వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయంలో ఈ నెల 15 నుంచి శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9 రోజులపాటు జరిగే వేడుకల్లో రాజరాజేశ్వరీ దేవీ భక్తులకు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వనున్నారు. 15న ఉదయం స్వస్తి పుణ్యాహవచనం, అఖండ దీప స్థాపన, కలశస్థాపన గాయత్రి ప్రతిష్టను అర్చకులు నిర్వహించి 12 మంది బ్రహ్మచారులతో గాయత్రి జపం ఐదుగురు రుత్వికులతో గాయత్రి హవనం గావిస్తారు.
23న మహార్నవమి, విజయదశమి సందర్భంగా ఉదయం 11-.05 గంటలకు ఆయుధపూజ, పూర్ణాహుతి, బలిహరణం ఉంటాయి. సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి పెద్దసేవ (అంబారీ సేవ), స్వామివారి అమ్మ వార్ల శమీయాత్ర, అపరాజిత పూజ నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు రాత్రి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి, పార్వతి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారల ఉత్సవ మూర్తుల తో పట్టణంలో పెద్ద సేవ ఊరేగింపు నిర్వహించనున్నారు.