ఆశీలు పేరుతో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్రు .. భద్రాచలం పంచాయతీలో కాంట్రాక్టర్​ ఇష్టారాజ్యం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం గ్రామపంచాయతీలో శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులను ఆశీలు పేరుతో కాంట్రాక్టరు దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బినామీ కాంట్రాక్టరు అందినకాడికి దండుకుంటున్నా పంచాయతీ సిబ్బంది ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్​ ఆదేశాల ప్రకారం నాలుగు చక్రాల వాహనాలకు రూ.30, టూరిస్టు బస్సులు, ఏడు సీటర్ల వాహనాలకు రూ.150 వసూలు చేయాలని ఉంది.

కానీ బినామీ కాంట్రాక్టరు నాలుగు చక్రాల వాహనానికి రూ.150 వసూలు చేస్తున్నాడు.ఏజెన్సీ ఏరియాలో పంచాయతీల పరిధిలో టెండర్లను గిరిజనులే దాఖలు చేయాలనే నిబంధనలు ఉండడంతో బినామీలు దొడ్డిదారిన పాల్గొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్టున్నారు. పాల్వంచ ప్రాంతానికి చెందిన ఓ గిరిజనుడి పేరుతో ఓ వ్యాపారి భద్రాచలం పంచాయతీలో వాహనాల ఆశీలు వసూలు చేసే టెండరును పొందారు. పంచాయతీతో సంబంధం లేకుండా ఆయనే సొంతంగా బిల్లు పుస్తకాలు ముద్రించి భక్తుల వాహనాల నుంచి ఆశీలు తీసుకుంటున్నారు. 

భక్తుడి ఫిర్యాదు
 
గురువారం మధిరకు చెందిన ఓ భక్తుడు తన కారుకు రూ.150 వసూలు చేశారంటూ వాపోయారు. స్వయంగా ఆయనే పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ఆశీలు కాంట్రాక్టరుపై ఫిర్యాదు చేశారు. దీనితో కాంట్రాక్టరు బాదుడు బహిర్గతమైంది. ఈ విషయంలో పంచాయతీ తీరుపై దేవస్థానం ఈవో రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాలయం పరిసరాల్లో ఆశీలు వసూలు చేయొద్దని ఆదేశించారు. కానీ కాంట్రాక్టరు మాత్రం సూపర్​బజార్​ సెంటర్​, ధ్యానమందిరం వెళ్లే మార్గంలో, కోదండ రామాలయం పరిసరాల్లో, కరకట్ట కింద నాలుగు చోట్ల కిరాయి మనుషులను పెట్టి వాహనదారుల నుంచి ఆశీలు వసూలు చేయడం మాత్రం ఆగడం లేదు.

తీరుమారట్లేదు

ఆశీలు కాంట్రాక్టరుపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. వారు ముద్రించిన బిల్లు పుస్తకాలు రెండు సార్లు స్వాధీనం చేసుకున్నాం. అయినా కాంట్రాక్టర్​ తీరు మారట్లేదు. గురువారం కూడా ఒక భక్తుడు కంప్లైంట్ చేశాడు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. 

వంశీ, పంచాయతీ జూనియర్​ అసిస్టెంట్, భద్రాచలం