సమ్మక్క‑సారక్క దర్శనానికి తరలివస్తున్న భక్తులు

  • ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం మహా జాతర.. ఇప్పటికే  20 లక్షల మంది భక్తుల రాక
  • ఈ నెల 13 నుంచి వన్‌‌వే ట్రాఫిక్‌‌ రూల్స్‌‌
  • 382 సీసీ కెమెరాల ఏర్పాటు.. 32 చోట్ల పార్కింగ్​ 
  • డ్యూటీలో పోలీసులు సహా 30 వేల మంది
  • పస్రా నుంచి గద్దెల వరకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ
  • హడావుడిగా పనులు.. పూర్తి కాక ముందే ప్రారంభోత్సవాలు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: తెలంగాణ కుంభమేళా ‘మేడారం సమ్మక్క, సారక్క జాతర’కు అంతా ముస్తాబైతున్నది. ఈ నెల 16 నుంచి 19 వరకు మహాజాతర జరగనుంది. గడిచిన వారం, పదిరోజులుగా ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు తరలివస్తున్న భక్తులతో మేడారం కిటకిటలాడుతున్నది. పుణ్యస్నానాలు చేసేవారితో జంపన్నవాగు కళకళలాడుతున్నది. శివసత్తుల పూనకాలతో చెట్టు చేమ ప్రతిధ్వనిస్తున్నాయి. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతున్నది. జాతర జరిగే నాలుగు రోజులు కోటి మందికి పైగా భక్తులు వస్తారనే అంచనా ఉంది. జనవరి నుంచి ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా భక్తులు పిల్లపాపలతో వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖ ఆఫీసర్లు ప్రకటించారు. జాతర ప్రారంభమయ్యే నాటికి మరో 20 లక్షల మంది దాకా రావచ్చంటున్నారు. ఈ  40 లక్షల మందిని పక్కనపెట్టినా మహాజాతర నాలుగురోజుల్లో కోటి వరకు భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి 3,845 బస్సులను నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే వరంగల్‌‌‌‌ ఉమ్మడి జిల్లాలోని అన్ని బస్‌‌‌‌ డిపోల నుంచి రోజూ 35 బస్సులను నడిపిస్తున్నారు. ప్రతి ఆదివారం 50 నుంచి 60 బస్సులను మేడారం నడిపిస్తున్నట్లు ఆర్‌‌‌‌ఎం సూర్యకిరణ్‌‌‌‌ చెప్పారు. 30 మంది భక్తులు ఉంటే చాలు ఆ గ్రామానికి బస్సు పంపించనున్నారు. ఈసారి హెలీకాప్టర్‌‌‌‌, రైల్వేసేవలు కూడా భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.  

కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ రూం.. డ్యూటీలో 30వేల మంది
పోలీస్‌‌‌‌ శాఖ తరఫున మేడారంలో కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌ ‌‌రూం ఏర్పాటు చేశారు. పస్రా, తాడ్వాయి, చిన్నబోయినపల్లి, నార్లాపూర్‌‌‌‌, ఊరట్టం మొదలు కొని మేడారం పరిసర ప్రాంతాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా తెలియడానికి382 సీసీ కెమెరాలను అమర్చారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దనే 30కి పైగా కెమెరాలను బిగించారు. వీటిని పోలీస్‌‌‌‌ శాఖ కంట్రోల్‌‌‌‌రూంలకు అటాచ్ చేశారు. ఇక్కడ భారీ తెరలను ఏర్పాటుచేసి ప్రతి క్షణం పోలీస్‌‌‌‌ ఆఫీసర్లు  పర్యవేక్షిస్తున్నారు. జాతర కోసం పోలీస్​ శాఖతో కలిపి అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి 30 వేల మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. మొత్తం 38 సెక్టార్లుగా విభజించి గతంలో మేడారం డ్యూటీ చేసిన ఆఫీసర్లకు 3 షిప్ట్‌‌‌‌లలో పనిచేసేలా డ్యూటీలు ఇస్తున్నారు. ఇప్పటికే వెయ్యి మంది మేడారంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ఉద్యోగులంతా 3 షిఫ్టుల్లో పనిచేయనున్నారు. ములుగు జిల్లా కలెక్టర్‌‌‌‌ కృష్ణ ఆదిత్య, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ ఐలా త్రిపాఠి,  డీఆర్వో రమాదేవి, ఎస్పీ సంగ్రామ్‌‌ ‌‌సింగ్‌‌‌‌ జి.పాటిల్‌‌‌‌ తదితర అధికారుల పర్యవేక్షణలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్క పోలీస్‌‌‌‌శాఖ నుంచి 10,300, వైద్యారోగ్య శాఖ నుంచి 2 వేలు, పంచాయతీరాజ్‌‌‌‌శాఖ శానిటేషన్‌‌‌‌ విభాగం నుంచి 4 వేల మందికిపైగా ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. 

