డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ బొటన వేలికి ఫ్రాక్చర్ కావడంతో న్యూజిలాండ్ ఆటగాడు, సీఎస్‌కే ఓపెనర్ డెవాన్ కాన్వే సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యం గురువారం(ఏప్రిల్ 18) అధికారికంగా ప్రకటించింది. అతని స్థానంలో ఇంగ్లండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌ను భర్తీ చేసింది. రూ.50 లక్షల కనీస ధరకు అతన్ని సొంతం చేసుకుంది.
కాన్వే దూరమవ్వడం చెన్నైకి భారీ లోటు.. గతేడాది సీఎస్‌కే టైటిల్ గెలవడంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కీలక పాత్ర పోషించాడు. 2022 ఎడిషన్‌లో చెన్నై తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన కాన్వే.. ఆ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 42 సగటు, 145.66 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. 672 పరుగులతో శుభమాన్ గిల్ (890 పరుగు లు), ఫాఫ్ డుప్లెసిస్ (730 పరుగులు)ల తర్వాత స్థానంలో నిలిచాడు.
ఎవరీ రిచర్డ్ గ్లీసన్..?
ఇక గ్లీసన్ విషయానికొస్తే.. ఇతను ఇంగ్లాండ్ రైట్ ఆర్మ్ మీడియం పేసర్. 36 ఏళ్ల గ్లీసన్ ఇంగ్లాండ్ తరపున 6 టీ20 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఇతనికి అంతర్జాతీయ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, గ్లీసన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో రంగ్‌పూర్ రైడర్స్, బిగ్ బాష్ లీగ్ (BBL)లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL)లో పెషావర్ జల్మీ వంటి జట్లు తరపున ఆడి పొట్టి ఫార్మాట్‌లో అనుభవం బాగా గడించాడు.
Welcoming with a glee!🤩🥳
— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2024
Whistle Vanakkam, Richard! 🦁💛
🔗 - https://t.co/7XCuEZCm21 #WhistlePodu #Yellove pic.twitter.com/rJa1HilaQ6
మూడో స్థానంలో చెన్నై
కాగా, ఎప్పటిలానే ప్రస్తుత సీజన్‌లో చెన్నై మంచి ప్రదర్శన కనబరుస్తోంది. 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ధోని నుంచి సారథ్య బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పర్వాలేదనిపిస్తున్నాడు. సీఎస్‌కే తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. వీరింకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. అందులో నాలుగింట విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవచ్చు.