- తొమ్మిది రోజులుగా కోనేటి నీళ్లను మార్చలే
- అవే నీటితో లక్ష మందికిపైగా భక్తుల స్నానం
- మురికి, దుర్వాసనతో ఇబ్బందులు
- టెంపుల్ ఆఫీసర్ల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు-
కొండగట్టు, వెలుగు:ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయంలో పాత కోనేటిని మూసి, కొత్త కోనేరు అందుబాటులోకి తెచ్చినా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నెల 14న హనుమాన్ జయంతి సందర్భంగా కోనేటిని నింపిన ఆఫీసర్లు, సుమారు తొమ్మిది రోజులుగా ఆ నీటిని మార్చడంలేదు. దీంతో మురికి, కంపుకొడుతున్న నీటితో భక్తులు అవస్థలు పడ్తున్నారు. ఏటా కోట్ల ఆదాయం వస్తున్నా కనీసం కోనేటిలో రోజుకోసారి నీళ్లను మార్చడం లేదు. కోనేటిని మిషన్ భగీరథ లైన్‌తో కనెక్ట్ చేసినప్పటికీ పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు.
కొత్త కోనేరు నిర్మించినా..
కొండగట్టులో పాత కోనేరుకు సరైన నీటి వసతి లేక ఎప్పుడూ మురికినీటితో కనిపించేది. తెలంగాణ వచ్చాక కొండగట్టు రూపురేఖలు మారుస్తామని, సీఎం కేసీఆర్, నాటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత, లోకల్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హామీ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పటికీ దానిని అమలుచేయకుండా పక్కనపెట్టారు. కేవలం కొత్త కోనేరు నిర్మించినా, ఇప్పటివరకు శాశ్వత నీటి వసతి కల్పించలేకపోయారు. 2019లో కొత్త కోనేరు ఓపెన్ అయింది. ఆ ఏడాదే పాతకోనేరును మూసేశారు. కోనేరు నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం వరద కాలువ నుంచి రూ.13 కోట్లతో లిఫ్ట్, పైపులైన్ నిర్మించాలని భావించారు. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంతో గుట్ట కింది నుంచి వెళ్లే ఎస్వీసీ(సిరిసిల్ల– వేములవాడ– చొప్పదండి) గ్రిడ్‌కు కనెక్షన్ ఇచ్చారు. కానీ ప్రెజర్ సరిపోకపోవడంతో గుట్టపైకి నీళ్లు ఎక్కడం లేదని టెంపుల్ ఆఫీసర్లు అంటున్నారు. కానీ ఆలయ అధికారులు అడిగితే తప్ప తాము సప్లై చేయలేమని మిషన్‌భగీరథ ఆఫీసర్లు చెప్తున్నారు. చివరిసారిగా టెంపుల్ అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 14న హనుమాన్ జయంతి రోజు నీటిని రిలీజ్ చేశామని, ఆ తర్వాత మళ్లీ అడగలేదని చెప్తున్నారు. దీనిని బట్టి భక్తుల పట్ల అంజన్న గుడి ఆఫీసర్లకు ఎంత నిర్లక్ష్యం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
వేలాదిమంది భక్తుల రాక..
హనుమాన్ జయంతి రోజున 50వేల మందికి పైగా భక్తులు కొండగట్టు వచ్చి స్నానాలు ఆచరించారు. ఆ తర్వాత తొమ్మిది రోజుల్లో మరో 50వేల మందికి పైగా అంజన్నను దర్శించుకుని అవే నీళ్లలో పుణ్యస్నానాలు చేశారు. మొత్తం మీద లక్ష మందికి పైగా భక్తులు స్నానాలు చేసినా ఆ నీళ్లు మార్చలేదు. దీంతో నీళ్లన్నీ మురికిగా మారి, కంపుకొడ్తున్నాయి. నీళ్లు పాకురు కూడా పట్టడంతో ఇంకో రెండు మూడు రోజులు ఉంటే చర్మవ్యాధులు సోకే ప్రమాదం లేకపోలేదు. నెలనెలా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కనీసం కోనేటిలో శుభ్రమైన నీటిని నింపేందుకు చర్యలు తీసుకోకపోండంపై అంజన్న భక్తులు మండిపడ్తున్నారు. రెండు రోజుల క్రితం గాలివానకు కూలిపోయిన చలువపందిళ్లను తొలగించకుండా అలాగే వదిలేశారని, భక్తులపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
గుడి ఆఫీసర్లు అడిగితే సప్లై చేస్తం..
కొండగట్టు గుడి అధికారులు ఎప్పుడు కోరినా కోనేటికి నీళ్లను సప్లై చెయ్యడానికి రెడీగా ఉన్నం. సరఫరా చేసిన నీటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిల్లులు చెల్లిస్తున్నారు. చివరి సారిగా హనుమాన్ పెద్ద జయంతి కోసం వాటర్సప్లై చేశాం.
- హరి, ఏఈ, మిషన్ భగీరథ
వీఐపీలు వస్తేనే కొనేరులో నీళ్లు
సీఎం, మంత్రులు వచ్చినప్పుడే కోనేరును శుభ్రం చేసి నీళ్లు నింపుతున్నారు. ఆ నీళ్లను నెలల తరబడి మార్చడం లేదు. భక్తుల నుంచి కోట్లకు కోట్లు వస్తున్నా కనీసం కోనేటిలో నీళ్లను మార్చట్లేదంటే.. - శ్రీనివాస్, భక్తుడు, ధర్మపురి
నీళ్లు అధ్వానంగా ఉన్నయ్
డ్రైనేజీ వాటర్ కన్నా అధ్వానంగా ఉన్నయి. ఈ కోనేరు కట్టి ఐదేండ్లు అయితంది. ఇప్పటివరకు నాలుగైదు సార్లు వచ్చిన. ఎప్పుడు చూసినా మురికి నీళ్లు తప్ప మంచినీళ్లు కనపడలే. ఆఫీసర్ల తీరు వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నయ్.- ఆశయ్య, భక్తుడు, మంచిర్యాల