బుల్డోజర్లు కదంతొక్కుతాయి: దేవేంద్ర ఫడ్నవీస్​

బుల్డోజర్లు కదంతొక్కుతాయి: దేవేంద్ర ఫడ్నవీస్​
  • నాగ్​పూర్ అల్లర్లపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​
  • అల్లరిమూకల నుంచి నష్టపరిహారం వసూలు చేస్తామని వెల్లడి

నాగ్​పూర్: అవసరమైతే బుల్​డోజర్లు కదంతొక్కుతాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. నాగ్​పూర్​లో అల్లర్లకు కారణమైన వారి నుంచే దెబ్బతిన్న ఆస్తుల నష్టాన్ని వసూలు చేస్తామని తెలిపారు. శనివారం నాగ్​పూర్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిటీలో పరిస్థితి ఇప్పుడు ప్రశాంతంగా ఉందని, కొన్ని ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను సడలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫడ్నవీస్ అన్నారు. 

సిటీలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అల్లర్లు చెలరేగాయి 80 శాతం సిటీలో ఎటువంటి ప్రభావం చూపలేదని తెలిపారు. నగరంలో పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్నాయని కొన్ని ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను సడలించనున్నట్టు చెప్పారు. అల్లర్ల సమయంలో పోలీసు అధికారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫడ్నవీస్ అన్నారు. మార్చి 17న చోటుచేసుకున్న ఘటనను ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పలేమన్నారు. 

అయితే ఇంటెలిజెన్స్ మరింత మెరుగ్గా పనిచేయాల్సిందని అన్నారు. ఈ ఘర్షణల వెనక బంగ్లాదేశ్, ఇతర దేశాల లింకులు ఉన్నాయని ఇప్పుడే చెప్పలేమన్నారు.  సీసీ కెమెరాల ఫుటేజీలు, వీడియో రికార్డింగులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో అల్లర్లకు పాల్పడిన 104 మందిని గుర్తించామని ఇందులో 12 మంది మైనర్లు కూడా ఉన్నారని చెప్పారు. నిందితులందరిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని వెల్లడించారు. పరిస్థితిని రెచ్చగొట్టిన 68 పోస్టులను గుర్తించి తొలగించినట్టు చెప్పారు.

ఎవ్వరినీ వదిలిపెట్టబోమని వెల్లడి

నాగ్​పూర్​లో హింసకు పాల్పడిన వారిపై యూపీ తరహా చర్యలు తీసుకుంటారా అని కొందరు జర్నలిస్టులు అడగ్గా.. అవసరమైతే మహారాష్ట్రలో కూడా బుల్డోజర్లు కదం తొక్కుతాయని ఫడ్నవీస్ చెప్పారు.  ఎక్కడైనా తప్పు జరిగితే అందుకు కారణమైన వారిని కచ్చితంగా శిక్షిస్తామని.. నేరస్థులు ఎవరైనా సరే వదిలిపెట్టబోమని హెచ్చరించారు.