NZC: ఫ్రాంచైజీ క్రికెట్ వైపే మొగ్గు.. సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దనుకున్న న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లు

NZC: ఫ్రాంచైజీ క్రికెట్ వైపే మొగ్గు.. సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దనుకున్న న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లు

న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లు తమ జట్టు తరపున క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికే కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 2024-25 కాలానికి బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కూడా వదులుకొని ఆ జట్టుకు షాక్ ఇవ్వగా.. తాజాగా ఆ లిస్ట్ లో ఇద్దరు ప్లేయర్లు చేరారు. స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే, ఎమర్జింగ్ వైట్-బాల్ బ్యాటర్ ఫిన్ అలెన్ తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించారు. కాన్వే సాధారణ కాంట్రాక్టు ఎంచుకున్నాడు. మరోవైపు అలెన్ తన సెంట్రల్ వద్దనుకున్నారు.   

అలెన్ ను పక్కన పెడితే కాన్వే లాంటి స్టార్ ఆటగాడు అన్ని మ్యాచ్ లకు అందుబాటులోకి లేకపోవడం ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. దక్షిణాఫ్రికా ప్రీమియర్ లీగ్ ఆడేందుకు కాన్వే సాధారణ ఒప్పందాన్ని ఎందుకున్నట్టు తెలుస్తుంది. సౌతాఫ్రికా 2025 ప్రీమియర్ లీగ్ లో కాన్వే జోబర్గ్ సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. సెప్టెంబర్ లో జరగబోయే ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ తో పాటు శ్రీలంకలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం కాన్వే ఎంపికయ్యాడు. అయితే అక్టోబర్ లో భారత్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతని ఎంపిక అనుమానంగా మారింది. 

కాన్వే తీసుకున్న నిర్ణయాన్ని న్యూజిలాండ్ క్రికెట్‌ గౌరవించి అతనికి మద్దతుగా నిలిచింది. దీంతో ఈ కివీస్ ఓపెనర్ న్యూజిలాండ్ క్రికెట్‌కు తన కృతజ్ఞతలు తెలిపాడు. సెంట్రల్ ప్లేయింగ్ కాంట్రాక్ట్ నుండి వైదొలగాలనే నిర్ణయం నేను తేలికగా తీసుకున్నది కాదని..   కానీ ప్రస్తుత సమయంలో నేను నా కుటుంబంతో గడపడం చాలా ముఖ్యమని కాన్వే చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ.. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లోని కీలక మ్యాచ్ లకు కాన్వే అందుబాటులో ఉంటాడు.