జాతర పూర్తయ్యేదాకా ముగ్గురు మంత్రులు అక్కడే
జాతర పనులను మంత్రులు సత్యవతి రాథోడ్‌‌‌‌, ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు, ఇంద్రకరణ్‌‌‌‌రెడ్డి పరిశీలిస్తున్నారు. ఈ నెల 14 నుంచి జాతర పూర్తయ్యేదాకా  ఈ ముగ్గురు మేడారంలోనే ఉండి, జాతర విజయవంతం అయ్యేలా పనిచేస్తామని ప్రకటించారు.  జాతర కోసం చేపట్టిన పనుల్లో మిగిలినవి ఈ నెల 10లోగా పూర్తిచేయాలని జిల్లా ఆఫీసర్లను సీఎస్‌‌‌‌ సోమేశ్​‌‌ కుమార్‌‌‌‌ ఆదేశించారు. జాతర పనులు హడావుడిగా సాగుతున్నాయి. బీటీ రోడ్లకు రిపేర్లు,  జాతర కోర్‌‌‌‌ ఏరియాలో సీసీ రోడ్లు వేశారు. 382 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 265 హ్యాండ్‌‌‌‌ పంప్‌‌‌‌లను, 495 బ్యాటరీ ఆఫ్‌‌‌‌ ట్యాప్స్‌‌ అమర్చారు. కొత్తగా మూడు వాటర్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌లు నిర్మించారు. భక్తులు ఉండటానికి వీలుగా గత జాతర సమయంలో నిర్మించిన 5 పెద్ద షెడ్ల వద్ద కిచెన్‌‌‌‌ షెడ్లు, సీసీ రోడ్లను నిర్మించారు. 

30 చోట్ల మెడికల్​ క్యాంపులు
జాతరకొచ్చే భక్తులకు వైద్య సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వం తరపున గతంలో 16 చోట్ల ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుచేస్తే ఈ సారి 30కి పెంచారు. కరోనా నేపథ్యంలో 15 లక్షల కిట్లను అందుబాటులో ఉంచారు. అనుమానం ఉన్న వారికి కరోనా  టెస్ట్‌‌‌‌ చేసి పాజిటివ్‌‌‌‌ అని తేలితే వెంటనే ఐసోలేషన్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్​సెంటర్లనూ ఏర్పాటు చేశారు. టీటీడీ కల్యాణ మండపంలో తాత్కాలికంగా 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో 4 పడకలతో కూడిన 30 వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు.  108 వెహికిల్స్‌‌‌‌ 15, ఆరు 104 వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. 

ఆంధ్రా బెల్లం.. రీ సైక్లింగ్‌‌‌‌ దందా!
మేడారం జాతరలో  బెల్లం రేట్లు ఆకాశన్నంటాయి. ఆంధ్రా నుంచి బెల్లం దిగుమతి అవుతున్నది. గతంలో కేజీ బెల్లం రూ. 40 నుంచి 50 ఉండగా ఇప్పుడు రూ. 60 నుంచి 80 వరకు పెంచి అమ్ముతున్నారు. ఆంధ్రా నుంచి వచ్చిన కొందరు రీ సైక్లింగ్‌‌‌‌ దందా నడుపుతున్నారు. అమ్మవార్లకు సమర్పించిన బెల్లాన్ని దొంగతనంగా షాపులకు తరలించి తిరిగి భక్తులకు విక్రయించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో ఎక్సైజ్‌‌‌‌  ఆఫీసర్ల హస్తం ఉందని  భక్తులు ఆరోపిస్తున్నారు.

