
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశ్‌కు సోమవారం ఎనిమిదో రోజు పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు భారీ లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. సిటీలోని లంగర్ హౌస్‌కు చెందిన శ్రీకాంత్ అందించిన 2,200 కిలోల లడ్డూను కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. అయితే, ఈ లడ్డూ ప్రసాదాన్ని ఎలాగైనా పొందాలని భక్తులు పోటీ పడ్డారు. క్యూలైన్లలో ఉన్నవారు కూడా ప్రసాదం కోసం పరుగులు తీశారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు లడ్డూ పంపిణీ జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ చౌరస్తా, సోమాజిగూడ, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్, ఎన్టీఆర్ మార్గ్‌పై ట్రాఫిక్‌జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, సినీ నటుడు సుధీర్ బాబు, హీరో కిరణ్ అబ్బవరం బడా గణేశ్‌ను దర్శించుకున్నారు.
ఆర్ఎస్ఎస్ ఘోష్ ప్రదర్శన..
బడా గణేశ్ మండపం వద్ద సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆర్ఎస్‌ఎస్ స్వయం సేవకులు ఘోష్ ప్రదర్శన నిర్వహించారు. ఘోష్ వాదన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత, విభాగ్ అధికారులు పాల్గొన్నారు.