- ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణం
- డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్
- హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, వివిధ రాష్ట్రాల సీఎంలు
- పట్టువీడి కేబినెట్లో చేరిన ఏక్నాథ్ షిండే
ముంబై: మహారాష్ట్రలో మహాయుతి 2.0 సర్కార్ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా శివసేన చీఫ్ ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ప్రమాణం చేశారు. వీళ్లతో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. గురువారం సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దాదాపు 40 వేల మంది కార్యకర్తలు హాజరయ్యారు. మరో 2 వేల మంది రాజకీయ, వ్యాపార, సినీ రంగాల ప్రముఖులు తరలివచ్చారు.
4 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రులుగా ఎవరూ ప్రమాణస్వీకారం చేయలేదు. వచ్చే వారం కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలిసింది. కాగా, సీఎం పదవిపై మొదటి నుంచీ పట్టుబట్టిన ఏక్ నాథ్ షిండే చివరకు దిగొచ్చారు. సీఎంగా ఫడ్నవీస్ కు మద్దతు ఇస్తున్నానని బుధవారమే ప్రకటించారు. కానీ ఆయన కేబినెట్ లో చేరతారా? లేదా? అనేది మాత్రం వెల్లడించలేదు. గురువారం మధ్యాహ్నం వరకు ఆ సస్పెన్స్ కొనసాగింది. డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణం చేయనున్నారని శివసేన లీడర్ ఉదయ్ సామంత్ చెప్పడంతో ఉత్కంఠకు తెరపడింది. ‘‘డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు షిండే సుముఖంగా లేరు. కానీ కేబినెట్ లో చేరాలని ఫడ్నవీస్, శివసేన క్యాడర్ కోరడంతో.. చివరకు ఆయన ఒప్పుకున్నారు” అని పేర్కొన్నారు.
తరలివచ్చిన ప్రముఖులు..
ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, నితీశ్ కుమార్, చంద్రబాబునాయుడు, పుష్కర్ సింగ్ ధామి, నయాబ్ సింగ్ సైనీ, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, సంజయ్ దత్, వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తదితరులు హాజరయ్యారు.
9న స్పీకర్ ఎన్నిక
ప్రమాణ స్వీకారం తర్వాత ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ సచివాలయానికి వెళ్లి బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, 9న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని ఈ సందర్భంగా ఫడ్నవీస్ వెల్లడించారు.