భద్రాచలం/ములకలపల్లి/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో లక్ష్మీతాయారు అమ్మవారు ఆదివారం వీరలక్ష్మిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆదివారం ఉదయం గర్భగుడిలోని శ్రీసీతారామచంద్రస్వామి మూలవరులకు పంచామృతాలతో అర్చకులు అభిషేకం చేశారు. బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారికి తిరుమంజనం నిర్వహించి ఉత్సవమూర్తిని వీరలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
సామూహిక లక్ష కుంకుమార్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన జరిపి విష్ణుసహస్ర నామ పారాయణం చేశారు. బేడా మండపంలో సీతారాముల నిత్య కల్యాణం జరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం రాములోరికి దర్బారు సేవ నిర్వహించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా మంగుంటకు చెందిన నాగభూషణమ్మ శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. ములకలపల్లిలోని శ్రీఉమా పృధ్వి రామలింగేశ్వరస్వామి ఆలయంలోని అమ్మవారు ఆదివారం దుర్గాదేవిగా భక్తులకు దర్శనమించారు. కొత్తగూడెం గణేశ్ టెంపుల్లోని స్వర్ణదుర్గ మాత అమ్మవారు ఆదివారం మహిశాసురమర్దినిగా భక్తులకు దర్శనమించారు. రాత్రి మహంకాళిగా దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.