
శ్రీశైలం, వెలుగు : కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. భ్రమరాంబ మల్లికార్జునకు సోమవారం ఇష్టమైన రోజు కావడంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలివెళ్లారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడ వీధుల్లో కార్తీక దీపాలు వెలిగించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది.
దీంతో ఆలయ అధికారులు కంపార్ట్మెంట్లలో వేచిఉన్న భక్తులకు ఉచితంగా పాలు, ప్రసాదాలు అందజేశారు. కార్తీక పౌర్ణమి కావడంతో ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం నిర్వహించి, పుష్కరిణికి హారతి ఇచ్చారు. ఆలయ ఈఓ పెద్దిరాజు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, భక్తులు భారీగా తరలిరావడంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.
శ్రీశైలం నుంచి హైదరాబాద్, డోర్నాలకు వెళ్లే ఘాట్ రోడ్డులోని నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ముఖద్వారం నుంచి శ్రీశైలానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది.