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులకు అక్రమంగా అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జులై నుంచి ఇప్పటి వరకు 55 వెహికల్స్‌ను సీజ్ చేశామని చెప్పారు. పాల్వంచ పట్టణంలో మూడు రైస్ మిల్లులను సీజ్ చేసి 1,307 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇల్లందు, మణుగూరు, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపహాడ్, కొత్తగూడెం, సుజాతనగర్, అశ్వారావుపేట ప్రాంతాల్లో 8 చెక్ పోస్టులను పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల సమన్వయంతో ఏర్పాటు చేశామని తెలిపారు.
హుండీ లెక్కింపు వాయిదా
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఈవో శివాజీ తెలిపారు. అనివార్య కారణాలతో జరగాల్సిన హుండీ లెక్కింపు వాయిదా వేశామని, తిరిగి నిర్వహించే తేదీని ప్రకటిస్తామని చెప్పారు.