మహారాష్ట్రలో తడబడినా పట్టు జారలే

మహారాష్ట్రలో తడబడినా పట్టు జారలే

మహారాష్ట్రలో మళ్లీ తామే పవర్​లోకి వస్తామని, తిరిగి తానే సీఎం అవుతానని, ఇందులో ఎవరికీ ఎలాంటి డౌట్లూ అక్కర్లేదని దేవేంద్ర ఫడ్నవిస్​ కొద్ది రోజులుగా అంటున్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్ర శాసన సభలో బీజేపీ–శివసేన​ కంప్లీట్​గా కంఫర్టబుల్​ జోన్​లో నిలిచాయి. గవర్నమెంట్​ని ఏర్పాటుచేయటానికి కావాల్సిన మేజిక్​ ఫిగర్​ (145) కన్నా 14 స్థానాలను ఎక్కువే దక్కించుకుంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలన్నింటికీ సంతృప్తి మిగిల్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే అంతా ఊహించినట్లే బీజేపీ–శివసేన అలయెన్స్​ అలవోకగా విజయం సాధించింది. పోయినసారి ఎన్నికలతో పోల్చితే ఆ కూటమికి ఈసారి మెజారిటీ కాస్త (27 స్థానాలు) తగ్గినా అధికారాన్ని నిలబెట్టుకోవటం ఆనందం కలిగించే అంశమే. మరోవైపు ఈ ఎన్నికల్లో జట్టు కట్టడం రెండు కాంగ్రెస్​లకు (ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్–ఐఎన్​సీ​, నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ‌‌–ఎన్సీపీ) కలిసొచ్చింది.

2014లో కాంగ్రెస్​, ఎన్సీపీ విడివిడిగా పోటీ చేసి 83 చోట్లే నెగ్గగా ఈసారి కలిసి బరిలో నిలిచి 98 సెగ్మెంట్లను కైవసం చేసుకున్నాయి. క్రితంసారి ఎన్నికల్లో చేయి పార్టీ 287 నియోజకవర్గాల్లో రంగంలోకి దిగి 42 మందినే గెలిపించుకోగలిగింది. ఇప్పుడు 145 ప్రాంతాల్లోనే పోరాడి 45 సీట్లను ఖాతాలో వేసుకుంది. దాని మిత్రపక్షం ఎన్సీపీదీ ఇదే పరిస్థితి. కిందటిసారి 278 సెగ్మెంట్లలో పోటీ చేసి 42 చోట్లే సక్సెస్​ సాధించగా ప్రస్తుతం 123 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలిపి అదనంగా 12 ఏరియాల్లో విజయం సొంతం చేసుకుంది.

బీజేపీ బలం ఎందుకు తగ్గింది?

గత శాసన సభ ఎన్నికలను శివసేనతో స్నేహం లేకుండా ఒంటరిగా ఎదుర్కొన్న బీజేపీ మంచి ఫలితాలు రాబట్టింది. 260 సీట్లకు గురిపెట్టి 122 చోట్ల పైచేయి సాధించింది. లేటెస్ట్​ ఎలక్షన్​లో 164 స్థానాల్లో క్యాండిడేట్లను మోహరించి వంద చిల్లర సెగ్మెంట్లను హస్తగతం చేసుకోగలిగింది. ఐదేళ్లు పవర్​లో ఉండీ 19 సిట్టింగ్​ ఎమ్మెల్యేలను కోల్పోయింది. శివసేనతో దోస్తీ వల్ల అధికారం నిలబెట్టుకోవటం మినహా బీజేపీకి ప్రయోజనం దక్కలేదు. ఆ పార్టీ నష్టపోయిన సెగ్మెంట్లలో ఎన్సీపీ, కాంగ్రెస్ లాభపడ్డాయి.

అనుకోని సమస్యలు

పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటంతో రైతులు అధికార పార్టీకి దూరమయ్యారంటున్నారు ఎనలిస్టులు. సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన యువతకు సరైన అవకాశాలు దక్కకపోవటం మైనస్​ అయింది. ఎన్సీపీ చీఫ్​ శరద్ ​పవార్​పై ఎలక్షన్​కి ముందు ఈడీ కేసులు పెట్టడాన్ని ఓటర్లు రాజకీయ కక్షసాధింపుగా భావించారు. ఎన్నికల్లో గెలుపు కోసమే వేరే పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చినవారికి టికెట్లు ఇవ్వటాన్ని జనం స్వాగతించలేదు. ప్రచారంలో స్థానిక సమస్యల కన్నా జాతీయ అంశాలనే ప్రస్తావించటం నెగెటివ్​ ప్రభావం చూపిందన్నారు విశ్లేషకులు.

ఫడ్నవిస్​ ప్రభుత్వ విధానాలను భాగస్వామ్యపక్షమే(శివసేన) పలుమార్లు వ్యతిరేకించటంతో న్యూట్రల్​గా ఉండే పబ్లిక్​ ఓట్లు అధికార కూటమికి పడలేదు. రీసెంట్​గా ఆరే కాలనీలో మెట్రో డిపో నిర్మాణం కోసం చెట్లు కొట్టేయటాన్ని శివసేన వ్యతిరేకించటం దీనికో ఉదాహరణ. పంజాబ్​ అండ్​ మహారాష్ట్ర కోపరేటివ్​ బ్యాంక్​.. ఖాతాదారులకు టోపీ పెట్టడం సర్కార్​కి ఇబ్బందికరంగా మారిందన్నారు ఎనలిస్టులు.

ఫస్ట్​ టైమ్​ ఠాక్రే ఫ్యామిలీ ఎమ్మెల్యే

మహారాష్ట్ర అసెంబ్లీలో వర్లి  సీటు నుంచి గెలిచిన యూత్​ లీడర్​ ఆదిత్య ఠాక్రేపై అందరి దృష్టీ పడింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ కొడుకు ఆదిత్య ఠాక్రే. బాల్​ ఠాక్రే ఫ్యామిలీ నుంచి మూడో తరానికి చెందినవాడు. గతంలో బాల్​, ఉద్దవ్​లు ఎన్నికల్లో ఎన్నడూ పోటీ చేయలేదు. పార్టీని, మహారాష్ట్ర పాలిటిక్స్​ని శాసించిన ఠాక్రే ఫ్యామిలీ నుంచి ఆదిత్య ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచారు.  ప్రస్తుతం బీజేపీతో బేరమాడే స్థాయికి శివసేన వెళ్లింది. ఒప్పందం ఓకే అయితే, ఆదిత్య ఠాక్రే పేరునే ఉద్దవ్​ ప్రతిపాదిస్తారని ఎనలిస్టులు చెబుతున్నారు.

 

 

బారామతిలో వరుసగా  ఏడోసారి అజిత్

నేషనలిస్టు కాంగ్రెస్​ పార్టీ తమకు కంచుకోటయిన బారామతి అసెంబ్లీ సెగ్మెంట్​ని మరోసారి నిలుపుకుంది. పుణే జిల్లాలోని ఈ సీటుని వరుసగా ఏడోసారి అజిత్​ పవార్​ దక్కించుకున్నారు. గతంలో  ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 1991లో ఆయన కేంద్ర కేబినెట్​కి వెళ్లడంతో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి పవార్​ అన్న కొడుకైన అజిత్​ గెలిచారు. అక్కడి నుంచి వరుసగా అజిత్​ గెలుస్తూ వస్తున్నారు.