అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి .. సమీక్షా సమావేశంలో :కలెక్టర్ సంతోష్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, ఆర్డీవో హరికృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, ముఖ్య ప్రణాళిక అధికారి జి.సత్యంతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 

నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాల నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాలని, పాఠశాలల్లో బాలబాలికలకు ప్రత్యేక టాయ్​లెట్లు రెండు నెలల్లోగా పూర్తిచేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఎల్లంపల్లి నుంచి తాగునీరు సరఫరా చేయాలి: ఎమ్మెల్యే వినోద్

ఆసిఫాబాద్ లోని అడ ప్రాజెక్ట్ నుంచి కాకుండా మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బెల్లంపల్లి పట్టణానికి తాగునీరు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. 

ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా జవాబుదారీగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. సింగరేణి సంస్థ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నివేదిక అందించాలన్నారు. పెన్షన్‌దారులకు సకాలంలో పెన్షన్ అందించాలని, ఉపాధిహామీ పథకంలో జాబ్ కార్డులున్నవారికి పని కల్పించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల జనరల్ మేనేజర్లు మనోహర్, రవిప్రసాద్, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.