ఆరేళ్లయినా అభివృద్ధి పనులు కాలే

బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఆరేళ్ల కింద శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు నేటికీ పూర్తి కాలేవు.  పట్టణంలోని కన్నాల హైవే రోడ్డు, కన్నాల గ్రామ పంచాయతీ శివారులో రూ.9.68 కోట్లతో మంత్రి  కేటీఆర్ 160 డబుల్ బెడ్రూం ఇళ్ల  నిర్మాణ పనులకు 2017 జూన్ 10 న శంకుస్థాపన చేశారు. ఈ పనులు70 శాతం వరకు మాత్రమే జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల్లో ఇంకా ఎక్కడా డబుల్ బెడ్రూం ఇండ్లకు మోక్షం లభించకపోవడం పట్ల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  రూ.5 కోట్లతో 2017 జూన్ 10న మంత్రి ప్రారంభించిన కూరగాయల మార్కెట్ నేటికి పూర్తి కాలేదు. 2021లో పనులు  ప్రారంభమయ్యాయి. కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ పనులకు నిధులు కేటాయించినప్పటికీ గుత్తేదారుకు బిల్లులు చెల్లించక పోవడంతో మిగతా పనులు ముందుకు సాగడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీ లో  93 మంది సిబ్బందిని 250 కి పెంచాల్సి న అవసరం ఉంది.  

బెల్లంపల్లి పట్టణానికి 30 ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్ డిపో మంజూరైనా నేటికీ బస్సు డిపో  ఏర్పాటు కాలేదు.  సబ్ రిజిస్టార్  కార్యాలయం,  వ్యవసాయ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, ఏకలవ్య మోడల్ స్కూల్,  ట్రైబల్ వెల్ఫేర్ హై స్కూల్, డిప్యూటీ డీఈఓ కార్యాలయం ఏర్పాటు చేయలేదు.  డీఎల్పీవో కార్యాలయం ఏర్పాటైనా సిబ్బందిని నియమించలేదు.  ఎంవీఐ కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. బెల్లంపల్లి ఎల్లంపల్లి రక్షిత మంచినీటి పథకం రూ.18 కోట్లు పెట్టి నిర్మించినా దీన్ని అర్థంతరంగా బంద్​ చేశారు.  మంత్రి హరీశ్​ రావు ప్రారంభించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి నేడు రెఫరల్ ఆసుపత్రిగా కొనసాగుతోంది.  సిటీ స్కానింగ్, ఎమ్మారై స్కానింగ్ మిషన్ లు ఏర్పాటు చేయాలనే డిమాండ్​ కొనసాగుతోంది.  73 ఎకరాల్లో విస్తరించి ఉన్న బెల్లంపల్లి ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను పూర్తి స్థాయిలో కొనసాగిస్తూ ఇక్కడ  ఏఆర్ డీసీపీని నియమించి  కమిషనరేట్  పోలీస్ ట్రైనింగ్ కళాశాల ఏర్పాటు చేయాల్సి ఉంది.  

సోషల్ వెల్ఫేర్ బాలుర  ఈ కళాశాలలో బాలుర సీఓఈ డిగ్రీ కళాశాల, ఇక్కడ డివిజనల్  సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ అధికారుల కార్యాలయాలు, బాలికల  మైనారిటీ  వెల్ఫేర్, మహాత్మా జ్యోతి బాపూలే బాలికల, గిరిజన ఆశ్రమ పాఠశాలలు అనేక సంవత్సరాలుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.  వాటికి సొంత భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.  వేమనపల్లి, భీమిని, నెన్నెల, కన్నెపల్లి,తాండూర్ మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల సమస్యలను మంత్రి కేటీఆర్ పరిష్కరించాలని ప్రజలు 
కోరుతున్నారు.