వెహికల్స్​ వచ్చిపోయే రూట్లు ఇట్లా..!
మేడారం జాతర జరిగే 4 రోజుల్లో ఆర్టీసీ బస్సులతో పాటు లక్షల్లో వచ్చే ప్రైవేట్​వెహికల్స్​తో  ట్రాఫిక్‌‌ ‌‌జాం తలెత్తకుండా పోలీసులు ఈ నెల 13 నుంచి వన్‌‌‌‌వే ట్రాఫిక్​రూల్స్​ అమల్లోకి తేనున్నారు. ‌‌ ప్రైవేట్‌‌‌‌ వాహనాల్లో భక్తులు జాతరకొచ్చే దారి.. వెళ్లిపోయే దారులు వేర్వేరుగా ఉంటాయని ప్రకటించారు.  హైదరాబాద్‌‌‌‌, రంగారెడ్డి, వరంగల్‌‌, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల‌‌ నుంచి వచ్చే భక్తులు గుడెప్పాడ్‌‌‌‌, పస్రా మీదుగా, కరీంనగర్‌‌‌‌, ఆదిలాబాద్‌‌, మంచిర్యాల మీదుగా మేడారం చేరుకోవాలి. మహారాష్ట్ర ‌‌రూట్ల నుంచి వచ్చేవాళ్లు కాటారం లేదా గాంధీనగర్‌‌‌‌, జంగాలపల్లి క్రాస్‌‌‌‌, పస్రా మీదుగా మేడారం చేరుకోవాలి. ఊరట్టం, చత్తీస్‌‌‌‌గఢ్​, మనుగూరు, భద్రాచలం ‌‌నుంచి వచ్చేవాళ్లు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి మీదుగా మేడారం చేరుకోవాలి. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం..చత్తీస్‌‌‌‌గఢ్​వైపు నుంచి వచ్చిన వాళ్లు అదే దారిలో వెళ్లాలి.  మిగిలినవాళ్లంతా మేడారం‒నార్లాపూర్‌‌ ‌‌క్రాస్‌‌‌‌మీదుగా కమలాపూర్‌‌‌‌ క్రాస్‌‌‌‌రోడ్డుకు చేరుకొని ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మంచిర్యాలకు వెళ్లేవాళ్లు కుడివైపు.. హైదరాబాద్‌‌‌‌, ఖమ్మం, మహబూబాబాద్‌‌‌‌ వెళ్లేవాళ్లు ఎడమవైపు వచ్చి పరకాలకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌‌‌‌కు వెళ్లే వాళ్లు పరకాల నుంచి అంబాల మీదుగా.. మహబూబాబాద్‌‌‌‌, ఖమ్మం వైపు వెళ్లేవాళ్లు గుడెప్పాడ్‌‌, మల్లంపెల్లి మీదుగా వెళ్లాలి.  ఆర్టీసీ, వీఐపీ వాహనాలన్నీ తాడ్వాయి మీదుగా మేడారం వెళ్లి వస్తాయి.

ఆలస్యంగా పనులు.. అంతా ఆగమాగం
మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రూ.75 కోట్ల పనులు హడావుడిగా సాగుతున్నాయి. కనీసం ఆరు నెలల ముందు పనులు మొదలుపెట్టాల్సి ఉండగా గతేడాది నవంబర్‌‌ నెలలో టెండర్లు పిలిచి ప్రారంభించారు. పనులు పూర్తిచేయక ముందే కంప్లీట్‌‌ అయినట్లుగా మంత్రులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.  రూ.10 కోట్లతో పస్రా‒నార్లాపూర్‌‌ రోడ్డు పనులు కంప్లీట్‌‌ చేయకుండానే ప్రారంభించారు. శాశ్వత అవసరాల కోసం రూ.2 కోట్లతో డ్రెస్‌‌ చేంజింగ్‌‌ రూంలు, సులభ్‌‌ కాంప్లెక్స్‌‌లు కట్టారు. కేవలం 50 రోజుల్లో కట్టిన ఈ బిల్డింగ్‌‌లు వచ్చే జాతర నాటికి పనికిరాకుండా పోతాయని భక్తులు అంటున్నారు. రూ.12 కోట్లతో చేపట్టిన ఆర్‌‌డబ్ల్యూఎస్‌‌ పనులపై భక్తులు మండిపడుతున్నారు. తాత్కాలిక మరుగుదొడ్ల పేరిట రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా అవి జాతరలో ఒక రోజు మాత్రమే పనికివస్తున్నాయని, ఆ తర్వాత వాటిని యూజ్‌‌ చేయడం లేదని జాతర సమీక్షలో స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నారు. అయినా పాత పద్ధతిలోనే 6 వేల తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. చాలా చోట్ల సరైన వాటర్‌‌ ఫెసిలిటీస్‌‌ లేవు. సమ్మక్క తల్లి నెలవైన చిలుకల గుట్ట చుట్టూరా ఫెన్సింగ్‌‌ లేకపోవడంతో ఎవరు పడితే వాళ్లు  గుట్ట ఎక్కి అపవిత్రం చేస్తున్నారు.