వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళ తన కుటుంబంతో కలిసి 2023 జూన్ 05 సోమవారం రోజున రాజన్న ఆలయానికి వచ్చింది, అయితే సోమవారం ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దర్శనం చేసుకోవటం కుదరలేదు. దీంతో మరుసటి రోజు స్వామివారిని దర్శించుకోవచ్చునని ఆలయంలోనే నిద్రించింది.
Also Read:మద్యానికి బానిసై ఫ్లైఓవర్ పైనుంచి దూకిండు
మరుసటి రోజు అంటే జూన్ 06 మంగళవారం రోజున దర్శనం కోసం కుటుంబంతో కలిసి బయల్దేరింది లక్ష్మి . క్యూ లైన్‌లో నిలుచున్న లక్ష్మి ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెకు ఏం అయిందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆలయ సిబ్బంది, వైద్యులు వచ్చి పరిశీలించి ఆమె మృతి చెందినట్లుగా వెల్లడించారు.
మరోవైపు కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన కిష్టయ్య(70) కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం అంజన్న దర్శనానికి వచ్చాడు. కోనేరులో స్నానం చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చింది. కొద్దిసేపటికే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు డెడ్ బాడీని వాహనంలో ఆయన స్వగ్రామానికి తరలించారు.