పన్నులే పెరిగినయ్‌‌ పనులు జరగలే

  •     అభివృద్ధికి నోచుకోని గ్రేటర్‌‌ విలీన గ్రామాలు
  •     మధ్యలోనే ఆగిపోయిన అభివృద్ధి పనులు
  •     ఇటీవల నిర్వహించిన రివ్యూలో మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యేలు
  •     కనీస వసతులు కల్పించాలని ప్రజల వేడుకోలు

హనుమకొండ, వెలుగు : గ్రేటర్‌‌ వరంగల్‌‌లో విలీనమైన గ్రామాల పరిస్థితి ప్రస్తుతం అధ్వానంగా మారింది. మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌గా ఉన్న వరంగల్‌‌లో చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలను విలీనం చేసి గ్రేటర్‌‌గా అప్‌‌గ్రేడ్‌‌ చేశారు. విలీనం అయిన తర్వాత ఆయా గ్రామాల్లో పన్నులు పెరిగాయే తప్ప అభివృద్ధి పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అసంపూర్తిగా ఉన్న డ్రైన్లు, సీసీ రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

42 గ్రామాల విలీనం

వరంగల్‌‌ నగరం 1844 నుంచే మున్సిపాలిటీగా ఉండగా 1959లో స్పెషల్‌‌ గ్రేడ్‌‌ మున్సిపాలిటీగా మారింది. ఆ తర్వాత 1960లో సెలక్షన్‌‌ గ్రేడ్‌‌ మున్సిపాలిటీగా, 1994లో మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌గా, 2015లో గ్రేటర్‌‌ వరంగల్‌‌ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌గా అప్‌‌గ్రేడ్‌‌ అయింది. నగరాన్ని గ్రేటర్‌‌గా అప్‌‌గ్రేడ్‌‌ చేసే టైంలో చుట్టుపక్కల ఉన్న 42 గ్రామాలను విలీనం చేశారు. ఇందులో వర్ధన్నపేట నియోజకవర్గంలో 30, పరకాలలో 10, స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌ నియోజకవర్గంలోని 2 గ్రామాలు ఉన్నాయి. అత్యధికంగా విలీన గ్రామాలు ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గంలో చాలా గ్రామాలకు రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

హసన్‌‌పర్తి మండలంలోని చాలా గ్రామాలకు రోడ్లే సక్రమంగా లేవు. కానీ అదే గ్రామాల్లో ప్రైవేట్‌‌ వ్యక్తుల వెంచర్లకు మాత్రం ప్రభుత్వ నిధులతో రోడ్లు వేశారు. గోపాలపురం జంక్షన్‌‌ నుంచి మడిపల్లి సిటీ వరకు జన, వాహన సంచారం లేని రూట్‌‌లో రూ.13 కోట్లతో రోడ్డువేయగా, అదే మార్గంలోని దేవన్నపేటకు మాత్రం గుంతల రోడ్డే దిక్కయింది. ఇక వడ్డేపల్లి ఫిల్టర్‌‌ బెడ్‌‌ నుంచి వెంచర్లు ఉన్న మార్గంలోని నిరూప్‌‌నగర్‌‌ తండా మీదుగా ఉనికిచర్ల వరకు రోడ్డేశారు. ఆ పక్కనే ఉన్న సుబ్బయ్యపల్లిని మాత్రం విస్మరించారు.

దీంతో వర్షాలు పడినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడా కనీసం పీహెచ్‌‌సీలు కూడా లేకపోవడంతో ఎమర్జెన్సీ టైంలో నగరానికి పరుగులు తీయాల్సి వస్తోంది. రివ్యూలు, గ్రేటర్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌లలో సమస్యలను ప్రస్తావించే లీడర్లు ఆ తర్వాత లైట్‌‌ తీసుకోవడం పరిపాటిగా మారింది. 

ఎలక్షన్లు వచ్చినప్పుడే శిలాఫలకాలు

విలీన గ్రామాల్లో రాంపూర్‌‌ -మడికొండ శివారులోని డంపింగ్‌‌ యార్డు సమస్య ప్రధానమైనది. డంప్‌‌ యార్డు నుంచి నిత్యం వచ్చే పొగతో రోగాల బారినపడుతున్నామని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంత చెబుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎన్నికల టైంలో మాత్రం అనేక హామీలు ఇస్తూ ఓట్లు వేయించుకుంటున్నారని పలువురు అంటున్నారు. గ్రేటర్‌‌ వరంగల్‌‌ పరిధిలోని విలీన గ్రామాలకు కాకతీయ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ నుంచి కూడా ఫండ్స్‌‌ కేటాయించాల్సి ఉంది. కానీ ఎలక్షన్ల సమయం వస్తే తప్ప ఏ గ్రామానికి కూడా నిధులు మంజూరు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

2021 ఏప్రిల్‌‌లో జరిగిన గ్రేటర్‌‌ ఎన్నికలతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ల వరకు విలీన గ్రామాల్లో పెద్దఎత్తున శిలాఫలకాలు వేశారు. కొన్ని చోట్ల పనులు స్టార్ట్‌‌ చేసి తర్వాత చేతులు దులుపుకున్నారు. చాలా చోట్ల రోడ్డు పనులు అర్థాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల డ్రైన్లు సరిగా లేకపోవడంతో మురుగు నీరంతా రోడ్డు మీదే పారుతోంది. 

మంత్రుల రివ్యూతో ఆశలు

ఉమ్మడి జిల్లాకు అవసరమైన పనులు, నిధుల కేటాయింపుపై ఇటీవల వరంగల్‌‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్‌‌ కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌‌ నాగరాజు ప్రధానంగా విలీన గ్రామాల సమస్యను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తగిన యాక్షన్‌‌ తీసుకోవాలని మంత్రులు ఆదేశించడంతో విలీన గ్రామాల అభివృద్ధిపై ఆశలు రేకెత్తుతున్నాయి. గ్రామాల్లో కనీసం పీహెచ్‌‌సీలు, డ్రైన్లు, రోడ్లు, శ్మశాన వాటికలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.