
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధికి ఆదివారం భక్తుల తాకిడి పెరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మల్లికార్జున స్వామికి పట్నాలు వేసి బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మతో కొలువైన మల్లన్నను దర్శించుకున్నారు. రద్దీ కారణంగా స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో ఉండాల్సి వచ్చిందని భక్తులు తెలిపారు.
స్వామివారి దర్శనం అనంతరం మల్లన్న కొండపై కొలువైన ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈవో స్వామివారి ఫొటో, ప్రసాదం అందజేశారు. కాగా కొమురవెల్లిలో కాటేజీల నిర్మాణానికి హైదరాబాద్‌లోని రాజేందర్‌నగర్‌కు చెందిన వినోద్‌కుమార్, స్వాతి దంపతులు రూ. 15 లక్షల విరాళాన్ని అందజేశారు.