- ఇప్పటికే 10 లక్షల మందికి పైగా రాక
- గద్దెల వద్ద గ్రిల్స్‌కు తాళాలు వేస్తున్న అధికారులు
- దూరం నుంచే మొక్కుకుంటున్న భక్తులు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మేడారం మహాజాతరకు ఇంకా సమయముంది. ఫిబ్రవరి 5న మాఘశుద్ధ పౌర్ణమి రోజు సారలమ్మ రాకతో జాతర ప్రారంభమవుతుంది. అయినా ఇప్పటికే లక్షలాది భక్తజనం మేడారం చేరుకొని ముందస్తు మొక్కులు సమర్పిస్తున్నారు. పిల్లలకు తలనీలాలు సమర్పిస్తున్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నట్లుగా దేవాదాయ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే 10 లక్షల మందికి మించి భక్తులు మొక్కులు సమర్పించినట్లుగా చెబుతున్నారు. మేడారంలో ప్రతిరోజు తెల్లవారేసరికే భక్తులతో గద్దెలన్నీ నిండిపోతున్నాయి. ఉదయం 6, 7 గంటల వరకే వేలాది మంది భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం గుడి వద్ద ఎదురుచూస్తున్నారు. క్యూలైన్లు కూడా బాగా దూరం పెరిగిపోతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత గంట, రెండు గంటల సేపు క్యూలైన్లలో నిల్చుంటే తప్ప అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకోవడానికి వీలవడం లేదు. మరోవైపు మహాజాతర నేపథ్యంలో చేపట్టిన మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలు, జంపన్నవాగులో ఇసుక లెవెలింగ్, షెడ్ల నిర్మాణాలు, వాటర్ ట్యాంక్‌ల పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
కన్నెపల్లి క్రాస్ వద్దనే ఆపుతున్నరు
మహాజాతర సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న వాళ్లంతా సమయం చూసుకొని మేడారం బాట పడుతున్నారు. ప్రత్యేక వాహనాలలో ఉదయం 6, 7 గంటల వరకే మేడారం చేరుకుంటున్నప్పటికీ పోలీసులు మాత్రం కన్నెపల్లి క్రాస్ వద్దనే వాహనాలను ఆపేస్తున్నారు. దీంతో భక్తులంతా అక్కడి నుంచి 2 కి.మీ. దూరానికి పైగా నడుచుకుంటూ గద్దెల వద్దకు చేరుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకతీయ హరిత హోటల్‌కు సమీపంలో పంట పొలాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. రోడ్డు సౌకర్యం కూడా ఉంది. పంటపొలాలు కూడా ఖాళీగానే ఉన్నాయి. రోజుకు 3 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినా వాహనాల పార్కింగ్‌కు సమస్య ఉండదు. అయినా పోలీసులు కన్నెపల్లి వద్దనే వాహనాలను ఆపివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దూరం నుంచి మొక్కాల్సిందే..
భక్తుల రద్దీ పెరగడంతో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు ఎవరూ రాకుండా గ్రిల్స్‌కు తాళాలు వేసి పెడుతున్నారు. మహాజాతర సమయంలో గద్దెల వద్దకు వెళ్లడం చాలా కష్టమని భావించి ముందుగా వస్తుంటే వారిని దేవాదాయ శాఖాధికారులు అడ్డుకోవడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహాజాతరకు 12 రోజులకంటే ముందే వచ్చినా గద్దెల దగ్గరికి పోనివ్వడం లేదని మండిపడుతున్నారు. మరోవైపు మేడారం గద్దెల చుట్టూరా ఉన్న మూడు ప్రధాన ద్వారాల ఎదురుగా రోడ్లపై తోపుడు బండ్లను పెడుతున్నారు. దీంతో భక్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.