కాశీబుగ్గ/ ఖిలా వరంగల్ (కరీమాబాద్), వెలుగు: భద్రకాళి దేవస్థానంలో దేవిశరన్నవరాత్రులు విజయ దశమి తెప్పోత్సవంతో ముగిశాయి. ఈ వేడుకలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారదాదేవి, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి హాజరయ్యారు.
ఈ తెప్పోత్సవం ఉభయదాతలు గాయత్రీ గ్రానెట్స్ అధినేతలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత, వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. రాత్రివేళ విద్యుత్ దీపాలంకరణలో అలరారుతున్న వాతావరణంలో హంస వాహనంలో వేలాది మంది భక్త జన సందోహం మధ్యన జరిగిన తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ లోని ప్రముఖ క్షేత్రాలను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమద్గిరి పద్మాక్షి దేవాలయం, ఆటోనగర్ శ్రీనివాస కాలనీ శృంగేరి శంకర మఠం శారదా దేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.