నిజామాబాద్, వెలుగు: పారా బాయిల్డ్ రైస్ వాడకానికి ఎక్కువ డిమాండ్ ఉందని, బ్రేక్ లేకుండా మిల్లింగ్చెయ్యాలని సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవేంద్రసింగ్ చౌహాన్ ఆదేశించారు. తెలంగాణతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు జిల్లా బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. ఇందూరు మిల్లర్లకు మంచి పేరుందని, దానిని నిలబెట్టుకోవాలన్నారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్లో మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
సెంట్రల్ గవర్నమెంట్ ను ఒప్పించి 2018-–19 నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.900 కోట్ల ట్రాన్స్‌పోర్టు బిల్స్‌ను మంజూరు చేయించడంతో మిల్లర్లకు మేలు జరిగిందన్నారు. హ్యాండ్లింగ్ ఛార్జెస్ రెండు నెలల్లో ఇప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి మిల్లర్ల సమస్యలుంటే పరిష్కరిస్తామని సీఎంఆర్ టార్గెట్ రీచ్ అయ్యేలా కృషి చేయాలన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.69 మెట్రిక్ టన్నుల యాసంగి సీజన్ వడ్లు కొనుగోలు చేశామని చౌహాన్ వెల్లడించారు. గతేడాది 2.33 టన్నులు మాత్రమే కొన్నామన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ జిల్లాలో 1.35 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసి, రూ.98 కోట్ల బిల్లులు రైతుల ఖాతాల్లో జమచేశామని తెలిపారు. 90 లక్షల గన్నీ బ్యాగులు రెడీగా పెట్టామన్నారు. డీఎస్వో చంద్రప్రకాశ్, డీఎం జగదీశ్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి తదితరులున్నారు.
కొనుగోలు కేంద్రాలు విజిట్..
ఇందల్వాయి మండలంలోని గన్నారం, చంద్రయాన్‌పల్లి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను దేవేంద్రసింగ్ చౌహాన్ విజిట్ చేశారు. వడ్ల తేమను స్వయంగా పరిశీలించారు. బిల్స్ చెల్లింపు వివరాలను పల్లా సందీప్, మల్లయ్య, సాయిలు అనే రైతులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. గుండారంలోని గణేశ్ రైస్ మిల్లుకు వెళ్లి స్టాక్ వివరాలు పరిశీలించారు. ఆయన వెంట సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ ఉన్నారు.
వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి
కామారెడ్డి: వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలని స్టేట్ సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ దేవేంద్రసింగ్ చౌహాన్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఉగ్రవాయిలో వడ్ల కొనుగోలు సెంటర్‌ను ఆయన పరిశీలించారు. రైతులు, ఆఫీసర్లతో మాట్లాడారు. తేమశాతం, ఐరిస్ సిస్టం, ట్యాబ్ ఎంట్రీ సిస్టమ్‌ను ఆయన పరిశీలించారు. రూల్ ప్రకారం తేమ శాతం 17 ఉండేలా చూసుకోవాలన్నారు.
రైతులకు ఇబ్బందులు కలగుకుండా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. కాంటా వేసిన వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలన్నారు. అనంతరం రాఘవేంద్ర రైస్‌మిల్లును పరిశీలించారు. మిల్లింగ్ వివరాలను తెలుసుకున్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, డీఎస్వో మల్లికార్జున బాబు, డీఎం నిత్యానంద్ ఉన్నారు. అంతకుముందు కలెక్టరేట్లో జిల్లా ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి పలు అంశాలను రివ్యూ చేశారు.